డెబ్బయి ఏడవ రిపబ్లిక్ దినోత్సవం రోజున మన సైనిక బలగాల సత్తాను ప్రదర్శించారు. న్యూఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిపిన కవాతును చూసి దేశం యావత్ పులకించిపోయింది. ప్రతిదేశం రిపబ్లిక్ దినోత్సవం లేదా స్వాతంత్య్ర దినోత్సవం, ఇతర ముఖ్య ఉదంతాలు ఉంటే ఆ రోజున ఇలాంటి విన్యాసాలను ప్రదర్శించి తమ శక్తి ఇదని ప్రపంచానికి చాటుతున్నాయి. ఈ సందర్భంగా కొందరు విశ్లేషకులు, కొన్ని టీవీఛానళ్లు ప్రసారం చేసిన కథనాలు, విశ్లేషణల్లో అతిశయోక్తులు దొర్లాయి.ఈ నేపథ్యంలో ప్రపంచ మిలిటరీ బలం బలగాల గురించి పరిమితంగా అయినా ఒక్కసారి అవలోకనం చేసుకోవ టం అవసరం. హిందూ మహాసముద్రం భారతదేశానిదే అని ఒక విశ్లేషకుడు చెప్పారు. ఒక దేశ సరిహద్దు నుంచి 12 నాటికల్ మైళ్ల(ఒక్కో నాటికల్ మైలు 1.852 కిలోమీటర్లకు సమానం) వరకు ఆయా దేశాలకు సర్వహక్కులు ఉంటాయి. పన్నెండు నుంచి 24 నాటికల్ మైల్స్ వరకు కస్టమ్స్, వలసలు,కాలుష్యాలకు సంబంధించిన చట్టాలు అమలు చేసే అధికారం ఉంటుంది.రెండువందల నాటికల్ మైల్స్ వరకు సముద్ర ఉత్పత్తులు,ఆ పరిధిలో ఉన్న ఖనిజ వనరులను తవ్వితీసుకొనే హక్కు ఆయాదేశాలకు ఉంటుంది. ఆపైన ఉండే ప్రాంతం అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. శ్రీలంక-భారత్ మధ్య దూరం 288 కిలోమీటర్లు మాత్రమే ఉన్నందున సమదూరంతో సరిహద్దుల నిర్ణయం జరిగింది. నిజానికి హిందూ మహాసముద్రం అంటే మనదేశ సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదు. పొడవు 9,600, వెడల్పు 7,600 కిలోమీటర్లు ఉంది. మనదేశానికి ఇది మూడువైపుల ఉంది. దీనిలో అందరికీ తెలిసిన అరేబియా సముద్రం, బంగాళాఖాతం, మరికొన్ని ప్రాంతీయ సముద్రాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి హిందూ మహాసముద్రం అంటున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండం వరకు విస్తరించి ఉంది.
మనదేశం వద్ద 1,500 కిలోమీటర్ల దూరంలోని యుద్ధ నౌకలను దెబ్బతీసే సామర్ధ్యం గల దీర్ఘశ్రేణి క్షిపణి (ఎల్‌ఆర్- ఎఎస్‌హెచ్‌ఎం)తో చైనా,అమెరికా నౌకలను కూడా దెబ్బతీయ గలవని విశ్లేషకుడు చెప్పారు. అది నిజమే, యుద్ధం వచ్చినపుడు, ఎదుటివారు దాడికి దిగనంతవరకు మాత్రమే. హిందూమహా సముద్ర అంతర్జాతీయ జలాల్లో ప్రవేశించిన ఏ దేశ నౌకనైనా వెంటనే పేల్చివేయటానికి ఉండదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే అలాంటి క్షిపణులను తయారు చేసే దేశంగా మనం ఇటీవలనే సామర్ధ్యం సంపాదించుకున్నాం. మనకంటే బలమైన మిలిటరీ శక్తి ఉన్న విషయాన్ని దాచి ప్రపంచంలో మనకు ఎదురులేదని ఎవరైనా చెపితే అది వాట్సాప్ పాండిత్యం తప్ప మరొకటి కాదు. వర్తమాన బలా బలాల గురించి ఈ సందర్భంగా చూద్దాం.మన దగ్గర ఐదువేల కిలోమీటర్ల దూరం ప్రయోగించగల ఖండాంతర క్షిపణి అగ్ని-5 ఉంది. ఇతర దేశాలలో మినిట్‌మాన్- అమెరికా క్షిపణి 13వేల కిమీ, రష్యాలో ఆర్‌ఎస్- 28 శాటమాన్ క్షిపణి పదకొండువేల కి.మీ, చైనా వద్ద డాంగ్ ఫెంగ్-41 రకం తొమ్మిదివేల కిలోమీటర్లు ప్రయాణించగలవి ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద గరిష్టంగా 15వేల కిలోమీటర్లు ప్రయాణించే క్షిపణి తయారీలో ఉన్నట్లు ఊహాగానాలు. దాని వద్ద శక్తివంతమైన ద్రీర్ఘశ్రేణి క్షిపణులు ఉన్నకారణంగా తేడా వస్తే తన మిత్రదేశంగా ఉన్న జపాన్ మీద ప్రయోగించ గలదనే భయంతోనే అమెరికా ఒళ్లు దగ్గరపెట్టుకొని వ్యవహరిస్తున్నది. ఇలా ఒకరిని మించి ఒకరు తమ ఆయుధాలకు పదును పెట్టుకుంటున్నారు. ఈ పూర్వరంగంలో మనదేశం కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆయుధాలను తయారు చేసుకోవాల్సిందే అనటం నిర్వివాదాంశం. దీనిలో భాగంగానే అణ్వ స్త్రాలను తయారు చేసుకొనే అవకాశాలను అట్టిపెట్టు కొని అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేసేందుకు నిరాకరించాం.గతంలో రెండుసార్లు మనం అణుపరీక్షలు జరిపినపుడు మిత్రదేశం అంటూనే మనమీద కక్షతో అమెరికా ఒక్కటే ఆంక్షలు విధించింది.శత్రువైరుధ్యాలు ఉన్నప్పటికీ చైనా అలాంటి చర్యలకు పాల్పడలేదు.
మానవాళికి ముప్పు తెచ్చే యుద్ధాలు వద్దనే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. కానీ ఉన్మాదంతో కొందరు ఊగిపోతున్నారు. పదిహేను వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని దెబ్బతీసే మన తాజా క్షిపణి ధ్వనివేగం (గాలిలో గంటకు 1,225కిలోమీటర్లు) పది మాక్‌లంటే 12,250 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని పావు గంటలోనే పని ముగిస్తుందని చెబుతున్నారు. ఇది మన డిఆర్‌డిఓ శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. అయితే వారు ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. రష్యా వద్ద 27 మాక్‌ల అవన్‌గార్డ్, చైనా వద్ద 27మాక్‌ల డిఎఫ్-41, అమెరికా దగ్గర ట్రైడెంట్ 24, మినిట్‌మాన్ 23,రష్యా వద్ద 20.64మాక్‌ల క్షిపణులు ఉన్నాయి. అందువలన మా దేవుడే అందరికీ అంటే ఎలా అంగీకరించటం లేదో ఇది కూడా అంతే. మన గొప్ప గురించి మనం చెప్పుకోవచ్చు తప్ప మనమే గొప్ప అంటే జనాలను తప్పుదారి పట్టించినట్లే. మన మిలిటరీ అజేయమే అయితే నరేంద్రమోడీ మన ఆక్రమిత కాశ్మీర్‌ను ఎందుకు వెనక్కు తీసుకురాలేదు, ఆపరేషన్ సింధూర్‌లో మరికొంత మందుకు పోయి ఉంటే పని జరిగేది కదా అని అనేక మంది అనుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యుద్ధాల్లో కావాల్సింది ఎప్పటి సమాచారాన్ని అప్పుడు తెలియచేసే పరిజ్ఞానం. ఉక్రెయిన్‌కు అలాంటి సత్తాలేనప్పటికీ పశ్చిమ దేశాలు అందచేసిన సమాచారంతో గడచిన నాలుగేళ్లుగా రష్యాను అడ్డుకోవటమే గాక, కొన్ని దాడులు కూడా చేయగలుగుతున్నదంటే కారణం అదే. ఆపరేషన్ సింధూర్‌లో తొలిరోజు మనకు ఎదురుదెబ్బలు తగలటానికి కారణం పాకిస్తాన్‌కు పశ్చిమదేశాలు(అమెరికాతో సహా) అందించిన సమాచారమే కారణంగా కొందరు భావిస్తున్నారు.
అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం మిలిటరీ అవసరాల కోసం వినియోగించే ఉపగ్రహాలు అమెరికా వద్ద 247, చైనా 157, రష్యా 110,ఫ్రాన్స్ 17, ఇజ్రాయిల్ 12, ఇటలీ 10, ఇండియా 9, జర్మనీ 8,బ్రిటన్ 6, స్పెయిన్ 4 కలిగి ఉన్నాయి.అందువలన భూమి చుట్టూ తిరిగే అవి ఒకదాని వెనుక ఒకటి సమాచారాన్ని పసిగడితేనే 24గంటల్లో ఏం జరుగుతుందనేది తెలుసుకోవచ్చు. మిలిటరీతో సహా అన్ని అవసరాలకు గాను అమెరికా 5,176, బ్రిటన్ 653, చైనా 623, రష్యా 181, జపాన్ 88 కలిగి ఉండగా మనదేశం 62 కలిగి ఉంది. అయితే ఈ ఉపగ్రహాలు సేకరించే సమాచారం కూడా మిలిటరీ అవసరాలకు ఉపయోగపడుతుంది.ఈ కారణంగానే ప్రపంచంలో ఏమూల ఏమిజరిగినా అమెరికా ఇట్టే పసిగడుతున్నదంటే ఈ వ్యవస్థలే కారణం. ఇటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ ప్రపంచానికి భద్రత లేదని, తనకు అన్ని వైపుల నుంచీ ముప్పు ఉన్నదని అమెరికా ప్రపంచాన్ని నమ్మించేందుకు గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. గ్రీన్‌లాండ్ ప్రాంతాన్ని తాము ఆక్రమిస్తామని చెప్పిన ట్రంప్ తమ దేశ రక్షణకు ఉన్న ” గోల్డెన్ డోమ్ ” వంటిదాన్నే ఆ ప్రాంతానికి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఏమిటిది అంటే గగనతలం నుంచి జరిగే దాడుల నుంచి రక్షణ కల్పించటం.మన రామాయణ, మహాభారత కథలో అలాంటివి చూసే ఉంటారు. రాక్షసులు యాగాన్ని కొనసాగనివ్వకుండా చేసేందుకు చూస్తే రక్షణగా రాముడిని నియమించిన సంగతి, మహాభారతంలో బాణాలతో అర్జునుడి పరాక్రమం తెలిసిందే.కొన్ని దశాబ్దాలకు ముందే అమెరికా హాలీవుడ్ స్టార్‌వార్స్‌పేరుతో సినిమాలు తీసింది. ఇప్పుడు నిజంగానే అలాంటి గగనతల యుద్ధాలు జరుగుతున్నాయా? అమెరికా కనుసన్నలలో పనిచేసే సంస్థలు, కొందరు వ్యక్తులు రష్యా, చైనా ఈ రంగంలో ముందున్నాయని, ప్రపంచానికి ముప్పు ఉందని ప్రచారం చేస్తున్నారు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడన్నట్లుగా తెలివి ఏ ఒక్కరి సొత్తూ కాదు. అంతా రహస్యంగా జరుగుతున్న వ్యవహారం గనుక ఈ పోటీ గురించి చెబుతున్న అంశాలను అవుననీ, కాదని చెప్పలేము.
భూ కక్ష్యలో ఉపగ్రహాలను దెబ్బతీసే సాంకేతిక పరిజ్ఞానం (ఎసాట్) ప్రతిదేశం కలిగి ఉండాలని అందరూ చెబుతున్నారు. గగనతల కేంద్రంగా ఆయుధాలు కావాలని అమెరికా మిలిటరీ నిపుణులు బహిరంగంగానే చెప్పారు.ఈ విషయంలో రష్యన్లు, చైనీయులు తమ సామర్ధ్యాలను ఎంతో ఆధునికంగా కనపరుస్తున్నా రని, దాన్ని కాదనలేమని బ్రిటన్‌లోని డుర్హామ్ విశ్వవిద్యాలయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం సహడైరెక్టర్ బ్లెడిన్ బోవెన్ చెప్పాడు. నిజంగా అలాంటి వేదికలు ఇప్పుడు ఉన్నాయో లేదో చెప్పలేము గానీ అవసరమైన సాంకేతికతలను వారు చూపుతున్నారని అన్నాడు. ఒక ఉపగ్రహాన్ని నేరుగా దెబ్బతీయటం,ఇతరంగా కూల్చివేయటం వాటిలో ఒకటి.భూతలం నుంచి సముద్రాల్లో నౌకలను ముంచివేయటం, టెర్మినళ్లను దెబ్బతీయటం, ఎలక్ట్రానిక్స్ ద్వారా చేసేవన్నీ గగనతల పోరులో భాగమే అన్నాడు.
ప్రస్తుతం ఉక్రెయిన్ పోరులో స్పేస్ ఎక్స్ స్టార్‌లింక్ వంటి ప్రయివేటు ఉపగ్రహసేవలను అందించేవారు రష్యన్ల ఆయుధాలను పనిచేయకుండా అడ్డుకుంటున్నారని, సైబర్‌దాడులకు పాల్పడు తున్నారని, అదే విధంగా రష్యా నుంచి సంకేతాలను అడ్డుకోవటాన్ని గమనించినట్లు బోవెన్ చెప్పాడు. గగనతల దాడుల ఆయుధాలను తయారు చేయకూడదన్న ఒప్పందాల మేరకు నాడు సోవియట్ వెనక్కు తగ్గిందని ఇప్పుడు రష్యా తిరిగి పూనుకున్నట్లు కనిపిస్తున్నదని రాండ్ స్కూల్ ప్రొఫెసర్ బ్రూస్ ఎం క్లింటాక్ ఆరోపించాడు. సాధారణంగా గగనతలంపై రష్యా పరిమితంగానే ఆధారపడు తుందని, అదే అమెరికా తన ఆర్థిక వ్యవస్థ, యుద్ధాలకు గరిష్టంగా ఆధారపడు తున్నది. రోజువారీ ఉపగ్రహ ప్రయోగాలను చూస్తే చైనా కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తున్నదని క్లింటాక్ చెప్పాడు. ముందే చెప్పుకున్నట్లు ట్రంప్ ప్రస్తావించిన ”గోల్డెన్ డోమ్ ” ఏర్పాటుకు 1983 నాటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ప్రకటించిన స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ నాంది. దీన్నే స్టార్‌వార్స్ అని పిలిచారు. దీనిలో గగనతలంలో ఉండే పరికరాలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే గోల్డెన్ డోమ్ వ్యవస్థ అణ్వాయుధాల నుంచి రక్షణ కల్పించలేదు గానీ ఇతరంగా ఎంతో ఉపయోగం అని బోవెన్ చెప్పా డు. గతంలో ఎదురైన అనేక సాంకేతిక సవాళ్లను అధిగమిం చారని, గగనతలంలో అడ్డుకోవటం సంక్లిష్టమైనదని, వాటిని వేగంగా రూపొందించటం, పరీక్షించటం అంతతేలిక కాదని అంటున్నారు.
అంతరిక్ష రంగంలో మనదేశం అనేక విజయాలను సాధించింది. అయితే ఇంకా ఎంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.చైనా తన సోషలిస్టు వ్యవస్థను కాపాడుకొనేందుకు అమెరికాతో పోటీ అని చెప్పకపోయినప్పటికీ మిలిటరీ రీత్యా బలాన్ని పెంచుకుంటున్నది, ఆర్థికంగా దానికా శక్తి ఉంది. అనేక దేశాల అనుభవాలను చూసినపుడు మిలిటరీ మీద అవసరమైనదాని కంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. మనదేశం 109 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంటే (జిడిపి 4లక్షల కోట్ల డాలర్లు) చైనా 303 బిలియన్ డాలర్లు (జిడిపి 19లక్షల కోట్ల డాలర్లు) వెచ్చిస్తున్నది. అమెరికా 831 బిలియన్ డాలర్లు (జిడిపి 30లక్షల కోట్ల డాలర్లు) కేటాయించింది. తన ఆయుధ పరిశ్రమలకు లబ్ది చేకూర్చేందుకు అమెరికా వెచ్చిస్తున్నది, చైనా స్వంతంగా తయారు చేసుకొనేందుకు పూనుకుంది.మనం ఇతర దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాం. అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేస్తే ఓకే, మనం కూడా ప్రపంచ శక్తిగా ఎదగాలంటే పోటీపడే ఆర్థికశక్తి ఉందా లేదా అన్నది ముందు చూసుకోవాలి!
ఎం కోటేశ్వరరావు
8331013288
ప్రపంచ మిలిటరీ శక్తిలో ఎవరెక్కడ!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



