ఉత్కంఠగా మేయర్, చైర్మెన్ల ఎన్నిక
నేడు కొలువు దీరనున్న మున్సిపల్ నూతన పాలకవర్గాలు
డిప్యూటీ మేయర్, వైస్ చైర్మెన్ పోస్టులపైనా ఆసక్తి
జనరల్ స్థానాల్లో విపరీతమైన పోటీ
రిజర్వేషన్ స్థానాల్లో ‘డిప్యూటీ’ పోస్టులకు క్రేజ్
హంగ్ పరిస్థితులు ఉన్న చోట సవాల్‌గా ఎంపికలు
క్యాంపుల్లో విజేతలు..సర్దిచెప్పే పనిలో నేతలు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, ఏడు నగరపాలక సంస్థల పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి మున్సిపాలిటీల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చైర్ పర్సన్స్, చైర్మెన్, మేయర్లు… ఇతర పాలకవర్గ సభ్యుల చేత కమిషనర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎన్నికైన వార్డు సభ్యులు, కార్పొరేటర్లు అందరూ సోమవారం ఉదయం 11:00 గంటలకు పదవీ ప్రమాణం చేస్తారు.
ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే, మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మేయర్లు, డిప్యూటీ మేయర్లు (కార్పొరేషన్లలో), చైర్మెన్లు, వైస్ చైర్మెన్లను (మున్సిపాలిటీల్లో) ఎన్నుకుంటారు. ఫిబ్రవరి 11న జరిగిన పోలింగ్ ఫలితాలు 13న విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. 116 మున్సిపాలిటీల్లో 64, 7 కార్పొరేషన్లలో నాలుగింటిని చేజిక్కించుకుంది. సుమారు 33 నుంచి 37 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాక హంగ్ ఏర్పడింది. బీఆర్‌ఎస్ 13 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్‌లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
చైర్మెన్, మేయర్, ఇతర ముఖ్య పదవులపై ఆరా..!
క్యాంపుల్లో ఉన్న విజేతలు, వారి తరపు బంధు, మిత్రులను మేయర్, చైర్మెన్‌తో పాటు డిప్యూటీ మేయర్, వైస్ చైర్మెన్ పదవులు ఎవరికి కేటాయిస్తున్నారనే విషయమై బయట నుంచి ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. హంగ్ పరిస్థితులు ఉన్నచోట ఫోన్ల పైనా నిఘా ఉంచడంతో అక్కడి విషయాలు బయటకి రావటం ఒకింత కష్టంగా మారింది. అయినప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా శిబిరాల్లో ఉన్నవారు క్యాంప్ విషయాలను బయటకు చేరవేస్తున్నారు. పార్టీలకు స్పష్టమైన మెజార్టీలు ఉన్నచోట అభ్యర్థులతో పాటు ఫోన్లు కూడా అనుమతించారు. అయితే చైర్మెన్, వైస్ చైర్మెన్ పదవుల విషయం బయటకు పొక్కకుండా చూసుకోవాలని ఒకటికి పది సార్లు సూచిస్తున్నారు.
అసంతృప్తులకు బుజ్జగింపులు
కొన్నిచోట్ల చైర్మెన్, మేయర్ క్యాండిడేట్లు ఎవరనేది ముందుగానే నిర్ణయమైనప్పటికీ… కొన్నిచోట్ల చైర్మెన్ అభ్యర్థులుగా నిర్ధారించిన వారు ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఎవర్ని చైర్మెన్‌గా ఎంపిక చేస్తారనేది ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ స్థానాల్లో ఆ సామాజిక తరగతి నుంచి ముగ్గురు, నలుగురు గెలుపొందడంతో వారిలో ఎవర్ని పదవులు వరిస్తాయనే దానిపై ఆసక్తి ఉంది. ఒకరికి పదవి ఇస్తే మిగతావారిలో అసంతృప్తి నెలకొనే అవకాశం ఉన్న దృష్ట్యా అటువంటి వారిని బుజ్జగిస్తున్నారు.
మరో విధంగా అవకాశాలు ఇద్దామని హామీలు ఇస్తున్నారు. ఇక్కడ సీనియార్టీతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల ఆశీస్సులు ఉన్నవారిని పదవులు వరించే అవకాశం ఉంది. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ పదవుల కేటాయింపులు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఆయా మున్సిపాలిటీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అంతో ఇంతో తీసుకుని పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. లేదంటే తమకు బాగా అనుకూలంగా ఉండేవారికి ప్రాధాన్యత ఇస్తున్నారని క్యాంపుల నుంచి అసంతృప్తి బయటకు పొక్కుతోంది.
జనరల్ స్థానాల్లో తీవ్ర పోటీ
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లు ముందుగానే ప్రకటించారు. వీటిలో 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. మున్సిపల్ చైర్మెన్, మేయర్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వ్ చేశారు. మేయర్ పదవుల్లో కొత్తగూడెం – ఎస్టీ జనరల్, రామగుండం – ఎస్సీ జనరల్, మహబూబ్‌నగర్ – బీసీ మహిళ, మంచిర్యాల, కరీంనగర్ – బీసీ జనరల్, హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ కార్పొరేషన్లను జనరల్ మహిళకు కేటాయించారు. గ్రేటర్ వరంగల్ అన్‌రిజర్వ్ చేశారు. రాష్ట్రంలో 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీలకు, 17 ఎస్సీలకు, 38 బీసీలకు రిజర్వ్ చేశారు.
మిగిలిన 61 పురపాలక సంఘాల్లో 31 జనరల్ మహిళలకు, 30 జనరల్‌కు కేటాయించారు. జనరల్, జనరల్ మహిళలకు కేటాయించిన మేయర్, చైర్మెన్ పదవులకు తీవ్ర పోటీ నెలకొన్నది. రిజర్వేషన్ స్థానాల్లో డిప్యూటీ మేయర్, వైస్ చైర్మెన్ పదవులకు విపరీతమైన పోటీ ఉంది. ఈ పదవులకు ఎలాంటి రిజర్వేషన్ లేకపోవడంతో ప్రతి ఒక్కరూ వీటిని ఆశిస్తున్నారు. తమకు ఏమైనా తక్కువ.. అనే రీతిలో వాదన చేస్తున్నారు. క్యాంపుల్లో వర్గాలుగా విడిపోయి ఈ పదవుల విషయంలో పోటీపడ్డారు. సమీకరణాలు, భవిష్యత్ రాజకీయ అవసరాలు, విశ్వసనీయత, విధేయత ఆధారంగా పదవులకు ఎంపికలు చేశారు.
హంగ్ మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో హంగ్ ఏర్పడిన కొన్ని ముఖ్యమైన మున్సిపాలిటీలపై పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ముఖ్యంగా అధికార పార్టీ మెజార్టీ సంకీర్ణ మున్సిపాలిటీలను ‘చే’జిక్కించుకునేందుకు క్యాంపు రాజకీయాల ద్వారా చక్రం తిప్పింది. మెజార్టీ హంగ్ మున్సిపాలిటీలను దక్కించుకునే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులపై ఉంచారు. రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్, కోహిర్, జిన్నారం, మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర, అమరచింత, వరంగల్ ఉమ్మడి జిల్లా జనగామ, పరకాల, కేసముద్రం, వర్ధన్నపేట, మహబూబాబాద్, అలంపూర్, ఆసిఫాబాద్, జమ్మికుంట, వేములవాడ, నర్సాపూర్, కామారెడ్డి, రాయికల్ వంటి మున్సిపాలిటీలపై దృష్టి పెట్టారు.
హంగ్ మున్సిపాలిటీల్లో చైర్మెన్ పీఠాలను దక్కించుకోవడానికి స్వతంత్ర అభ్యర్థులు, ఎంఐఎం, కమ్యూనిస్టులు, ఎక్స్-అఫీషియో సభ్యుల ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. సంకీర్ణ స్థితి ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో మిగిలిన చోట కూడా మంత్రులు ఈ దిశగా ప్రయత్నాలను పూర్తి చేశారు. హంగ్ పరిస్థితులను అధిగమించేందుకు సర్దుబాట్లు, బుజ్జగింపులు చేస్తున్నారు. మరోవైపు రామగుండం మున్సిపాల్టీలో గెలిచిన కార్పొరేటర్లు ఆదివారం స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ నేతృత్వంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. శనివారం వడ్డేపల్లిలో గెలిచిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లు కూడా సీఎంను కలిసిన విషయం తెలిసిందే. అన్ని రాజకీయపార్టీలు తమస్థాయిలో వ్యూహ ప్రతివ్యూహాల్లో బిజీగా ఉన్నాయి.
క్యాంప్ రాజకీయాలు
మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం క్యాంప్ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా సుమారు 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో (హంగ్), స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల విజేతలను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచించాయి. మున్సిపల్ ఛైర్మెన్లు, మేయర్ల ఎన్నిక వరకూ అభ్యర్థులు చేజారకుండా పార్టీలు చర్యలు చేపట్టాయి. గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను హైదరాబాద్ శివార్లలోని రిసార్టులు, రహస్య శిబిరాలకు తరలించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థులను మహారాష్ట్రలోని క్యాంపులకు తరలించారు. హంగ్ మున్సిపాలిటీలైన వేములవాడ, జమ్మికుంట, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అక్కడ క్యాంప్ రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయి.
కాంగ్రెస్ 116 మున్సిపాలిటీల్లో సుమారు 64 చోట్ల మెజారిటీ సాధించినప్పటికీ, హంగ్ ఏర్పడిన చోట్ల స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్ ప్రత్యేక వ్యూహాలను అమలు చేశారు. బీఆర్‌ఎస్ – బీజేపీ తమ అభ్యర్థులను కాపాడుకోవడంతో పాటు, ఇతర పార్టీల అసంతృప్త నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. జగిత్యాలలో ఒకే పార్టీ (కాంగ్రెస్)లోని ఇద్దరు నేతల (జీవన్ రెడ్డి-సంజయ్ కుమార్) మధ్య విభేదాల కారణంగా అభ్యర్థులను విడివిడిగా క్యాంపులకు తరలించడం గమనార్హం. ఎన్నికైన అభ్యర్థులను నేరుగా చైర్మెన్/మేయర్ ఎన్నిక రోజైన సోమవారం మున్సిపల్ కార్యాలయాలకు తీసుకువచ్చేలా పార్టీలు పక్కా ప్లాన్ చేశాయి.



