Tuesday, February 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపట్టణాల్లో పట్టం ఎవరికీ?

పట్టణాల్లో పట్టం ఎవరికీ?

- Advertisement -

ఓటర్ల తీర్పుపై ఆసక్తి
కాంగ్రెస్‌ పై’చేయి’ సాధించేనా
ప్రభుత్వ వైఫల్యాలపైనే బీఆర్‌ఎస్‌ ఆశలు
తగ్గుతున్న మోడీ గ్రాఫ్‌
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులివ్వని బీజేపీ
ప్రజా సమస్యలే ఎజెండాగా వామపక్షాల ప్రచారం


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా హోరాహోరీగా ప్రచారం సాగింది. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సహా బీజేపీ, ఎంఐఎం, సీపీఐ(ఎం), సీపీఐ, ఫార్వర్డ్‌బ్లాక్‌, జనసేన, బీఎస్‌పీ అభ్యర్థులు, వారికి అనుకూలంగా ఆయా పార్టీల ప్రధాన నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సోమవారంతో ప్రచారపర్వం ముగిసింది. రాష్ట్రంలోని 116 మున్సిపాల్టీలు, ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లలో బుధవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

ప్రచార పర్వం ముగియడంతో ఇప్పుడు మున్సిపాల్టీల్లోని ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారనేది చర్చనీయాంశంగా మారింది. పట్టణ ప్రాంతాల ఓటర్లు కావడంతో ఎవరికి పట్టం కడతారన్న అంశం ఆసక్తికరంగా ఉన్నది. పట్టణాల్లో విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, నిరుద్యోగ యువకులతోపాటు పేదలు కూడా గణనీయంగా ఉంటారు. ఎక్కువ మంది చదువుకున్న ఓటర్లుగా ఉండడంతో ఎవరికి మద్దతుగా నిలబడతారనేది కీలకంగా మారింది. దీంతో గెలుపెవరిది?అన్న చర్చ ఊపందుకుంది.

పంచాయతీ ఫలితాలు పునరావృతమయ్యేనా?
రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నది. ఈనెల నాలుగో తేదీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులంతా మున్సిపాల్టీల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. పదేండ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ చేసిన మోసాల గురించి ప్రజలకు చెప్పారు. 12 ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేస్తున్న అన్యాయంపైనా వివరించారు. అయితే స్థానిక సంస్థల్లో ఏ ఎన్నికలు జరిగినా అధికార పార్టీ గెలుపునకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

పంచాయతీ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయా?, కాంగ్రెస్‌ ఆశలు ఫలిస్తాయా?అన్నది వేచిచూడాల్సిందే. కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలతోపాటు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగింది. 66 శాతం సర్పంచ్‌ స్థానాలను కైవసం చేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో 90 శాతం వరకు కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం మంత్రులకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలను అప్పగించారు. అధికార కాంగ్రెస్‌కు ప్రజలు ఏ మేరకు అండగా నిలబడతారో ఈనెల 13న ఓట్ల లెక్కింపుతో తేలిపోతుంది.

ప్రభుత్వ వ్యతిరేకతపైనే బీఆర్‌ఎస్‌ చూపు
ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపైనే బీఆర్‌ఎస్‌ ఆశలు పెట్టుకుంది. ఆరు గ్యారంటీలు, ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాలను బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రచార అస్త్రాలుగా ఉపయోగించారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి పాలన వల్ల అన్ని వర్గాల ప్రజలు ఎలా మోసపోయారో వివరించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం పంచాయతీ ఎన్నిక ల్లో బీఆర్‌ఎస్‌ 27.64 శాతం సర్పంచ్‌ స్థానాలను గెలిచింది. బీఆర్‌ఎస్‌ లెక్కల ప్రకారం 40 శాతం సీట్లు సాధించినట్టు ప్రకటించింది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొంత జోష్‌ నెలకొంది. అయితే 2020లో బీఆర్‌ఎస్‌ హయాంలో 120 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగాయి. అందులో బీఆర్‌ఎస్‌ 112 (93.33 శాతం), కాంగ్రెస్‌ 4 (3.33 శాతం), బీజేపీ 2 (1.67 శాతం), ఎంఐఎం 2 (1.67 శాతం) గెలుపొందాయి. పది మున్సిపల్‌ కార్పొరేషన్లలో బీఆర్‌ఎస్‌ 9 (90 శాతం), కాంగ్రెస్‌-బీజేపీ కలిపి 1 (10 శాతం) మణికొండలో గెలిచాయి. పట్టణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు బలంగానే ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు ఏమేరకు ఆదరిస్తారో వేచిచూడాల్సిందే.

ప్రజలను ఆకర్షించని బీజేపీ
మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలను బీజేపీ ఆకర్షించలేకపోయింది. ఈనెల ఒకటిన ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులను కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పెడచెవిన పెట్టింది. విభజన హామీలను విస్మరించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తెలంగాణకు వచ్చినా ఏం చేశారో, నిధులు ఏం ఇచ్చారో చెప్పే పరిస్థితి లేదు. కార్పొరేట్‌ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలతోపాటు అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ప్రధాని మోడీ గ్రాఫ్‌ తగ్గింది.

ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నించడం, కార్మికుల హక్కులను హరించేలా లేబర్‌ కోడ్‌లను తేవడం, విద్యుత్‌ సవరణ బిల్లు నిర్ణయాలతో కేంద్రంలోని బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఆ ప్రభావం తెలంగాణలోనూ ఉన్నది. ఇంకోవైపు ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులను తేవడంలో విఫలమయ్యారన్న విమర్శ ఉన్నది. ఇవన్నీ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ పట్ల ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశమున్నది.

ప్రజలు కేంద్రంగా వామపక్షాల ప్రచారం
రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు కేంద్రంగానే వామపక్షాలు ప్రచారాన్ని నిర్వహించాయి. బూర్జువా పార్టీల తరహాలో వ్యక్తిగత దూషణలు కాకుండా ప్రజా సమస్యలే ఎజెండాగా పనిచేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాయి. సీపీఐ(ఎం), సీపీఐ అభ్యర్థులు గెలిస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్న విషయాన్ని ఓటర్ల దృష్టికి తీసుకెళ్లాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -