– వారం రోజుల్లో భారత జట్టు ఎంపిక
– శుభ్‌మన్ గిల్‌కు రీ ఎంట్రీ చాన్స్
– 2025 ఆసియా కప్ టీ20
ఇంగ్లాండ్ పర్యటనలో రెడ్ బాల్ ఫార్మాట్‌లో మెప్పించిన టీమ్ ఇండియా.. ఇప్పుడు వైట్‌బాల్ ఫార్మాట్‌పై ఫోకస్ పెట్టనుంది. ఐదు టెస్టుల్లో అసమాన ప్రదర్శన చేసిన టీమ్ ఇండియా.. టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీని సమం చేసింది. ఆసియా కప్‌లో టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు భారత జట్టు మరోసారి యుఏఈలో సమరానికి సై అంటోంది. టీ20 ఫార్మాట్ ప్రణాళికల్లో ఉన్న ఆటగాళ్ల మెడికల్ నివేదికలు సెలక్షన్ కమిటీకి అందటంతో ఈ నెల 19 లేదా 20న ఆసియా కప్‌కు భారత జట్టును ఎంపిక చేయనున్నారు.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ తర్వాత పొట్టి ఫార్మాట్ వెనక్కి వెళ్లగా… భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఐదు టెస్టులు ఆడేసింది. సుదీర్ఘ సిరీస్ అనంతరం భారత క్రికెటర్లు విలువైన విశ్రాంతి అనంతరం మరో మెగా టోర్నమెంట్‌కు పయనం కానున్నారు. సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ఆరంభం కానుండగా.. భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ పర్యటన వాయిదా పడగా… ఇప్పుడు భారత క్రికెట్ ఫోకస్ పూర్తిగా ఆసియాకప్‌పైనే నెలకొంది. ప్రతిష్టాత్మక కాంటినెంటల్ టోర్నమెంట్‌లో పొరుగు దేశాలు భారత్, పాకిస్తాన్‌లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఫైనల్స్‌కు ముందే భారత్, పాకిస్తాన్‌లు రెండు సార్లు కచ్చితంగా తలపడే విధంగా టోర్నమెంట్ ఫార్మాట్ ఉంది. సూపర్-4 దశలో దాయాదులు ఉత్తమ ప్రదర్శన చేయగిలిగితే.. ఫైనల్లోనూ ఢకొీట్టేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ ముఖాముఖి ఢ ఉండటంతో ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఆసియా కప్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత క్రికెట్ ఆధునిక దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకటంతో జట్టు కూర్పుపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ వారంలో ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ కోచ్ గౌతం గంభీర్‌లు సైతం ఈ సెలక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కానున్నట్టు సమాచారం.
శుభ్‌మన్ గిల్ పునరాగమనం!?
ఇటీవల భారత టీ20 ఫార్మాట్ ప్రణాళికల్లో శుభ్‌మన్ గిల్ పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. కానీ ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో శుభ్‌మన్ సూపర్ ఫామ్‌తో అతడిని పక్కన పెట్టే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025లోనూ గుజరాత్ టైటాన్స్ తరఫున శుభ్‌మన్ గిల్ గొప్పగా రాణించాడు. సీజన్లో 650 పరుగులు సాధించిన శుభ్‌మన్ గిల్ భీకర ఫామ్‌లో కనిపించాడు. టెస్టు జట్టు కెప్టెన్‌గానూ శుభ్‌మన్ గిల్ ప్రాధాన్యత డ్రెస్సింగ్‌రూమ్‌లో గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా వచ్చే సూచనలు ఉన్నాయి. కేరళ స్టార్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ నం.3 స్థానంలో రానుండగా… కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో యశస్వి జైస్వాల్‌కు మంచి రికార్డుంది. ఐపీఎల్ సహా దేశవాళీ సర్క్యూట్‌లో యశస్వి జైస్వాల్‌కు మంచి రికార్డుంది. అయినా, అతడికి జట్టులో చోటు దక్కే సూచనలు లేవు. ఆసియా కప్‌కు యశస్వి జైస్వాల్‌ను రిజర్వ్ ఓపెనర్‌గా ఎంచుకునే వీలుంది. లేదంటే.. మిడిల్ ఆర్డర్‌లోనే మరో బ్యాటర్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఎంచుకునే అవకాశం లేకపోలేదు.
అయ్యర్ వర్సెస్ తిలక్
బ్యాటింగ్ లైనప్‌లో 1-4 స్థానాలపై స్పష్టత వచ్చినా.. ఐదో స్థానంలో ఆడే ఆటగాడిని ఎంచుకోవటం సెలక్షన్ కమిటీకి తలనొప్పిగా మారనుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో 175.07 సగటుతో 604 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. నం.5 బ్యాటింగ్ స్థానం కోసం తెలుగు తేజం, హైదరాబాదీ తిలక్ వర్మతో పోటీపడుతున్నాడు. తిలక వర్మ టీ20ల్లో 24 మ్యాచుల్లో 155.07 సగటుతో 749 పరుగులు సాధించాడు. శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయటంతో పాటు జట్టు నాయకత్వ గ్రూప్‌లో కీలకం కానున్నాడు. దీంతో సెలక్టర్లు అయ్యర్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. యువ బ్యాటర్ తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్ బ్యాకప్ బ్యాటర్‌గా ఎంపికవుతాడేమో చూడాలి.
ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ నేరుగా జట్టులోకి ఎంపిక కానున్నారు. బ్యాటింగ్ లైనప్‌లోనూ ఈ ఇద్దరు వరుసగా నం.6, నం.7 స్థానాలు భర్తీ చేయనున్నారు. మరో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను సైతం సెలక్టర్లు ఎంపిక చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వాషింగ్టన్ సుందర్ ఎంపికతో స్పిన్, బ్యాటింగ్ డెప్త్‌ను బలోపేతం చేసేందుకు వీలు కుదురుతుంది. వికెట్ కీపర్‌గా సంజు శాంసన్ కొనసాగనుండగా.. ఇషాన్ కిషన్, ధ్రువ్ జురెల్‌లో ఒకరు రెండో వికెట్ కీపర్‌గా జట్టులో నిలువనున్నారు. విధ్వంసక బ్యాటింగ్ నైపుణ్యంతో ఇషాన్ కిషన్ రేసులో ముందంజలో నిలిచాడని చెప్పవచ్చు.+
బుమ్రానే పేస్ దళపతి!
పని భారం, పని ఒత్తిడి నేపథ్యంలో జశ్‌ప్రీత్ బుమ్రాకు ఆసియాకప్ నుంచి సైతం విశ్రాంతి ఇవ్వాలనే సూచనలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ వైద్య బృందం సూచనల మేరకు సెలక్షన్ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌లో పని భారం పెద్దగా ఉండబోదని.. జశ్‌ప్రీత్ బుమ్రాను జట్టులోకి తీసుకునేందుకు అజిత్ అగార్కర్ ప్యానల్ భావిస్తోంది. జశ్‌ప్రీత్ బుమ్రా పేస్ దళానికి నాయకత్వం వహించనుండగా.. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానాలు పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకునే వీలుంది. హార్దిక్ పాండ్య నాల్గో పేసర్‌గా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి స్పిన్ స్పెషలిస్ట్‌గా జట్టులో నిలువనుండగా.. రెండో స్పిన్నర్ కోటాలో కుల్‌దీప్ యాదవ్, రవి బిష్ణోరు పోటీపడుతున్నారు. 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ సన్నద్ధతలో భాగంగా ఆసియా కప్ జరుగుతుండగా… పరోక్షంగా ఈ జట్టు రానున్న టీ20 ప్రపంచకప్ ప్రణాళికలకు అనుగుణంగా ఉండనుంది.
ఆసియా కప్‌కు భారత జట్టు (అంచనా)
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జశ్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, రింకూ సింగ్/శివం దూబె, ఇషాన్ కిషన్, కుల్‌దీప్ యాదవ్/ రవి బిష్ణోరు, యశస్వి జైస్వాల్.
టీ20 జట్టులో నిలిచేదెవరు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES