Wednesday, August 6, 2025
E-PAPER
Homeజాతీయంసభను ఎవరు నడిపిస్తున్నారు?

సభను ఎవరు నడిపిస్తున్నారు?

- Advertisement -

– చైర్మెనా? అమిత్‌ షానా?
– రాజ్యసభలో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది ప్రవేశంతో దుమారం
– ఖర్గేతో సహా ప్రతిపక్షాల ఆగ్రహం
– పార్లమెంట్‌ ఇంతలా దిగజారిందా..? అంటూ నిలదీత
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పార్లమెంట్‌లో కేంద్ర బలగాలు సీఐఎస్‌ ఎఫ్‌ని వినియోగిస్తున్నట్టు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళ నను డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ తప్పుపట్టారు. మల్లిఖార్జున రాసిన లేఖను మీడియాకు రిలీజ్‌ చేయడం లేదని హరివంశ్‌ తెలిపారు. సభలో ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న నిరసనను డిప్యూటీ చైర్మెన్‌ ఖండించారు. మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ సభలో సాయుధ బలగాలు మోహరించడాన్ని తీవ్రంగా వ్యతిరే కించారు. ఆ సమయంలో సభాపతి, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది వెల్‌లోకి దూసుకువస్తున్నారని, ఇది ఆశ్చర్యపోయానికి గురి చేసిందని, ఈ ఘటనతో దిగ్భ్రాంతి చెందామని పేర్కొన్నారు.

సభ్యులు తమ ప్రజాస్వామ్య బద్దమైన హక్కుల అంశంలో నిరసన చేపడుతున్నప్పుడు సీఐఎస్‌ఎఫ్‌ దళాలు ఎలా వచ్చాయని ఖర్గే ప్రశ్నించారు. నిన్న (సోమవారం) ఇదే జరిగింది, నేడు (మంగళవారం) ఇదే జరిగిందన్నారు. అంత దిగజారిపోయిందా? ప్రశ్నించారు. సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు సభలోకి రావడం అత్యంత అభ్యంతర కరమని, తాము దాన్ని ఖండిస్తున్నామన్నారు. భవిష్యత్తులో సభ్యులు ప్రజా సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను లేవనెత్తి నప్పుడు సీఐఎస్‌ఎఫ్‌ దళాలు.. హౌస్‌ వెల్‌లోకి దూసుకువస్తాయని అన్నారు. డిప్యూటీ చైర్మెన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ మాట్లాడుతూ సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది కాదని, పార్లమెంటరీ భద్రతా సిబ్బందని తెలిపారు. సభ మర్యాదను కాపాడుకోవడానికి బాధ్యత వహించే వారు మార్షల్స్‌ అని పేర్కొన్నారు.హౌస్‌వెల్‌లోకి కేవలం మార్షల్స్‌ను మాత్రమే అనుమతిస్తారని కేంద్ర మంత్రి రిజిజు తెలిపారు.ఖర్గే సభను తప్పుదోవ పట్టిస్తున్నట్టు ఆరోపించారు. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది హౌస్‌లో ఉన్నట్టు ఖర్గే చేసిన ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. సభను చైర్మెన్‌ నడిపిస్తున్నారా? లేక మంత్రి అమిత్‌ షా నడిపిస్తున్నారా? అని ఖర్గే ప్రశ్నించారు. సభా నాయకుడు జేపీ నడ్డా మాట్లాడుతూ సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం అప్రజాస్వామికమన్నారు. ఖర్గే స్పందిస్తూ ప్రతిపక్ష నేతలుగా రాజ్యసభలో అరుణ్‌ జైట్లీ, లోక్‌సభలో సుష్మాస్వరాజ్‌ ఉన్నప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడానికి కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం కూడా ఒక విధానమేనని అనేవారని గుర్తు చేశారు. తాము ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేస్తున్నామని, ఇది తమ హక్కు అని పేర్కొన్నారు. డీఎంకే మంత్రి తిరుచ్చి శివ మాట్లాడుతూ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు చర్చ కోసమే డిమాండ్‌ చేస్తున్నాయని పేర్కొన్నారు. ”ప్రతిపక్షాలు ఎందుకు నిరసన తెలుపుతున్నాయి? చర్చ కోసం పట్టుపడుతున్నాం. అధికార పక్షం బీఏసీలో చర్చించాలి. చర్చ కోసం పట్టుపట్టే క్రమంలో తమ గొంతు పెంచితే, ప్రతిపక్షం సభకు అంతరాయం కలిగిస్తున్నట్టు అర్థం చేసుకోవడం దారుణం” అని అన్నారు. ”నిజాయితీగా, నిష్పాక్షికంగా ఉంటే ఏం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. ప్రతిపక్షాన్ని అధికార పక్షం సరిగా అర్థం చేసుకోవటం లేదు. సీఐఎస్‌ఎఫ్‌ అక్కడ ఏం చేస్తుంది? వారు మార్షల్స్‌ అని చెబుతున్నారు. కానీ సీఐఎస్‌ఎఫ్‌ వారిని మార్షల్స్‌గా పరిగణిస్తారు. వారు మార్షల్స్‌ లాగా దుస్తులు ధరిస్తారు. కానీ వారు సీఐఎస్‌ఎఫ్‌. పార్లమెంటులో మన ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించారు.
ఇదేం తీరు..?
సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులపై చర్యను తాను ఖండిస్తున్నానని అన్నారు. పార్లమెంట్‌ భద్రతా సిబ్బంది అందరినీ వెనక్కి పంపారని, వారు మూలల్లో కూర్చున్నారన్నారు. ఇప్పుడు వారిని పార్లమెంట్‌ భద్రతా సిబ్బందని చెబుతున్నారని, వెల్‌కి వచ్చిన వారిలో ఎవరూ పార్లమెంటు భద్రతలో భాగం కాదని అన్నారు. వారిని సీఐఎస్‌ఎఫ్‌ నుంచి తొలగించారా? దేశానికి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ ”మార్షల్స్‌, సీఐఎస్‌ఎఫ్‌ వెల్‌లోకి పరిగెత్తిన తీరు చూస్తే, బీహార్‌లోని ఎస్‌ఐఆర్‌పై చర్చ కోరినందుకు మేం నేరస్థులంలా కనిపిస్తోంది. పార్లమెంటు సభ్యులు సభలోకి ప్రవేశిస్తున్నప్పుడు వారిపై దాడి చేశారు. ఒక పురుష మార్షల్‌ రేణుకా చౌదరితో చెడుగా ప్రవర్తించాడు. ఇది సిగ్గుచేటు. రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌ క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -