Saturday, August 2, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపాలకులెవరైనా నవతెలంగాణ ప్రజల పక్షమే

పాలకులెవరైనా నవతెలంగాణ ప్రజల పక్షమే

- Advertisement -

– పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న నవతెలంగాణ
– పథకాల్లో తప్పులను ఎత్తిచూపినా గౌరవిస్తాం
– సమస్యలపై ఎర్రజెండాలు స్పందిస్తేనే సమాజంలో విశ్వసనీయత
– కమ్యూనిస్టుల పోరాటాలతోనే కాంగ్రెస్‌కు అధికారం
– ఇరువురూ కలిసి పనిచేస్తే ప్రజలకు మరింత మేలు
– రాజకీయనేతల్లాగే…జర్నలిస్టుల విశ్వసనీయతా సన్నగిల్లుతోంది
– లక్ష్మణరేఖ వారే గీసుకోవాలి : నవతెలంగాణ పదో వార్షికోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పాలకులు ఎవరైనా నవతెలంగాణ దినపత్రిక ప్రజల పక్షానే నిలుస్తుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. అందులోని జర్నలిస్టులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తారని కొనియాడారు. ప్రస్తుతం ప్రజల కోసం పనిచేసే వారికి ఉపయోగపడే, స్ఫూర్తినిచ్చే మీడియా సంస్థలు కొన్ని మాత్రమే ఉన్నాయనీ, అలాంటి వాటిలో ‘నవతెలంగాణ’ తొలి వరుసలో నిలుస్తుందని చెప్పారు. నవతెలంగాణ దినపత్రిక పదో వార్షికోత్సవాన్ని శుక్రవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం ఏ రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత నవతెలంగాణ సంపాదకులు రాంపల్లి రమేశ్‌ స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం నవతెలంగాణ దశాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచికను సీఎం ఆవిష్కరించారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ శాఖ ప్రత్యేక కమిషనర్‌ సీహెచ్‌ ప్రియాంక, సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారు వేం నరేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమ కాలంలోని కొన్ని పత్రికల గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత క్రమంలో కమ్యూనిస్టు భావజాలం ఉన్న వారు పత్రికలను స్థాపించారని గుర్తు చేశారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతోపాటు సామాజిక రుగ్మతలను రూపుమాపడంలోనూ కమ్యూనిస్టు పత్రికలు క్రియాశీలక పాత్ర పోషించాయని తెలిపారు. వాటి వారసత్వాన్ని నవతెలంగాణ కొనసాగిస్తున్నదని అన్నారు. ప్రజాస్వామ్య సౌధానికి నాలుగో స్తంభమైన మీడియాను నిర్వీర్యం చేసేందుకు దేశంలోని పెట్టుబడిదారులు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సరళీకృత ఆర్థిక విధానాల వల్ల దేశ సంపదను పెట్టుబడిదారులు ఎలా దోపిడీ చేస్తున్నారనే విషయాన్ని మీడియా సమాజానికి విడమరిచి చెప్పాలని ఆయన సూచించారు. పాలకుల తప్పులను జర్నలిస్టులు ఎప్పటికప్పుడు విశ్లేషించాలని కోరారు. ప్రస్తుతం రాజకీయ పార్టీల నాయకుల ప్రకటనలకు విశ్వసనీయత ఎలా సన్నగిల్లుతున్నదో జర్నలిస్టుల ముసుగులో కొందరు చేస్తున్న వికృత చేష్టల వల్ల వారి విశ్వసనీయత కూడా అంతే వేగంగా సన్నగిల్లుతున్నదని వ్యాఖ్యానించారు. నిబద్ధత గల జర్నలిస్టులు తమకుతామే లక్ష్మణరేఖ గీసుకోవాలని సూచించారు. నిజమైన జర్నలిస్టులు ఒకవైపు, జర్నలిజం ముసుగేసుకుని చలామణి అయ్యేవారిని మరోవైపు విడదీయాలని అన్నారు. జర్నలిజం ముసుగులో అరాచకం సృష్టించే వారి వల్ల దేశ భద్రతకు సైతం ప్రమాదం ఏర్పడుతుందనీ, ఇటీవల ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా జరిగిన ఘటనలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సిద్ధాంతపరమైన భావజాలాన్ని ప్రజలకు చేరవేయడానికి కొన్ని రాజకీయ పార్టీలు పత్రికలను నడిపాయనీ, కానీ రాజకీయ పార్టీలు స్థాపించిన పత్రికలు వికృత పోకడలతో వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ సంపదను కాపాడుకోవడానికి, తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఆ పత్రికలు పనిచేస్తున్నాయని విమర్శించారు. అలాంటి పత్రికలు ప్రశ్నించే వారిని అసహ్యకరమైన భాషతో దూషిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల జర్నలిస్టు అనే పదానికే అర్థం లేకుండా పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా సమావేశాల్లో అడిగే ప్రశ్నల్ని బట్టి వారు ఎవరి ప్రయోజనాలు ఆశిస్తున్నారో తెలియనంత అమాయకులు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. జర్నలిజం ముసుగులో ఉన్న కొన్ని రాజకీయ పార్టీల పత్రికల తీరును ప్రజలు గమనించాలని సూచించారు. ఓనమాలు తెలియని వారు, అ, ఆ…ఏబీసీడీలు రాయడానికి రానివారు సైతం జర్నలిస్టు ముసుగు వేసుకుని సోషల్‌ మీడియా పేరుతో తిరుగుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే నిజమైన జర్నలిస్టులు సెమినార్లు నిర్వహించి ఆ పదానికి అర్థాన్ని నిర్వచించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నిబద్ధతతో పని చేసే నిఖార్సైన జర్నలిస్టులు కుటుంబాలను కూడా ఫణంగా పెట్టి ప్రజలతో మమేకం అవుతున్నారనీ, పాల కుల తప్పులను వారే విశ్లేషించి, తప్పొప్పులను ఎత్తిచూపు తున్నారని తెలిపారు. తాను గతంలో విద్యుత్‌ సహా పలు అంశా లపై ప్రజాశక్తి, నవతెలంగాణ విలేకర్లతో సంప్రదించి అనేక వివ రాలను తెలుసుకుని మీడియాతో మాట్లాడానని గుర్తు చేశారు.

సమస్యలు ఉన్నచోటే ఎర్రజెండా…
పజా సమస్యలు ఎక్కడుంటే ఎర్రజెండా అక్కడే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సమస్యలపై పోరాటంలో ఎర్రజెండా కనిపించినప్పుడే ప్రజల్లో విశ్వాసం ఉంటుందన్నారు. అందుకే తాను కమ్యూనిస్టులను ఉప్పుతో పోలుస్తానన్నారు. ఎన్ని మసాలాలు వాడినా, ఎంత బాగా వండినా ఉప్పు వేయకుంటే ఆ వంటకు రుచి ఉండబోదన్నారు. అబద్ధాల పునాదుల మీద తాను రాజకీయం చేయబోనని అన్నారు. అబద్ధాలు చెప్తే ఏదో ఒకరోజు ఆ సౌధం కూలకతప్పదని చెప్పారు. కమ్యూనిస్టుల పట్ల తనకు అపార గౌరవం ఉందన్నారు. మిగతా పత్రికలతోపాటు నవతెలంగాణకు ప్రభుత్వ ప్రకటనల్లో సమాన అవకాశాలుంటాయని వివరించారు. కమ్యూనిస్టుల పోరాటాల వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. 2004లో విద్యుత్‌ పోరాటంతోపాటు 2023లో తమ్మినేని పాదయాత్ర, ఇతర ఉద్యమాల వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. దాన్ని కొనసాగించడానికి సహకారం అందించాలని లెఫ్ట్‌ పార్టీలను కోరారు. తమ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు కలుగుతుందనీ, భవిష్యత్‌లోనూ కాంగ్రెస్‌-కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలనీ, అప్పుడే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

తప్పుల్ని ఎత్తిచూపండి

”నవ తెలంగాణ పత్రిక మమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిర్భయంగా రాసే ప్రక్రియ కొనసాగించండి. మేం చేసే తప్పులను పత్రికా పరంగా మా దృష్టికి తీసుకురండి. ప్రభుత్వ పరంగా మా సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తాం”
– పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి

అధికారుల అభిప్రాయాలూ తెలుసుకోండి

”క్షేత్రస్థాయిలో నెగెటివ్‌ వార్తలు రాసేటప్పుడు సంబంధిత అధికారుల వెర్షన్‌ కూడా తీసుకోవాలి. ఆన్‌లైన్‌ పత్రికలు చదివేవారి సంఖ్య పెరుగుతున్నది. క్షేత్రస్థాయిలో స్ఫూర్తివంతమైన కథనాలను కూడా రాయాలి. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తున్నది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి”
– ప్రియాంక, స్పెషల్‌ కమిషనర్‌, సమాచార, పౌరసంబంధాలశాఖ




ట్రంప్‌ భక్తులో-దేశభక్తులో తేలాలి
”అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ సుంకాలతో మొదట దెబ్బతినేది తెలంగాణ రాష్ట్రమే. ఆటోమొబైల్‌, ఫార్మా ఇండిస్టీస్‌, డెయిరీ ఉత్పత్తులు, మొక్కజొన్నలు, సోయాబీన్‌, బియ్యం, బీటీ వంగడాలు, వ్యవసాయ ఉత్పత్తుల్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని ఆంక్షలు విధిస్తున్నారు. అవన్నీ ఇక్కడకు వస్తే తెలంగాణలో పండే మొక్కజొన్నలు, సోయాబీన్‌, విత్తన ఉత్పత్తి కేంద్రాలు, మన పాడిపరిశ్రమ ఏం కావాలి? ప్రధాని మోడీని శిష్యుడిగా ఉండమని ట్రంప్‌ హెచ్చరిస్తున్నారు. అందువల్ల ట్రంప్‌ భక్తులో…దేశభక్తులో ఇప్పుడే తేలాలి”.
– సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

పీడిత ప్రజల పక్షానే నవతెలంగాణ

”పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి, సమస్యల్ని విశ్లేషించి, తాడిత, పీడిత, శ్రామిక వర్గాల ప్రజల హక్కుల సాధన కోసం పోరాడే పద్థతుల్లో నవతెలంగాణ వార్తలు ఉండటం విశేషం. ఇది కూడా శ్రామిక వర్గాల విముక్తి కోసం జరిగే పోరాటంలో భాగమే. దానిలో మీవంతు పాత్రను నిర్వహిస్తున్నందుకు విప్లవాభివందనాలు”
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

ప్రజాప్రయోజనాలను విడమర్చి చెప్పాలి

”జనానికి ఇష్టమైన విషయాలు చెప్పడం వేరు. జనానికి ఏది ప్రయోజనమో అది చెప్పడం వేరు. ప్రజలకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. అవి తెలిసేటట్టు ప్రజలకు చెప్పాలి. ఆ బాధ్యతను పత్రికలు నిర్వహించాలి. పహల్గాం ఉగ్రదాది, ఆపరేషన్‌ సింధూర్‌ వంటి యుద్ధంలో నిజాల్ని బయటకు తీయాల్సిన బాధ్యత జర్నలిస్టులది. ఎన్ని పత్రికలు ఆ బాధ్యతల్ని నిర్వహించాయి. ‘నవతెలంగాణ’ ఈ బాధ్యతలన్నింటినీ నిర్వహిస్తుంది. ప్రజల పక్షాన నిలుస్తుంది”.
– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం

వాస్తవాలు చెప్తే… దేశద్రోహులంటున్నారు బీ.వీ.రాఘవులు, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు
దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం ప్రమాదంలో పడ్డాయనీ, వాటిని రక్షించాల్సిన బాధ్యత మీడియాపైనా, జర్నలిస్టులపైనా, దేశభక్తులపైనా ఉందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు అన్నారు. పత్రికలెప్పుడూ కనపడని..వినపడని విషయాల్ని విప్పిచెప్పాలనీ, కప్పిపెట్టకూడదదని సూచించారు. నవతెలంగాణ దినపత్రిక నూటికి 80 శాతం ప్రజల పక్షాన పనిచేస్తున్నదని తెలిపారు. దేశప్రయోజనాలను కాదని కొన్ని పత్రికలు పెట్టుబడిదారుల పక్షాన నిలుస్తుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. నిజాయితీగా, నిక్కచ్చిగా వార్తలు రాసే జర్నలిస్టులపై దేశద్రోహులనే ముద్రవేసి అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని ప్రజలకు విడమర్చి చెప్పిన న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ప్రభీర్‌ పుర్కాయస్తను అరెస్టు చేశారని ఉదహరించారు. దేశప్రయోజనాల కోసం కేటీపీఎస్‌, వైటీపీఎస్‌ వంటి సంస్థల డిజైన్లలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి దేశద్రోహి ఎలా అవుతారని ప్రశ్నించారు. ట్రంప్‌ ఆర్థిక ఆంక్షలు మొదలైతే తెలంగాణకే ఎక్కువ నష్టమనీ, రాష్ట్రంలోని పాడి, వ్యవసాయం, ఫార్మా, ఆటోమొబైల్‌, ఐటీ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. మోడీ, ట్రంప్‌ ఇద్దరు దోస్తులంటూ గొప్ప ప్రచారం చేసుకుంటున్నవారు ట్రంప్‌ వ్యాఖ్యలపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ఆర్థిక వనరులపై కేంద్రంలోని బీజేపీ సర్కారు దాడి చేస్తున్నదనీ, 70 శాతం నిధులు కేంద్రం చేతుల్లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాలకిచ్చే జీఎస్టీ ఆదాయం తగ్గుతున్నదనీ, సెస్సుల భారం పెరుగుతున్నదని చెప్పారు. మోడీ బొమ్మ పెడితేనే నిధులిస్తామని బెదిరించడం, అప్పుల కోసం ఆంక్షలు విధించడం దారుణమన్నారు. ఫెడరలిజం దెబ్బతింటే దేశం సమైక్యంగా ఉండటం కష్టమని హెచ్చరించారు. ఇలాంటి తరుణంలో స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో ప్రజలే దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సర్‌ పేరిట బీహార్‌లో బీజేపీ కూటమి ప్రభుత్వం ఓట్లను తొలగించే కుట్రకు తెరలేపిందని విమర్శించారు. 11 రకాల ధ్రువీకరణ పత్రాలు చూపాలనటం దారుణమన్నారు. ఆధార్‌కార్డులు నకిలీవని చెబుతున్నవాళ్లు మహారాష్ట్రలో 42 వేల మంది తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందారని తేలిందనీ, బీహార్‌లో ఓట్ల ధ్రువీకరణలో జనన ధ్రువీకరణపత్రాలన్నీ కరెక్టేనని ఎలా చెబుతారని ప్రశ్నించారు. మోడీ సర్కారును ప్రశ్నించేవారిపై అర్బన్‌ నక్సలైట్లు అని ముద్ర వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా బ్లాక్‌ను ఏర్పాటు చేసి దేశాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యం ఉంటేనే ప్రజలకు రక్షణ అనీ, సెక్యూలరిజంతోనే సోషలిజం సాధ్యమని స్పష్టం చేశారు.

పేదల పక్షపాతి

”ప్రజాశక్తి మాతృక నుంచే నవతెలంగాణ పత్రిక ఆవిర్భవించింది. ఈ పత్రికది స్వాతంత్య్ర వారసత్వం.విశాలాంధ్ర, నవశక్తి, జనశక్తి, ప్రజాశక్తిగా మార్పులు చెందుతూ, అనేక నిర్భంధాలను ఎదుర్కొని నవతెలంగాణగా ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చింది. గొంతులేని వారిక గొంతుకగా నిలుస్తున్నాం. పేదల పక్షపాతిగా వార్తలు రాస్తున్నాం”.
– పి ప్రభాకర్‌, సీజీఎం, నవతెలంగాణ

ప్రత్యామ్నాయ జర్నలిజంతో ముందుకు..

”పాలకపక్షాలు, కార్పొరేట్లకు అనుగుణంగా మీడియా పని చేస్తుంది. దానికి పూర్తి భిన్నంగా ప్రత్యామ్నాయం ఎజెండాతో, ప్రత్యామ్నాయ జర్నలిజంతో ‘నవతెలంగాణ’ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. కూడు, గూడు, గుడ్డ లేని అణగారిన వర్గాలు, కార్మికులు, కర్షకుల హక్కుల కోసం వారి పక్షాన వార్తలు రాస్తున్నది. ‘పత్రిక ఒక్కటున్న పదివేల సైన్యంబు’ అనే నానుడిని నిజం చేస్తూ సాంకేతికతను అందిపుచ్చుకుంటూ నేడు లక్షలాదిమందికి చేరువ అవుతున్నాం”.
– రాంపల్లి రమేష్‌, ఎడిటర్‌, నవతెలంగాణ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -