Thursday, November 13, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికాడి వదులుతున్న రైతన్నను కాపాడేదెవరు?

కాడి వదులుతున్న రైతన్నను కాపాడేదెవరు?

- Advertisement -

దేశానికి అన్నం పెట్టే అన్నదాత బతుకు నేడు అధోగతి పాలవుతున్నది. వ్యవసాయ రంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దివాళాకోరు విధానాలే దీనికి ప్రధాన కారణం. ఓ వైపు విత్తనాలు, ఎరువుల కొరత, మరోవైపు బ్యాంకు రుణాలు, పంట గిట్టుబాటు ధరలు లేక నానా యాతన పడుతున్నారు. దీంతో కాడిని వదిలి పట్టణాలకు వలసెళ్లి కూలీనాలి చేసుకొని జీవనం గడుపుతున్నారు. కనీసం పంటలు దెబ్బ తింటే నష్టపరిహారం అందించి వారిని కాపాడుకోవాలన్న సోయి కూడా పాలకులకు లేకపోవడం సిగ్గుచేటు. వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడులు వెళ్లక, తెచ్చిన అప్పులు తీర్చలేక, మానసిక ఒత్తిడికి గురై రాష్ట్రంలో ప్రతియేటా 450 మంది రైతులు పాల్పడ్డారు.

వారికి ఈ దుస్థితి రావడానికి పాలకవర్గాలు కారణం కాదా? గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2021-22 నుంచి వ్యవసాయ ప్రణాళికను ప్రకటించటం నిలిపివేసింది. దాన్ని నేడున్న కాంగ్రెస్‌ కూడా అదే నిషేదాన్ని కొనసాగి స్తున్నది. ఎలాంటి ప్రణాళికలు రూపొందించకపోవడం వలన రైతులు వారికి తోచిన పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎక్కువమంది కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ఆశించి వరి, పత్తి, పంటల వైపు మొగ్గుచూపినా వారికి గిట్టుబాటు అందడం లేదు. దీనికితోడు ఒకే రకం పంటల్లో రైతులు ఉండటంతో పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పండ్ల తోటల విస్తీర్ణాలు ప్రతియేటా తగ్గిపోతున్నవి. దీనివలన ఇతర రాష్ట్రాల నుండి వాటన్నింటినీ మన అవసరాలకు దిగుమతి చేసుకోవలసి వస్తుంది. పంటల ప్రణాళిక ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.

రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు
2014 నుండి 2025 వరకు కరువులు, వరదల వలన ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పంటల నష్టం వాటిల్లుతున్నది. వీటికి తోడు ప్రాణ, ఆస్తి నష్టాలు కూడా సంభవిస్తున్నాయి. ప్రభుత్వాల సహకారం లేకపోవడంతో రైతుల్లో అయోమయ స్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక కమిషన్‌ (2015-20), 15వ ఆర్థిక కమిషన్‌ (2020-25) వరకు ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించారు. అయినప్పటికీ సక్రమంగా రైతులకు అందించకపోవడం విచారకరం.

కేంద్ర ప్రభుత్వం అప్పట్లో వేసిన నూరుల్‌ హుడా కమిషన్‌ నష్టపరిహారంగా ఎకరాకు రూ.25వేలివ్వాలని, 2018 సంవత్సరంలో మోడీ ప్రభుత్వానికి సూచించింది. ప్రధానంగా వరి, పత్తి, సోయ, పప్పు ధాన్యాలు, మొక్క జొన్న, ఉద్యానవన పంటలు బాగా దెబ్బతిన్నాయి. రాళ్లవర్షాల వల్ల 2019లో, 2024లో లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. ప్రతియేటా సగటున ఐదువేల కోట్ల నష్టం వాటిల్లింది. వరదల వల్ల 2014-26లో 58.46 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. కరువుల వల్ల రూ.14,812 కోట్ల నష్టం వాటిల్లగా, వరదల వల్ల 2014-26 వరకు రూ.22,700 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ నష్టానికి ఆర్థిక కమిషన్‌ పదిశాతం సహాయం కూడా అందించలేదు.

9 డిసెంబర్‌ 2023న అధికారానికి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గత రెండేండ్లు ప్రకృతి వైపరిత్యాల సహాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. కేంద్ర బృందాలు వచ్చి, పరిశీలించి వెళ్లాయి తప్ప, ఎలాంటి సహాయం ఇవ్వలేదు. మోడీ ప్రభుత్వం బీజేెపీయేతర రాష్ట్రాలకు సహాయం చేయడానికి సుముఖంగా లేదు. 2021-26 సంవ త్సరానికి 15వ ఆర్థిక కమిషన్‌ కింద అన్ని రాష్ట్రాలకు 1.61 లక్షల కోట్ల నిధులు కేటాయించింది. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం కేవలం రూ.2,872కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. కేంద్రం ప్రకటించిన కమిషన్‌ మద్దతు ధరలు అమలు జరగడం లేదు.

వరి, పత్తి, మొక్క జొన్న, పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటలు చేతికందే సమయంలో ధరలు తగ్గించి మధ్య దళారులు కొనుగోలు చేస్తున్నారు. రైతుల నుండి వ్యాపారస్తులకు సరుకు చేరగానే ధరలు పెంచి ప్రజల మీద భారాలు వేసి అధిక లాభాలు పొందుతున్నారు. ముఖ్యంగా ముడి వ్యవ సాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి ప్రాసెసింగ్‌ చేసి, అంటే వడ్లను బియ్యంగా మార్చి నూనె గింజల నుండి నూనె తీసి పప్పు ధాన్యాలను ప్రాసెసింగ్‌ చేసి యాభై శాతం నుండి 120 శాతం వరకు లాభం పొందుతున్నారు. ఈ రాష్ట్రంలో కనీస మద్దతు ధరలు అమలు జరుగకపోవడం రైతు సంఘం సర్వే ప్రకారం వరి, పత్తి, సోయా, వేరుశనగా, పప్పు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు ప్రతియేటా 4.5 కోట్లు నష్టపోతున్నారు. ఈ గణాంకాలను కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అశోక్‌ గులాటి ఆమోదించారు.

రాష్ట్ర ప్రభుత్వం రికమండేషన్‌ చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం లేదు. ఉదాహరణకు వరి ధాన్యానికి రాష్ట్రంలో ఉత్పత్తి వ్యవయం క్వింటాళ్లకు రూ.2100 ఖర్చు అవుతున్నట్లు తేల్చింది. దీనికి యాభైశాతం అదనంగా కలిపి రూ.3,500క్వింటాల్‌కు ఇవ్వాలని నిర్ణయించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రికమండేషన్‌ చేసినా, అన్ని రకాల పంటలకు ధరలు తగ్గించింది. దీనివలన రైతులకు పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, కల్తీ పురుగుమందుల వ్యాపారం విచ్ఛలవిడిగా సాగుతున్నది. మన రాష్ట్రానికి అన్ని పంటలకు కలిపి 20 లక్షల క్వింటాళ్ల విత్తనాలు కావాలి.

రాష్ట్రంలో 444 విత్తన కంపెనీలు, 467 సీడ్‌ ప్రాసె సింగ్‌ యూనిట్లు పనిచేస్తున్నాయి. దేశంలో 80 శాతం విత్తనాలు విదేశీ కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి. ప్రతియేటా 18 వేల కోట్ల విత్తన వ్యాపారం సాగుతున్నది. ఇందులో 25 శాతం రాష్ట్ర వాటా వున్నది. కల్తీ విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్‌ పెడతామని గొప్పగా ప్రకటించిన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఇప్పటివరకు ఒక్క లైసెన్సు కూడా రద్దు చేయలేకపోయాయి. కల్తీ విత్తన వ్యాపారులతో అధికార యంత్రాంగానికి లావాదేవీలున్నాయని రైతుల ఆవేదన. ఈ అక్రమాల్ని అరికట్టేలా పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే.

ఎరువుల కొరత
కేంద్ర ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులు అందించలేకపోతున్నది. కృత్రిమ కొరతను సృష్టించి ఎరువుల ధరలు అడ్డగోలుగా పెంచుతున్నది. మార్కెట్‌లో 40 కేజీల యూరియా బస్తా రూ.267లు కాగా రూ.330లకు, డి.ఎ.పి. ధర రూ.1350ల నుండి రూ.1500లకు, కాంప్లెక్స్‌ ధర రూ.1500లు కాగా రూ.2000లకు అమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ బాగా తగ్గించడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. 2022-23లో కేంద్రం రూ.2,51,369కోట్లు సబ్సిడీ ఇవ్వగా, 2025-26లో రూ.1,67,227కోట్లకు సబ్సిడీని తగ్గించింది. ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం చేయాలని ప్రచారం చేస్తూనే మరోవైపు నానో యూరియా, నానో డిఎపిలను ఉత్పత్తి చేసి ధరలు పెంచారు.

రాష్ట్రంలో 2014 నుండి ఇప్పటికి మూడుసార్లు 2014, 2018, 2024లలో రుణమాఫీ ప్రకటించారు. మొదటి రెండుసార్లు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగు విడతలు రుణమాఫీ చేయడం వల్ల రైతులు బ్యాంకులకు అప్పులు చెల్లించక బాకీపడ్డారు. ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 25లక్షల మందికి రూ.21వేల కోట్లు రుణమాఫీ చేసింది. కానీ, రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులుండగా బ్యాంకులు 42 లక్షల మందికే రుణాలిస్తున్నది. మిగిలిన వారు ప్రయివేటు రుణాలు తెచ్చుకుంటున్న దుస్థితి నెలకొంది. పైగా ఐదెకరాల్లోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులు కౌలు రైతులకు రుణాలివ్వడం పోవడం వల్ల అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేస్తున్న పరిస్థితి ఉంది.

రిజర్వు బ్యాంకు ఆదేశాల ప్రకారం బ్యాంకు డిపాజిట్లలో నలభై శాతం వ్యవసాయ రుణాలివాల్సి ఉండగా, అందులో 18 శాతం పంట రుణాలకివ్వాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని బ్యాంకుల్లో (2025 మార్చి) రూ.4.5 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఆర్‌బిఐ ఆదేశాల ప్రకారం పంట రుణాలు 81 వేల కోట్లివ్వాలి. 2025-26లో 32 వేల కోట్లు మాత్రమే పంట రుణాలిచ్చారు. బ్యాంకులు ప్రయివేటు వారికి రుణాలివ్వటం వల్ల ‘మైక్రో ఫైనాన్స్‌’ పేరుతో అధిక వడ్డీలకు రైతులకు రుణాలిస్తూ లాభాలు గడిస్తున్నారు. దీంతో ప్రయివేటు రుణాలు తీర్చలేక ప్రతియేటా వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

రైతు భరోసా ఇవ్వడం వల్ల కొంత ఉపయోగం వున్నా అందరికీ అందకపోవడం వల్ల చాలామంది నిరాశకు గురవుతున్నారు. అర్హులైన రైతులందరికీ పాస్‌ పుస్తలకాలిచ్చి, రైతు భరోసా అమలు చేయడంతో పాటు, బ్యాంకు రుణాలివాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా వ్యవసాయ రంగం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే పాలకులు కండ్లు తెరిచి, వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాల ప్రతినిధులు సూచించిన ప్రకారం వ్యవసాయ ప్రణాళికలు రూపొందించాలి. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలి. రైతు సమస్యలను పరిష్కరించటానికి అన్ని రకాల చర్యలు చేపట్టి, రైతులను ఆదుకుని, వ్యవసాయ రంగాన్ని కాపాడాలి.

జూలకంటి రంగారెడ్డి 9490098349

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -