Thursday, February 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుగెలుపెవరిది..!

గెలుపెవరిది..!

- Advertisement -

చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా మున్సి’పోల్స్‌’
కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్లలోఉద్రిక్తత
రణరంగంగా పోలింగ్‌ కేంద్రాలు
దాడులకు దిగిన బీజేపీ కార్యకర్తలు…భారీగా పోలింగ్‌ నమోదు

నవతెలంగాణ-విలేకరులు
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకొని రణరంగంగా మారాయి. ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభంకాగా.. సాయంత్రం 5 గంటల్లోపు క్యూలైన్‌లో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్‌ నిర్వహించగా భారీగానే పోలింగ్‌ శాతం నమోదైంది. ఈ నెల 13న ఉదయం 8 గంటలకు 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 16న కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మున్సిపల్‌ చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌ ఎన్నిక ఉంటుంది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రెండు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో జరిగిన పోలింగ్‌ మిశ్రమ అనుభవాలను మిగిల్చింది. అభ్యర్థుల అత్యుత్సాహం, పోలీసుల ఆంక్షలు, ఘర్షణల మధ్య ఎన్నికలు ముగిశాయి. కరీంనగర్‌, మెట్‌పల్లి, జగిత్యాల ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్‌ 58వ డివిజన్‌లో దొంగ ఓట్లపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మెట్‌పల్లి 11వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కొమిరెడ్డి శేషగిరిని ప్రత్యర్థులు చుట్టుముట్టి, కుర్చీలోంచి లేస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామని బెదిరించారు. జగిత్యాలలో తన ఫోన్‌ లాక్కున్నారని బీజేపీ రెబల్‌ అభ్యర్థి పులి శ్రీధర్‌ కంటతడి పెట్టుకున్నారు.

వేములవాడలో పోలీసులు తనను పోలింగ్‌ కేంద్రానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని అధికార పార్టీ అభ్యర్థిని రామతీర్థపు కృష్ణవేణి రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. కరీంనగర్‌లోని 49వ డివిజన్‌ రాంనగర్‌ ప్రభుత్వ పాఠశాల పోలింగ్‌ సెంటర్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పద్మశ్రీ భర్త శ్రీనివాస్‌ రెడ్డి సెల్‌ఫోన్‌ను బీజేపీ అభ్యర్థి, అతని అనుచరులు గుంజుకుని పగలగొట్టారు. విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న సుడా చైర్మెన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి బీజేపీ నాయకులను నిలదీశారు. పోలీసులు సైతం ఇరుపార్టీ శ్రేణులను సముదా యించారు. ‘దండంపెట్టి చెబుతున్న.. వాడ ఆగమైతంది. ఈరోజు కుర్ర తిరుపతిని అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారు. ఎమ్మెల్యే వచ్చి అడ్డుకున్నారు.

అయ్యా.. కిసాన్‌నగర్‌ ప్రజల్లారా అర్థం చేసుకోండి. అయ్యలారా.. మీకు దండం పెడతా.. మీ కాళ్లు మొక్కుతా’ అంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఎడ్ల అశోక్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద నినదించారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ పోలింగ్‌ సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ వద్ద వీధికుక్కలు దాడికి దిగాయి. ఈ దాడిలో ఆరుగురు పోలింగ్‌ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఆ కుక్కలను తరిమికొట్టారు. వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కరీంన గర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో 58వ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని బీజేపీ నాయకులు వెళ్లి ఆందోళన చేశారు.

‘కవర్‌’ డ్రైవ్‌ అదిరింది!
ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి డబ్బును నీళ్లలా ఖర్చు చేశారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఓటు విలువ ఆకాశాన్ని తాకింది. కరీంనగర్‌ 2వ డివిజన్‌లో ఒకే ఓటుకు రూ. 6 వేలతో కూడిన కవర్లు పంపిణీ చేయడం గమనార్హం. ఒకే ఇంట్లో నలుగురు ఉంటే రూ. 24 వేలు అందడంతో ఓటర్లే విస్తుపోయారు. ఒక్కో వార్డులో రూ. 10 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు నగదు పంపిణీ జరిగినట్టు అంచనా. హుజూరాబాద్‌లో కొందరు ఓటర్లు అభ్యర్థులకు ఫోన్‌ చేసి మరి ”మాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు?” అని నిలదీయడం ఎన్నికల తీరుతెన్నులకు అద్దం పడుతోంది. సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని 25వ వార్డులో ఓ స్వతంత్య్ర అభ్యర్థి ఓటర్లకు బంగారు నాణేలు పంపిణీ చేశారు. అయితే తీరా వాటిని పరీక్షించగా అవి నకిలీ బంగారం అని తేలడంతో ఓటర్లు అవాక్కయ్యారు. బంగారమని ఆశచూపి తమను మోసం చేస్తారా అంటూ ఓటర్లు సదరు అభ్యర్థిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై అధికారులు విచారణ చేపట్టారు.

నిబంధనలు గాలికి..సోషల్‌ మీడియాలో వైరల్‌
ఎన్నికల గోప్యతను తుంగలో తొక్కుతూ హుజూరాబాద్‌ 2వ వార్డులో ఒక ఓటరు తాను వేసిన ఓటును ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడం కలకలం రేపింది. అటు వేములవాడలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోలింగ్‌ స్లిప్పులపై పార్టీ స్టాంపులు వేసి ప్రచారం చేయడంపై కాంగ్రెస్‌, బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

నిజామాబాద్‌లో ఓటేసేందుకు ఆసక్తి చూపని ఓటర్లు
మున్సిపల్‌ ఎన్నికల్లో ముందు నుంచి భావించినట్టే నిజామాబాద్‌ అర్బన్‌ కేంద్రాల్లోని మున్సిపాల్టీల్లో ఓటర్లు ఓటేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దాంతో పోలింగ్‌ శాతం తగ్గింది. చెదురుమదురు ఘటనలు మినహా.. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా మున్సిపాల్టీల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అత్యధికంగా ఎల్లారెడ్డిలో 79.77 శాతం, బిచ్కుందలో 78.49 శాతం పోలింగ్‌ నమోదు కాగా అత్యల్పంగా నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 59.12 శాతం పోలింగ్‌ నమోదైంది. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గూపన్‌పల్లి కమాన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివిధ పార్టీల నాయకులు భారీగా గుమిగూడటంతో అక్కడ పెద్దఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

రహదారిపై వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ గుమిగూడిన పార్టీ నాయకులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల విజ్ఞప్తిని పట్టించుకోలేదు. అప్పటికే నగరంలో 144 సెక్షన్‌ నిబంధనలు అమలులో ఉండటంతో నిబంధనల ఉల్లంఘన కింద పోలీసులు చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా లాఠీచార్జి చేశారు. 19వ డివిజన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అక్కడికి చేరుకొని ఉన్నతాధికారులకు ఫోన్‌చేసి సమాచారం అందించారు. జై శ్రీరామ్‌ అంటూ బీజేపీ నాయకులు నినాదాలు చేయగా.. అక్కడి నుంచి బొమ్మ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ వెనుతిరిగారు.

ఉమ్మడి ఖమ్మంలో స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 8 మున్సిపాల్టీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఖమ్మంలోని ఐదు మున్సిపాల్టీల్లో 82.30 శాతం పోలింగ్‌ నమోదయింది. ఏదులాపురం మున్సిపాల్టీ జలగంనగర్‌లో 20వ వార్డు వద్ద బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రం వద్ద ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేస్తున్నారని ఘర్షణ పడ్డారు. అడ్డుకున్న పోలీసులపై బీఆర్‌ఎస్‌ నాయకులు తిరగబడ్డారు.

దాంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని బీఆర్‌ఎస్‌ నాయకులను, కార్యకర్తలను పోలింగ్‌ బూత్‌కు దూరంగా తరిమికొట్టారు. కల్లూరులో పోలింగ్‌ కేంద్రానికి దగ్గరలో ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు కాంగ్రెస్‌ నాయకులతో వాగ్వివాదానికి దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్ల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్‌లోని 19వ డివిజన్‌ చిట్టి రామవరంలో కాంగ్రెస్‌, సీపీఐ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోటీలో ఉన్న అభ్యర్థి భర్త పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లడాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్‌ పాషా అభ్యంతరం తెలపడంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగి తోపులాటకు దారితీసిందని స్థానికులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య ఘర్షణ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 10 మున్సిపాలిటీలు, 226 వార్డులు ఉండగా ఇందులో.. రెండు వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు 78.52 శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లాలో అత్యధికంగా పోలింగ్‌ అయిన మున్సిపాలిటీ ఆమన్‌గల్‌ 84.74 కాగా, అత్యల్పంగా షాద్‌నగర్‌ 75.7 శాతం నమోదైంది. వికారాబాద్‌ జిల్లాలో 3 గంటల వరకు జరిగిన పోలింగ్‌ 62.79 శాతంగా ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు ముందే అర్ధరాత్రి సీతారాంపేటలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొంది.

ఉమ్మడి వరంగల్‌లో భారీ బందోబస్తు
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్‌ జరిగింది. భారీ బందోబస్తు మధ్య ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల కమిషన్‌ ఎన్ని బృందాలను నియమించి నిఘా ఏర్పాటు చేసిన పట్టపగలే మున్సిపాల్టీలో ఓటర్లకు నగదు, మద్యం, చీరెల పంపిణీ విచ్చలవిడిగా జరిగింది. అన్ని మున్సిపాల్టీలలో ఇవే సన్నివేశాలు కనిపించాయి. ఇదిలావుంటే వర్ధన్నపేట మున్సిపాల్టీలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ తండాకు వెళ్లిన సందర్భంలో తండావాసులందరూ ఎందుకు వచ్చారంటూ తిరగబడడంతో వెనుతిరిగారు.

పోలీసు బందోబస్తు నడుమ పోలింగ్‌
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా పోలీసు బందోబస్తు నడుమ పోలింగ్‌ నిర్వహించారు. ఆసిఫాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో 77.67 శాతం, కాగజ్‌నగర్‌లో 64.32 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో జనకాపూర్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఏజెంట్లను గంటకు ఒకసారి బయటకు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఏజెంట్లు ఎస్‌ఐతో గొడవకు దిగారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 32వ వార్డులో కొమ్ముల సురేష్‌ ఓటు వేసి బ్యాలెట్‌ పేపర్‌ను ఫొటో తీసి స్టేటస్‌ పెట్టుకోవడంతో కలకలం రేగింది.

పోలీసులకు, బీఆర్‌ఎస్‌ నాయకులకు మధ్య ఘర్షణ
నల్లగొండ జిల్లా నల్లగొండ మున్సిపాల్టీలో 77.36 శాతం పోలింగ్‌, యాదాద్రిభువగిరి జిల్లాలో 87.1 శాతం, సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మున్సిపాలిటీలో 79.38శాతం నమోదైంది. మున్సిపల్‌ ఎన్నికలలో భాగంగా బుధవారం నల్లగొండ కార్పొరేషన్‌ 32వ డివిజన్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌ నాయకులు వేరే ప్రాంతం వ్యక్తులతో ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఓటర్లను అడ్డుకున్నారు.

దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బీఆర్‌ఎస్‌ నాయకులను అరెస్టు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా పోలీసులు పనిచేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. చండూరు మున్సిపల్‌ పట్టణంలో 3వ వార్డుకు చెందిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారని ఇరు గ్రూపుల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. యాదాద్రిభువనగిరి జిల్లాలో చౌటుప్పల్‌ 20వ వార్డులో బీసీ కాలనీ పోలింగ్‌ బూత్‌ వద్ద బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను పోలింగ్‌ స్టేషన్‌లోకి అనుమతించలేదని ఆరోపిస్తూ పోలీసులతో స్వల్ప వాగ్వాదానికి దిగారు.

పోలీసులతో జగ్గారెడ్డి వాగ్వాదం
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి, పోలీసులకు వాగ్వాదం జరిగింది. సీఐపై బూతులు మాట్లాడుతూ చిందులేశారు. సదాశివపేటలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పోలింగ్‌ బూత్‌ వద్ద గొడవ జరిగింది. నర్సాపూర్‌ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడులు, ప్రతిదాడులు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ 67.73శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. నారాయణపేటలో 64.69 శాతం, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 77.64 శాతం, జోగులాంబ జిల్లాలో 74,57 శాతం, వనపర్తి జిల్లాలో 75.56 శాతం పోలింగ్‌ నమోదయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -