Monday, May 5, 2025
Homeచౌరస్తాఆ మనిషి ఎవరు?

ఆ మనిషి ఎవరు?

- Advertisement -


అనగనగా ఓ మనిషి. ఆ మనిషికి వుంది ఎంతో ఎత్తుకి ఎదగాలనే ఆశ. ఆ ఆశ మరోటేమీ కాదు, ధనం సంపాదించాలనే దురాశే! ఒళ్లు అలవకుండా, చెమటోడ్చకుండా లక్షలూ, కోట్లూ పోగెయ్యాలి. తను, తన తర్వాత వచ్చే తరాలు నిలబడీ, కూర్చునీ, పడుకుని తిన్నా తరిగిపోని ధనం సంపాదించాలనుకున్న ఆ మనిషి దేవుడు అనేవాడ్ని పదే పదే అడగటం మొదలు పెట్టాడు. దేవుడోరు నీదేభారం అన్నాడు. మనుషుల కోరికల గుర్రాల్ని అదుపులో పెట్టడం కష్టమని దేవుడు మనుషుల ముందు ప్రత్యక్షం అవడానికి జంకుతున్నాడు. కానీ కొందరికి దేవుడు కలలో కనిపించి కోరినదిస్తున్నాడని ఓ బైరాగి చెప్పడంతో మనిషి కలలో దేవుడ్ని చూడటం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. దేవుడి పటం దిండుకింద పెట్టి తొంగుంటే నిద్దట్లో దేవుడో, దేవుడి పి.ఎ. నో, దేవుడి ఛాంబర్‌ దగ్గర డ్యూటీ చేసే బిళ్లబంట్రోతో కనపడకపోడు అని ఆశపడ్డాడు. కొన్నాళ్లకు కోరిన కల రానే వచ్చింది. మనిషి కలలో ఒక ఆకారం నీడలా కనపడింది. క్లియర్‌గా కనపడలేదు కానీ ‘పొగ’లా ఎదుట నిలబడింది.
మనిషి అడిగాడు ‘ఎవర్నువ్వు? నువ్వ నిజంగా దేవుడివేనా? లేక దేవుడు పంపించిన దేవదూతవా?’ అని. ఆ పొగ గాల్లో తేలుతూ ‘పంపింది దేవుడో దయ్యమో నీకేం పని. చెప్పు నీకేం కావాలి? ఏరుకో కోరుకో’ అంటూ పొగ డాన్సు చెయ్యసాగింది. కోరికలు తీర్చేది దేవుడైతేనేం దెయ్యమైతేనేం అనుకుని ‘కోరిక తీరుస్తానంటున్నావు కనుక అడిగేస్తున్నా. నాకు కావలసినంత కంటే ఎక్కువ అంటే లెక్కలేనంత… లెక్కపెట్టలేనంత డబ్బు తప్ప ఇంకేమీ వద్దు!’ అన్నాడు.
‘ఓస్‌ ఇంతే కదా! నీ కెంత కావాలో నీకే క్లారిటీ లేదు కదా. నీక్కావలసిన పెట్టుబడి సొమ్ము ఇస్తా. ఏదైనా వ్యాపారం చేసుకో. కావల్సినంత దోచుకో, దాచుకో’ అంది పొగ.
పెటుబడి పెట్టి వ్యాపారం చేసి, చెమటోడ్చి, నిజాయితీగా డబ్బు సంపాదించే సరికి నడుం విరిగిపోతుంది. వెన్నెముక వంగిపోతుంది. పాతికేళ్లు కరిగిపోతయి. బ్లడ్‌లో బ్లాక్‌లు పేరుకుపోతయి. అదంతా అవని, కాని పని. పెట్టుబడి అక్కర్లేకుండా, చొక్కా ఇస్త్రీ నలగకుండా చేసే పనేదైనా వుంటే చెప్పు. రాబడే తప్ప పోబడి వుండకూడదు. పాసుబుక్కులు తప్ప అకౌంటు బుక్కులుండరాదు. అలాంటిదేదైనా వుంటే చెప్పు. కాదంటే గప్‌చుప్‌గా ‘గాయబ్‌ అయిపో’ అన్నాడు మనిషి.
‘అదా నువ్వు కోరుకునేది! పెట్టుబడి లేని అలసిపోని సంపాదనా? సరే! ఓ సారి నీ చెవి ఇలాగియ్యి. రహస్యం చెవిలో ఊదుతా!’ అంది పొగ. మనిషి చెవి కొరికింది పొగ.
‘కులమంటే కులం… మాదే గొప్పకులం. నీదేం కులం? అదో కులమా, అదో గోత్రమా? మాట్లాడితే నాలుక తెగ్గోస్తా. చెయ్యెత్తితే నరికేస్తా. తల ఎత్తితే పీక కోస్తా. రా.. రా.. నా చేతుల్లో చచ్చావే. ఎక్కడున్నార్రా? రండి.. రండి.. మన కులాన్ని దూషించారు, నానా బూతులు అంటున్నారు. తేల్చుకుందాం, మన కులం గొప్ప ఎంతో, ఏమిటో తెలిసేట్టు చేద్దాం’ అన్నాడు మనిషి.
అరుపులు… కేకలు… విరిగే కర్రలు… పలిగే తలలు… అమ్మా.. అయ్యా… అబ్బా… ఫట్‌.. ఫట్‌.. రక్తం.. ఎటు చూసినా బ్లడ్డే.
ఏ పెట్టుబడి లేకుండా శరీరం అలవకుండా, కులం పేరున జనాన్ని రెచ్చగొట్టిన మనిషి కులం పెట్టుబడితో అడ్డదిడ్డంగా డబ్బు పోగుచేసుకున్నాడు.
అయినా మనిషికి తృప్తి కలగలేదు. ఆశలు తగ్గలేదు. ఇంకా ఇంకా సంపాదించాలనే తాపత్రయం మాత్రం పెరిగిపోయింది.
మనిషి మళ్లీ రాత్రుళ్లు దేవుడో దయ్యమో కనిపించడానికి కలలు కనడం మొదలు పెట్టాడు. కొన్నాళ్లకి ఆ మనిషి కల్లో ఓ ఆకారం పొగలా వచ్చి ఎదురుగ్గా నిలబడింది.
‘ఏం మనిషీ బాగానే గిట్టుబాటయింది కదా. కులం కూడు పెట్టింది కదా! మళ్లీ ఎందుకు పిలుస్తున్నావ్‌?’ అని అడిగింది.
‘ఏం సంపాదన? ఏ మూలకి సరిపోతుంది. నా తర్వాతి తరాల వారి సంగతేమిటి? పెట్టుబడి లేని వ్యాపారం, ఒంటికి మట్టి అంటుకోని వ్యవహారం కావాలి, మళ్లీ మరొక్కసారి చెవి కొరకవా ప్లీజ్‌!’ అన్నాడు మనిషి. మనిషి అందించిన చెవిని కసిక్కిన కొరికింది పొగ.
‘మతమంటే మతం… మాదే గొప్ప మతం. మాదే అసలు మతం. మీదీ ఓ మతమా? మీ దేవుడూ దేవుడేనా? నరికేస్తాం, కోసేస్తాం. రండి రా రండి! ఎవర్రా అక్కడీ ఏం చేస్తున్నార్రా? వీళ్లు మన మతాన్ని బండ బూతులు తిడుతున్నారు. మన దేవుడ్ని ఉప్మాలో కరివేపాకులా తీసి అవతల పడేస్తున్నారు. తేల్చుకుందాం రండి, వాళ్ల మతమో మరి మన మతమో’ అని వెర్రికేకలు పెట్టాడు మనిషి.
అరుపులు… కేకలు.. విరిగే కర్రలు.. ఎగిరే కత్తులు… అమ్మా.. అయ్యా.. అయ్యో… ఫట్‌.. ఫట్‌.. రక్తం.. ఏరులై పారే రక్తమే.
పెట్టుబడి లేదు. శరీరం అలసిపోయింది లేదు. మతం పేరుతో జనాన్ని రెచ్చగొట్టిన మనిషి అడ్డదిడ్డంగా పోగు చేసుకున్నాడు డబ్బు.
మనిషికి తృప్తి అనేదే లేదు. మనిషి ఆశకు అంతనేదే లేదు. ఇంకా ఇంకా కావాలనే తాపత్రయం మాత్రం చెక్కుచెదరలేదు.
మళ్లీ రాత్రుళ్లు దేవుడ్ని, దయ్యాన్ని ప్రార్థిస్తూ పడుకోవడం మొదలు పెట్టాడు. దేవుడికి తీరక లేకపోయినా దెయ్యం తప్పకుండా వస్తుందనుకున్నాడు. కొన్నాళ్లకి ఓ ఆకారం పొగలా వచ్చి మనిషి కలలో కనపడింది.
‘ఏం మనిషీ! అంతా ఓకే కదా. అన్నీ నోట్ల దొంతర్లే కద. గోడల్లో, మంచాల్లో, అటకల మీద, ఎక్కడెక్కడ ఎన్ని నోట్లో లెక్కపెట్టలేవు కదా! మతం అందలం ఎక్కించింది కదా! మళ్లీ ఎందుకు పిలిచావు?’ అంది పొగ.
‘నువ్వు దేవుడికి కావు, దయ్యానివన్న సంగతి నాకర్థం అయింది. నువ్వు నా చెవి కొరకడమే అందుకు కారణం. మరొకసారి చెవి కొరకవా ప్లీజ్‌!’ అన్నాడు మనిషి.
వీడికి తృప్తి అనే మాటకు అర్థం తెలీనే తెలీదు అనుకున్న పొగ మనిషి చెవి ఊడి వచ్చేట్టు కొరికింది. ‘కులం, మతం, ప్రాంతం, భాష, రంగు అన్నింటినీ వాడుకో. జనాన్ని రెచ్చగొట్టు. వాళ్ల మెదడు మొద్దుబారేట్టు చెయ్యి. వాళ్లు విచక్షణను కోల్పోయేట్టు చెయ్యి. నిజానికి నీకు ఏ కులం లేదు, మతం లేదు. భాషా, ప్రాంతమూ, రంగూ అన్నీ అవసరానికి పెట్టుబడిగా వాడుకో! అభిమానాన్ని దురభిమానంగా, దురభిమానాన్ని యుద్ధంగా, యుద్ధాన్ని మరణంగా, మరణాన్ని మారణహోమంగా మార్చి విధ్వంసాన్ని కొనసాగించు’ అంది పొగమంచు.
పొగదయ్యం మనిషికి చెప్పిన చివరి రహస్యం ఇదే. ఈ రహస్యం తెల్సుకుని వాడుకుంటున్న ఆ మనిషి మరెవరో కాదు, రాజకీయ నాయకుడే!!

  • చింతపట్ల సుదర్శన్‌
    9299809212
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -