Monday, June 2, 2025
E-PAPER
Homeఆటలుఫైనల్‌కు చేరేదెవరు?

ఫైనల్‌కు చేరేదెవరు?

- Advertisement -

– పంజాబ్‌ కింగ్స్‌తో ముంబయి ఇండియన్స్‌ ఢ
– అహ్మదాబాద్‌లో నేడు క్వాలిఫయర్‌2 పోరు
– రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 18వ సీజన్‌ ఆఖరు అంకానికి చేరుకుంది. పది జట్లు పోటీపడిన లీగ్‌లో 72 మ్యాచులు ముగిసిన తర్వాత టైటిల్‌ రేసులో మూడు జట్లు మిగిలాయి. ఐదు సార్లు చాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో తొలి టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న పంజాబ్‌ కింగ్స్‌ నేడు ఫైనల్లో బెర్త్‌ కోసం చావోరేవో తేల్చుకోనుంది. అహ్మదాబాద్‌లో నేడు క్వాలిఫయర్‌2లో పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధిస్తే.. ఐపీఎల్‌కు కొత్త చాంపియన్‌ ఖాయమే!. పంజాబ్‌ కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌లో ఫైనల్‌కు చేరేదెవరో చూడాలి.
నవతెలంగాణ-అహ్మదాబాద్‌
ఐపీఎల్‌ టైటిల్‌ వేట రసవత్తర ముగింపుకు చేరుకుంది. ఐదుసార్లు చాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ నేడు క్వాలిఫయర్‌2లో తలపడనున్నాయి. సీజన్‌ ఆరంభంలో పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండో స్థానంలో నిలిచిన ముంబయి ఇండియన్స్‌ ఆ తర్వాత వరుస విజయాలతో జోరందుకుని ఇప్పుడు ఏకంగా క్వాలిఫయర్‌2 వరకు వచ్చేసింది. మరోవైపు సీజన్‌ ఆరంభం నుంచీ నిలకడగా రాణించిన పంజాబ్‌ కింగ్స్‌ 11 ఏండ్ల తర్వాత తొలిసారి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. క్వాలిఫయర్‌2లో విజయం సాధించి టైటిల్‌ పోరుకు చేరుకోవాలని ఎదురుచూస్తుంది. నేడు క్వాలిఫయర్‌2లో నెగ్గిన జట్టు జూన్‌ 3న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌తో ఫైనల్లో తలపడనుంది.
పంజాబ్‌ మెరిసేనా?
ఐపీఎల్‌ సీజన్‌ను ఎటువంటి అంచనాలు లేకుండా మొదలెట్టే జట్టలో పంజాబ్‌ కింగ్స్‌ ఒకటి. గత 11 ఏండ్లుగా ప్లే ఆఫ్స్‌కు చేరుకోని పంజాబ్‌ కింగ్స్‌ రాతను శ్రేయస్‌ అయ్యర్‌, రికీ పాంటింగ్‌ మార్చివేశారు. ఐపీఎల్‌లో గతంలో ఎన్నడూ చూడని విధంగా టాప్‌-7 బ్యాటర్లలో నలుగురు అన్‌క్యాప్‌డ్‌ భారత క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. దేశవాళీ ఆటగాళ్లపై నమ్మకం ఉంచిన కెప్టెన్‌, కోచ్‌ నిలకడగా అద్భుత ఫలితాలు రాబట్టారు. ముల్లాన్‌పూర్‌లో లభించే అదనపు బౌన్స్‌తో పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ఇబ్బంది పడింది. అహ్మదాబాద్‌ పిచ్‌ పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ శైలికి అనుకూలంగా ఉండనుంది. దీంతో ఇక్కడ శ్రేయస్‌ సేన భారీ స్కోరుపై కన్నేసింది. టాప్‌ ఆర్డర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, ప్రియాన్షు ఆర్య సహా జోశ్‌ ఇంగ్లిశ్‌లు కీలకం కానున్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ సత్తా చాటుతున్న ఓపెనర్లు మరో రెండు మ్యాచుల్లో మెరిస్తే పంజాబ్‌ కల నెరవేరనుంది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాట్‌తో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ బాకీ పడ్డాడు. సీజన్‌ ఆరంభంలో చూపించిన మెరుపులు అయ్యర్‌ బ్యాట్‌ నుంచి రావాల్సి ఉంది. నెహల్‌ వదేరా, శశాంక్‌ సింగ్‌ సహా మార్కస్‌ స్టోయినిస్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. బంతితో అజ్మతుల్లా ఓమర్‌జారు, కైల్‌ జెమీసన్‌, వైశాక్‌ విజరుకుమార్‌లు బంతితో అదరగొడుతున్నారు. గ్రూప్‌ దశలో ఆఖరు మూడు మ్యాచులకు దూరమైన స్పిన్నర్‌ యుజ్వెంద్ర చాహల్‌ నెట్స్‌లో సాధన చేస్తూ కనిపించాడు. క్వాలిఫయర్‌2లో చాహల్‌ బంతితో మాయ చేస్తే మిడిల్‌ ఓవర్లలో వికెట్ల వేట పంజాబ్‌ కింగ్స్‌కు మరింత సులువు కానుంది.
ముంబయిని ఆపగలరా?
ప్లే ఆఫ్స్‌లో అత్యంత ప్రమాదకర జట్టు ముంబయి ఇండియన్స్‌. ఒత్తిడిలో భీకర ప్రదర్శన చేయటం ముంబయి ఇండియన్స్‌కు అలవాటుగా మారింది. ఐపీఎల్‌ గణాంకాలు అందుకు నిదర్శనం. 2016 తర్వాత రోహిత్‌ శర్మ ఓ సీజన్‌లో నాలుగు ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించటం ఇదే తొలిసారి. ఓపెనర్‌గా దుమ్మురేపుతున్న రోహిత్‌ శర్మకు ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో జతకలిశాడు. సహజంగానే దూకుడుగా ఆడే జానీ బెయిర్‌స్టో అహ్మదాబాద్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన 10-15 బంతుల్లోనే 30-40 పరుగులు అలవోకగా పిండుకుంటున్నాడు. తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యలు ఆఖరు ఐదు ఓవర్లలో ముంబయి ఇండియన్స్‌కు భారీ స్కోరు అందిస్తున్నారు. సునాయాసంగా సిక్సర్లు బాదుతున్న హార్దిక్‌ పాండ్య ఎలిమినేటర్‌లో ఇరు జట్ల మధ్య వ్యత్యాసంగా నిలిచాడు. నమన్‌ దిర్‌ సైతం నిలకడగా రాణిస్తున్నాడు. ఇక మంచు ప్రభావం, పిచ్‌ స్వభావంతో సంబంధం లేకుండా నిప్పులు చెరుగుతున్న జశ్‌ప్రీత్‌ బుమ్రా నేడు పంజాబ్‌ కింగ్స్‌కు సవాల్‌ విసరనున్నాడు. ట్రెంట్‌ బౌల్ట్‌, దీపక్‌ చాహర్‌లతో కలిసి బుమ్రా వికెట్ల వేటలో రెచ్చిపోతున్నాడు. బుమ్రా నాలుగు ఓవర్లను కాచుకోవటం నేడు పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్లకు కఠిన సవాల్‌గా మారనుంది. మిచెల్‌ శాంట్నర్‌ స్పిన్‌ మాయజాలంతో ప్రత్యర్థులను మాయ చేస్తున్నాడు. సమిష్టిగా ప్రదర్శన, స్టార్‌ క్రికెటర్ల జోరు మీదున్న ముంబయి ఇండియన్స్‌ను నిలువరించటం పంజాబ్‌ కింగ్స్‌కు అతిపెద్ద పరీక్ష కానుంది. గ్రూప్‌ దశ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓటమితో ఎలిమినేటర్‌లో ఆడిన ముంబయి ఇండియన్స్‌.. ఇప్పుడు క్వాలిఫయర్‌2లో ప్రతీకారం తీర్చుకుంటుందా? ఆసక్తికరం.
తుది జట్లు (అంచనా) :
పంజాబ్‌ కింగ్స్‌ : ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌, ప్రియాన్షు ఆర్య, జోశ్‌ ఇంగ్లిశ్‌ (వికెట్‌ కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), నెహల్‌ వదేరా, శశాంక్‌: సింగ్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అజ్మతుల్లా ఓమర్‌జారు, హర్‌ప్రీత్‌ బరార్‌, కైల్‌ జెమీసన్‌, యుజ్వెంద్ర చాహల్‌/ వైశాక్‌ విజరుకుమార్‌.
ముంబయి ఇండియన్స్‌ : రోహిత్‌ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), నమన్‌ దిర్‌, మిచెల్‌ శాంట్నర్‌, రాజ్‌ బవ, రిచర్డ్‌ గ్లీసన్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌/ అశ్వని కుమార్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -