– నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి
– యూపీఎస్సీ నుంచి జాబితా రాగానే నిర్ణయం
– జాబితాను గతంలోనే పంపామంటున్న ప్రభుత్వ వర్గాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర పూర్తిస్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) నియామకంపై సర్కారు దృష్టి సారించింది. నాలుగు వారాల్లోగా పూర్తిస్థాయి డీజీపీని నియమించాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)ల మధ్య దోబూచులాట జరుగుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా సుప్రీం ఆదేశాల ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా డీజీపీ నియామకానికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఆ పోస్టుకు అర్హులైన సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపించాల్సి ఉంటుంది. కనీసం ఐదుగురు అధికారుల పేర్లను పేర్కొంటూ వారి సర్వీసు, శాంతి భద్రతల పరిరక్షణలో వారి అనుభవంతో పాటు వారిపై ఏవేనీ ఆరోపణలు ఉంటే దానికి సంబంధించిన వివరాలను యూపీఎస్సీకి నివేదించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జితేందర్ డీజీపీగా ఉద్యోగ విరమణ చేశాక బత్తుల శివధర్‌రెడ్డిని డీజీపీ (ఇంచార్జ్)గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం ఈ నియామకం జరగలేదంటూ రాష్ట్ర హైకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా.. దానిని పరిశీలించిన హైకోర్టు పూర్తిస్థాయి డీజీపీ నియామకంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ఒకపక్క ప్రభుత్వం కసరత్తు జరుపుతుండగానే, మరోవైపు సుప్రీంకోర్టులో సైతం ఈ వివాదంపై వేసిన వ్యాజ్యానికి సంబంధించి విచారణ జరిగింది. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలిస్తూ నాలుగు వారాల్లోగా పూర్తిస్థాయి డీజీపీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదిలా ఉంటే, రాష్ట్రంలో డీజీపీ స్థాయి హౌదాలో ఉన్న అధికారులు ఆరుగురు ఉన్నారు. ఇందులో 1990 బ్యాచ్‌కు చెందిన సి.వి ఆనంద్ హౌంశాఖ ముఖ్య కార్యదర్శిగా, 1994 బ్యాచ్‌కు చెందిన ప్రభాకర్ ఆప్టే కేంద్ర హౌం శాఖలో పని చేస్తున్నారు. ఇక అదే 1994 బ్యాచ్‌కు చెందిన అభిలాష బిస్త్.. రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా, శివధర్‌రెడ్డి రాష్ట్ర డీజీపీగా, సౌమ్యామిశ్రా రాష్ట్ర జైళ్ల శాఖ డీజీగా, శిఖా గోయెల్ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో పాటు విజిలెన్స్ విభాగం డీజీగా విధులను నిర్వర్తిస్తున్నారు. ఇందులో సి.వి ఆనంద్‌కు 2028 వరకు, ప్రభాకర్ ఆప్టేకు 2029 వరకు సర్వీసు ఉండగా.. ఈ ఏడాది జూన్‌లో అభిలాష బిస్త్, ఏప్రిల్‌లో శివధర్‌రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇక సౌమ్యామిశ్రాకు 2027 వరకు, శిఖా గోయెల్‌కు 2029 వరకు సర్వీసు ఉన్నది.
ఈ నేపథ్యంలో గతంలో మాజీ డీజీపీ ప్రకాశ్‌సింగ్ పోలీసు శాఖలో సంస్కరణలకు సంబంధించి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం… రిటైర్మెంట్‌కు కనీసం రెండేండ్లు సర్వీసు ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారిని డీజీపీగా నియమించాలని ఆదేశాలిచ్చింది. ఒకవేళ రెండేండ్ల కంటే తక్కువ సర్వీసు ఉన్న అధికారిని డీజీపీగా నియమించాల్సి వస్తే ఆ అధికారిని ఆ రెండేండ్లు పూర్తయ్యేవరకు ఆ పోస్టులో కొనసాగించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డీజీపీ హౌదాలో ఉన్న ఆరుగురు అధికారుల పేర్లు యూపీఎస్సీ పరిశీలనలో ఉన్నాయనీ, తాము ఇది వరకే జాబితాను పంపించామని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ తన పరిశీలనకు వచ్చిన ఈ ఆరుగురు అధికారుల జాబితా నుంచి ముగ్గురిని ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. ఆ ముగ్గురిలో నుంచి ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరి పేర్లను యూపీఎస్సీ ఎంపిక చేసి పంపుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఈ జాబితాలో ఉన్న ప్రభాకర్ ఆప్టే తాను కేంద్రంలోనే కొనసాగుతానంటూ ప్రభుత్వానికి సమాచారం పంపితే సీనియారిటీ ప్రకారం సి.వి ఆనంద్, అభిలాష బిస్త్, శివధర్‌రెడ్డిల పేర్లను యూపీఎస్సీ ఎంపిక చేసి పంపే అవకాశం ఉంటుందని ఐపీఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మరోపక్క శివధర్‌రెడ్డికి రెండు నెలలు సర్వీసు మాత్రమే ఉన్నదనీ, మరోవైపు అభిలాష బిస్త్‌కు ఐదు నెలల సర్వీసు మాత్రమే ఉందని యూపీఎస్సీ భావిస్తే సౌమ్యామిశ్రా, శిఖా గోయెల్‌ల పేర్లను పంపించే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తున్నది. ఏది ఏమైనప్పటికీ.. సుప్రీంకోర్టు విధించిన నాలుగు వారాల గడువులోగా పూర్తిస్థాయి డీజీపీని ఎంపిక చేయాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారుపై ఉంది.
పూర్తిస్థాయి డీజీపీ ఎవరు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



