కారాగారం నుంచి విడుదలపై ప్రభుత్వాల నిరాసక్తత
ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని 20 రాష్ట్రాలు, యూటీలు
న్యూఢిల్లీ : కారాగారాలలో మగ్గుతున్న పేద ఖైదీల విడుదల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రెండున్నర సంవత్సరాల క్రితం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఇప్పటి వరకూ కేవలం 273 మంది ఖైదీలు మాత్రమే దానిని ఉపయోగించుకున్నారు. కేంద్రం కేటాయించిన నిధుల్లో 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం రూ.18.68 లక్షలు ఖర్చు చేయగా 107 మంది ఖైదీలు ప్రయోజనం పొందారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.9.93 లక్షలు ఖర్చు చేయగా 38 మంది, ఉత్తరాఖండ్ రూ.7.76 లక్షలు ఖర్చు చేయగా 37 మంది లబ్ది పొందారని ప్రభుత్వ డేటా తెలిపింది. ఈ పథకాన్ని 2023లో ప్రారంభించారు. బెయిల్ పొందలేక, జరిమానాలు చెల్లించలేక జైళ్లలోనే మగ్గిపోతున్న ఖైదీలకు…ముఖ్యంగా ఆర్ధికంగా వెనుకబడిన వారు, విచారణను ఎదుర్కొంటున్న వారు, శిక్ష అనుభవిస్తున్న వారికి స్వేచ్ఛ కల్పించడం కోసం కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం కింద…బెయిల్ పొందేందుకు రూ.40,000 వరకూ, జరిమానా చెల్లించేందుకు రూ.25,000 వరకూ కేంద్రం ఖైదీలకు ఆర్థిక సాయం అందజేస్తుంది. కేంద్ర హోం శాఖ అందజేసిన తాజా వివరాల ప్రకారం 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకం కోసం ఒక్క రూపాయి కూడా కేంద్ర నిధులను వెచ్చించలేదు. ఒడిసా (9 మంది), త్రిపుర (7), అరుణాచల్ ప్రదేశ్ (6), గోవా (5), పంజాబ్ (3), కేరళ (2), ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, సిక్కిం (ఒక్కొక్కరు) రాష్ట్రాలు తమ కారాగారాలలోని అండర్ ట్రయల్స్‌కు కేంద్ర నిధుల నుంచి ఆర్థిక సాయం అందించాయి. అస్సాం ప్రభుత్వం రూ.6.67 లక్షల ఆర్థిక సాయంతో 28 మంది అండర్ ట్రయల్స్‌కు మద్దతు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం రూ.2.46 లక్షల సాయం అందించి 18 మంది ఖైదీలకు స్వేచ్ఛ కల్పించింది. 2024-25, 2025-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కేంద్ర హోం శాఖ ఈ పథకానికి రూ.20 కోట్లు కేటాయించింది. అయితే రాష్ట్రాలు, యూటీలు ఖర్చు చేసింది రూ.71.71 లక్షలు మాత్రమే. హోం శాఖ పదే పదే రిమైండర్లు పంపుతున్నప్పటికీ రాష్ట్రాలు, యూటీల నుంచి స్పందన లభించడం లేదు.



