Tuesday, April 7, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిభారత్‌ పరువు తీస్తున్నదెవరు:ఆత్మగౌరవాన్ని మోడీ పునరుద్ధరిస్తారా?

భారత్‌ పరువు తీస్తున్నదెవరు:ఆత్మగౌరవాన్ని మోడీ పునరుద్ధరిస్తారా?

- Advertisement -


కాలం కలసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నది ఒక లోకోక్తి. తనకు ఎదురులేదన్నట్లుగా నల్లేరు మీద బండిలా నడుస్తున్న నరేంద్రమోడీ పరిస్థితి అలాగే ఉందా? కాలవైపరీత్యం గాకపోతే పొగిడిన మీడియా నోళ్లే అపహాస్యపు శీర్షికలు పెడతాయని ఎవరైనా ఊహించారా! తాజాగా ఒక వార్త శీర్షిక ఇలా ఉంది. ”ఇరాన్‌ యుద్ధ పరిహాసం: ఏడేళ్లలో తొలిసారిగా టెహరాన్‌ నుంచి చమురు తెచ్చుకోనున్న భారత్‌ ”. ఆంగ్లలో ఐరనీ అనే పదానికి పరిహాసం, ఎగతాళి, గేలి ఇలా పర్యాయపదాలు ఎన్నో ఉన్నాయి. మీడియా ఇలాంటి శీర్షిక పెట్టడానికి కారకులు ఎవరు? కచ్చితంగా నరేంద్రమోడీ తప్ప మరొకరు కాదు. అమెరికాను పక్కన పెట్టి హార్ముజ్‌ జలసంధిని తెరిపించేందుకు ఐరోపాలోని ధనిక దేశాలు ప్రారంభించిన ప్రక్రియలో భాగంగా బ్రిటన్‌ కోరిక మేరకు అరవై దేశాల జాబితాలో మనం కూడా చేరాము. ఇది డోనాల్డ్‌ ట్రంప్‌కు కోపం తెప్పిస్తుందో ఏం పాడో, లేకపోతే ”అనుమతి” ఇచ్చాడా, ఏదైనా జరిగి ఉండవచ్చు, ఇంకా ఇలాంటి వాటిని ఎన్ని చూడాల్సి వస్తుందో! ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన తరువాత జరిగిన పరిణామాలను కాషాయదళాలు మింగా కక్కలేకుండా ఉన్నాయి. కడుపులో ఉన్న ఇరాన్‌ వ్యతిరేకతను వెల్లడించలేరు, ఇజ్రాయిల్‌, అమెరికా అనుకూలతను దాచుకోలేని ఒక మానసిక స్థితి,దీనికి చికిత్స లేదు.

ఒకనాడు మన దిగుమతుల్లో ఇరాన్‌ చమురు అగ్రభాగాన ఉంది. అలాంటిది 2019 నుంచి కొనుగోలు నిలిపివేశాము.మనకు ఎక్కడ లబ్ది ఉంటే అక్కడ కొనుక్కుంటాము అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలతో పోల్చితే ఇరాన్‌ చమురు ధర పెరిగిందనా, నాణ్యత పడిపోయిందనా? ఎందుకు నిలిపివేసినట్లు, తిరిగి ఎందుకు కొనుగోలు చేస్తున్నట్లు ? జవాబుదారీ తనంలో ” ఘనత ” వహించిన పెద్దలు నోరు, మెదపరు, ఎందుకంటే దేశం కోసం-ధర్మం కోసం మౌనంగా ఉన్నాం అంటారు. ఏం జరిగినా నోర్మూసుకొని ఉండాలని ఏ సనాతన ధర్మం, ఏ పురాణాలు, ఇతి హాసాలు చెప్పాయి. పాండవులకు అన్యాయం జరిగితే శ్రీకృష్ణుడి రాయబారం, సీతను తిరిగి తనవద్దకు పంపి యుద్ధాన్ని నివారించాలని వాలి కుమారుడు అంగదుడిని శాంతి సందేశంతో రావణుడి వద్దకు పంపిన రాముడు (ఇప్పుడు ఇరాన్‌ యుద్దంలో మధ్యవర్తి పాత్ర పోషిస్తామన్న పాకిస్తాన్‌ను బ్రోకర్‌ అని చౌకబారుగా వర్ణించిన పెద్దలు ఇతిహాసాల్లో జరిగిందాన్ని కూడా అలాగే అంటారేమో ఖర్మ) గురించి చదువుకున్నాం.అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు మనలను ఎవరూ నమ్మని కారణంగా ఎవరూ పిలవటం లేదు, పెద్దరికం వహించాలని కోరటం లేదు గనుక దళారీ అని కసి తీర్చుకున్నాం. ఇప్పుడు మరి అరవై దేశాల చొరవలో మన పాత్రను ఎలా వర్ణిస్తారో తెలియదు.

డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరిస్తే మనం మిత్రదేశమైన ఇరాన్నుంచి చమురు దిగుమతులు నిలిపివేసి అమెరికాను ”సంతుష్టీకరించేందుకు” ప్రయత్నించాం. ఇప్పుడు అదే అమెరికా కావాలంటే ఇరాన్‌ చమురు కొనుక్కోవచ్చు అని చెప్పగానే ఉరుకులు పరుగులతో ఎగబడ్డాం. రెండూ మోడీ ఏలుబడిలోనే జరిగాయి. ఎంత ఆత్మగౌరవం! ఇరాన్‌ నుంచి పింగ్‌ షన్‌ అనే చమురు టాంకరు ఆరులక్షల పీపాల చమురుతో బయలుదేరి గుజరాత్‌లోని వాడినర్‌ రేవుకు చేరనుందని వార్తలు.మన తీరుతెన్నులు చూస్తున్న ఇరాన్‌, ఇతర దేశాల దగ్గర మన గౌరవం పెరిగిందా తరిగినట్లా? రష్యా చమురు సంగతి కూడా అంతే అనుకోండి. అమెరికా ఆంక్షలను ధిక్కరించి మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకోలేదా అని అడ్డు సవాళ్లు విసిరే వారు టెహరాన్‌ నుంచి ఎందుకు నిలిపివేశారో చెప్పాలి. మతకోణం ఉందంటే ఉలిక్కిపడతారా ? అమెరికా ఆడించినట్లు ఆడి 145 కోట్ల దేశం పరువు ఎవరు తీశారు? ఇరాన్‌ విషయంలో అమెరికా తన లక్ష్యాలను గుట్టుచప్పుడు కాకుండా మార్చుకుంది, హార్ముజ్‌ జలసంధి నుంచి మీ చమురు మీరు తెచ్చుకోండి మేం చేసేదేమీ లేదని చేతులెత్తేశాడు ట్రంప్‌. మనం మాత్రం అతగాడి తోకపట్టుకు నడిచి ఇప్పుడు వ్రతం చెడ్దా ఫలం దక్కని స్థితిలో పడ్డాం.ఏం గతంలో వద్దన్నారుగా ఇప్పుడు కావాల్సి వచ్చిందా అని ఇరాన్‌ అనలేదు గనుక సరిపోయింది గాని, అని ఉంటే? అమెరికా మబ్బులను చూసి చేతిలోని ముంతలో నీరు పారపోసుకోకూడదని గ్రహిస్తారా! అమెరికా మీద వ్యతిరేకతతో ఎత్తుగడగా భారత్‌ పట్ల ఇరాన్‌ అనుకూలంగా వ్యవహరిం చిందని, పోరు ముగిసిన తరువాత కూడా అదే విధంగా ఉంటుందా అనే సందేహాలున్నాయి.

ఇదిలా ఉండగా ఏప్రిల్‌ నాలుగవ తేదీన గుజరాత్‌ వాడినార్‌ రేవుకు చేరనుందని చెప్పిన ఇరాన్‌ నౌక మూడు రోజులుగా ప్రయాణ దిశ మార్చుకొని చైనా వైపు పయనిస్తున్నదని శుక్రవారం నాడు నౌకల కదలికలను నమోదు చేసే కెప్లర్‌ సంస్థ పేర్కొన్నది. అయితే వాణిజ్య నౌకలు ఎప్పుడు దిశమార్చుకుంటాయో తెలియదని నౌకనుంచి అందుతున్న సంకేతాలను బట్టి చివరకు అది ఎక్కడకు చేరేది చెప్పలేమని కూడా తెలిపింది. ఎందుకు ఇలా జరిగిందన్న ప్రశ్నకు రిటోలియా అనే సంస్థ చెప్పినదాని ప్రకారం గతంలో 30 నుంచి 60 రోజుల వరకు చెల్లింపులకు గడువు ఇచ్చేవారని, ఆ చమురును అమ్మింది ఎవరో, కొనుగోలు చేసింది ఎవరో కూడా వెల్లడి కాలేదని, ఇప్పుడు ఆ షరతులను కఠినతరం గావించటం కారణం కావచ్చంటున్నారు. చెల్లింపుల సమస్య పరిష్కారమైతే తిరిగి భారత్‌ వైపు ప్రయాణించవచ్చని కూడా రిటోలియా పేర్కొన్నది. వాడినార్‌లో రష్యా కంపెనీ రోస్‌నెఫ్ట్‌కు చెందిన నయారాఎనర్జీ సంస్థ ఏడాదికి రెండు కోట్ల టన్నుల సామర్ధ్యం గల చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తున్నది.

తన రాజకీయ ప్రయోజనం, ఆధిపత్యం, ఇరాన్‌ చమురును కొల్లగొట్టేందుకు, ఇజ్రాయిల్‌ కోసం చేసే రాజకీయాల్లో భాగంగా టెహరాన్‌పై ఆంక్షలు విధించింది. అక్కడి నుంచి చమురు కొనుగోలు చేసే వారి తాటవలుస్తామని ట్రంప్‌ బెదిరించాడు. చైనా మరికొన్ని దేశాలు ఖాతరు చేయకుండా దిగుమతులు చేసుకున్నాయి. అంతకు ముందు 2018-19లో మన దిగుమతి అవసరాల్లో 10-12శాతం అంటే 23-24 మిలియన్‌ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకున్నాం. ట్రంప్‌ 2019లో ఆంక్షలు విధించటంతో ఆ ఏడాది మే నెల నుంచి క్రమంగా తగ్గించి 2019-20లో రెండు మిలియన్‌ టన్నులకు పరిమితం చేసి తరువాత పూర్తిగా నిలిపివేశాం. అంతకు ముందు మనదేశానికి రాయితీలతో పాటు అప్పుకూడా ఇచ్చింది. వాటినే యుపిఏ ప్రభుత్వం చేసిన చమురు అప్పును నరేంద్రమోడీ తాను తీర్చాల్సి వచ్చిందని ప్రచారం చేయ టమే గాక ఆ పేరుతో సెస్సులు, ఇతర భారాలను మోపిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. తరువాత రష్యా నుంచి కొను గోలు చేశాము, దాని మీద కూడా ఆంక్షలు విధించటంతో గరిష్టంగా రోజుకు 20లక్షల పీపాల దిగుమతిని ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సగానికి తగ్గించుకున్నాం. ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన ట్రంప్‌ రష్యా , ఇరాన్‌ నుంచి చమురు తెచ్చుకోవచ్చు అంటూ మనకు ”అనుమతి” ఇచ్చాడు. ఇప్పుడు గతంలో ఇచ్చిన రాయితీని మనం కోల్పోయాము, మార్కెట్‌ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఎందుకీ దుస్థితి?

యుద్ధం కారణంగా ఇప్పటికే జనం మీద భారాలు మోపటం ప్రారంభించారు, పవర్‌ పెట్రోల్‌, పరిశ్రమల్లో వాడే డీజిల్‌, ఇథనాల్‌ లేని పెట్రోలు, గృహ, వాణిజ్య గ్యాస్‌ ధరలను పెంచారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత కచ్చితంగా ధరలు పెరుగుతాయి. ఇప్పటికి ఇప్పుడు ఇరాన్‌ పోరు ముగిసినప్పటికీ ఇంథన ధరలు తగ్గే అవ కాశం లేదని ఐరోపా యూనియన్‌ హెచ్చరించింది. బ్రెంట్‌ రకం చమురు పీపా ధర 70 నుంచి 120 డాలర్ల వరకు పెరిగింది.మనం కొనుగోలు చేసే ముడి చమురు కూడా ఇదేవిధంగా పెరిగింది. సంక్షోభం ముగిసిన తరువాత పూర్వపు స్థితికి ధరలు దిగివస్తాయా? జనం మీద భారం మోపటం లేదంటూనే మానసికంగా సిద్ధం చేస్తున్నారు. చమురు మార్కెట్‌ కంపెనీలకు వస్తున్న నష్టాలను భరించేందుకు ఎక్సయిజ్‌ పన్ను రద్దు చేశామని చెప్పారు. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పిఐబి) ద్వారా మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. నాలుగు వారాల్లో ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 75శాతం పెరిగాయని తెలిపారు. అయినా కొనుగోలు ధరలకంటే తక్కువకే కంపెనీలు వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయని, పెట్రోలు మీద లీటరుకు రూ.26, డీజిలు మీద 81.90 నష్టం వస్తున్నదని, రెండూ కలిపితే రోజుకు రూ.2,400 కోట్ల మేర వాటికి నష్టం వస్తున్నదని పేర్కొన్నారు. ఆసియాలో 30 నుంచి 50, ఉత్తర అమెరికాలో 20, ఐరోపాలో 30శాతం ఇంథన ధరలు పెరిగినట్లు పెట్రోలియం శాఖా మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు రెండు మార్గాలున్నాయని ఒకటి భారీగా ధరలు పెంచటం రెండవది నష్టాలను ప్రభుత్వం భరించటం అంటూ రెండోదానికే ప్రధాని నిర్ణయించినట్లు చెప్పారు.

నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత గ్యాస్‌ మీద నామమాత్ర సబ్సిడీ తప్ప పెట్రోలు, డీజిలు మీద సబ్సిడీ పూర్తిగా ఎత్తివేశారు. సెస్సుల పేరుతో లక్షల కోట్ల భారం మోపారు. 2022కు ముందు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగితే ఆమేరకు పెంపు తగ్గితే తగ్గింపు అన్న విధానాన్ని అమలు చేశారు. ఆ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆ విధానాన్ని పక్కన పెట్టారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినా వినియోగదారులకు తగ్గించలేదు. ముందే చెప్పుకున్నట్లు అసెంబ్లీ ఎన్నికల తరువాత అసలు రంగు బయటపడుతుంది.ప్రతి రోజుకు వస్తున్న రూ.2,400 కోట్లను ప్రభుత్వం భరించాలంటే నెలకు 72వేల కోట్లు అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా ధరలు పెరిగాయని దిగుమతులు నిలిపివేసి రైతులను ఇబ్బంది పెట్టిన పాలకులను ఎవరైనా నమ్ముతారా? గత పదేళ్లలో దాదాపు 25లక్షల కోట్ల రూపాయలను అదనపు ఎక్సయిజ్‌, సెస్సుల రూపంలో వినియోగదారుల నుంచి పిండుకున్న ఘనత మరచిపోగలమా?

రానున్న రోజుల్లో ముడిచమురు ధరల గురించి రాయిటర్స్‌ మార్చినెలలో జరిపిన విశ్లేషణలో 2026లో బ్రెంట్‌ రకం ముడి చమురు సగటున 82.85 డాలర్లు ఉంటుదని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో చెప్పిన 63.85 డాలర్లకంటే ఇది 30శాతం ఎక్కువ. యుద్ధం ఇంకా కొనసాగుతున్నందున ఈ అంచనాలు మారిపోవచ్చు. ఏప్రిల్‌ 11వరకు రష్యా చమురు కొనుగోలుకు ట్రంప్‌ ”అనుమతి” గడువు ఉంది. తరువాత ఆ పిచ్చివాడు ఏం చేస్తాడో తెలియదు. మార్కెట్‌ చరిత్రను చూస్తే 2008లో ముడి చమురు ధర గరిష్టంగా 145 డాలర్లకు చేరింది. ఇరాన్‌ పోరు ఇంకా కొనసాగితే ఆ రికార్డును అధిగమించవచ్చని జోస్యం చెబుతున్నారు.సంక్షోభం మే మొదటి పక్షం వరకు కొనసాగితే 150 డాలర్లకు చేరవచ్చని జెపి మోర్గాన్స్‌ బ్యాంక్‌ ఏప్రిల్‌ మూడవ తేదీన పేర్కొన్నది.(మరికొన్ని సంస్థలు రెండువందల డాలర్లు అన్నాయి) అంతకు ముందు రోజు బ్రెంట్‌ రకం ధర 109 డాలర్లు ఉండగా సమీప భవిష్యత్‌లో 120-130 డాలర్ల మధ్య ఉండవచ్చని మోర్గాన్స్‌ అంచనా వేసింది. ఎలాంటి షరతులు లేకుండా హార్ముజ్‌ జలసంధిని ఒక వేళ ఈ రోజు తెరిచినా సరఫరా వ్యవస్థ పునరుద్ధరణకు మూడు నుంచి ఆరునెలలు పడుతుందని చమురు రంగ నిపుణులు అంటున్నారు.దాడుల్లో జరిగిన నష్టాల తీవ్రత వెల్లడైన తర్వాత మరింత స్పష్టత వస్తుంది. ఇప్పటికైతే అంతా అనిశ్చితే,అస్పష్టతే!

– సత్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -