Thursday, November 13, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఎవరిదీవైఫల్యం?

ఎవరిదీవైఫల్యం?

- Advertisement -

పహల్గాం నెత్తుటిధార ఆరకముందే మరో బాంబుపేలుడు ఢిల్లీని కుదిపేసింది. సోమవారం ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుళ్లలో అమాయక పౌరులు పదమూడు మంది చనిపోవడం బాధాకరం. ప్రధాని నివాసానికి కేవలం పన్నెండు మైళ్ల దూరంలో ఈఘటన చోటుచేసుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇది ఉగ్రదాడా? ఆత్మాహుతినా? మరేమిటన్న వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కానీ, ఈ ఘటన తర్వాత ఢిల్లీ ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ప్రజలు ఆభద్రతలో పడిన మాట వాస్తవం. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మాత్రం ఎప్పటిలాగే ‘దర్యాప్తు వేగంగా జరుగుతోంది. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం’ వంటి డైలాగులతో తన వైఫల్యాన్ని నిస్సిగ్గుగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. కానీ ప్రతి రక్తపుచుక్కలో ప్రజల నమ్మకం మునుగుతోందన్న విష యాన్ని అధికార పక్షం విస్మరించింది. సురక్షిత భారత్‌గా చూపించాలనే పాలకుల ప్రచారం, ఎర్రకోట గోడల వెనుక పడ్డ భద్రతా చిల్లును మాత్రం మూయలేకపోయింది. తనకు తాను ‘చౌకిదార్‌’ గా చెప్పుకున్నవారు ఎక్కడీ ఇంత పెద్ద ఘటన జరిగితే సమీక్షించి, బాధితులకు భరోసానివ్వా ల్సింది పోయి ‘నా గుండె బరువెక్కుతోంది’ అని ప్రకటించి భూటాన్‌ దేశ పర్యటనకు వెళ్లడం అత్యంత బాధ్యతా రహిత్యం.

సాధారణంగా ఢిల్లీ అంటేనే హైసెక్యూరిటీ కలిగిన ప్రాంతం. దేశపు రాజధాని, పీఎం నుంచి కేంద్రమంత్రుల వరకు ఇక్కడి నుంచే దేశాన్ని పాలిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి రాజకీయ అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రుల నుంచి మొదలుకుని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వస్తుంటారు. చారిత్రక ప్రదేశాలను వీక్షిం చేందుకు పర్యాటకుల తాకిడి అంతే ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలో బాంబుదాడులు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. నిఘా సంస్థలు ఏం చేస్తున్నట్టు, కేంద్ర భద్రతా వ్యూహాలు ఏమైనట్టు? భద్రతను కూడా రాజకీయ ప్రచారంగా మలుచుకుంటున్న పాలకులు ఆచరణలో మాత్రం రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. నిత్యం కేంద్ర నిఘా సంస్థలు, పారా మిలటరీ, ప్రత్యేక భద్రతా బలగాలు, నేర దర్యాప్తు బృందాల పర్యవేక్షణలో ఉండే రాజధానిలోనే భద్రతా వ్యవస్థ నిద్రలో ఉందా? ఇది ‘బీహార్‌ ప్రచారం’లో మునిగిపోయిన పాలకుల నిర్లక్ష్యాన్ని సైతం బహిర్గతపరుస్తోంది. ఇప్పటికే పుల్వామా దాడిలో నలభైమంది సీఆర్‌పీఎఫ్‌ సైనికులు చనిపోయారు. ముందస్తు హెచ్చరికలు బేఖాతర్‌ చేసినం దువల్లే ఈ ఉగ్రదాడి జరిగిందని స్వయంగా జమ్మూకాశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ చెప్పడం అప్పట్లో ఒక సంచలనం. మళ్లీ కేంద్రంలో మోడీ సర్కారు గద్దెనెక్కడానికి ఈ ఘటన అనంతరం సాగిన విద్వేష ప్రచారం ఉపయోగపడిందనేది విశ్లేషకుల అభిప్రా యం. వీటిని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం!

పహల్గాం దాడి తర్వాత కూడా ఈ విద్వేష వాతావరణం అలాగే కొనసాగింది. మంచుకొండల్లో ఇరవై ఆరుమంది టూరిస్టులు హతమయ్యారు. ఆ సమయంలో బీహార్‌ ఎన్నికల దృష్ట్యా అక్కడికెళ్లిన ప్రధాని దీన్ని రాజకీయ ప్రచారాస్త్రంగా వాడుకున్నాడు. ‘ప్రతి భారతీయుని రక్తం మరుగుతోంది. దెబ్బకు దెబ్బతీస్తాం’ అంటూ ఉద్వేగాన్ని రెచ్చ గొట్టారు. దేశం ప్రమాదంలో ఉందని, తానే ఈ సమస్యకు ఒక పరిష్కారమనీ ప్రచారం గావించారు. కానీ మళ్లీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశ చరిత్రలో ఎన్నడూ ఎరగని విధంగా మూడు రాష్ట్రాల్లో 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం ఎవరికైనా ఆందోళన కలిగించేదే. మరి, ‘తీవ్రవాదులను ఏరేస్తాం, వారి మూలాలు పెకిలిస్తామని’ ప్రగల్భాలు పలికినవారు ఏంచేస్తున్నట్టు?

మాట మాట్లాడితే బీజేపీ పాలనలో ఉగ్రదాడులు తగ్గాయని, ముష్కర మూకలకు మోడీ సర్కార్‌ ముకుతాడు వేసిందని ప్రచారం చేస్తున్న పరివారం వాస్తవ పరిస్థితుల్ని తొక్కి పెడుతుందనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ఈ పదకొండేండ్ల కాలంగా కాశ్మీర్‌ నుంచి ఎర్రకోట వరకు అరవై ఎనిమిది ఉగ్రదాడులు జరిగాయి. ఇందులో 360 వరకు సైనికులు, పోలీసులు చనిపోగా, 230 మంది పౌరులు అసువులు బాశారు. ఈ దాడుల్లో గాయపడిన వారి కుటుంబాల వేదన, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఇంకా కూడా కోలుకోలేని స్థితిలో ఉన్నారు. దేశమంతా డబులింజన్‌ సర్కార్‌ను వల్లెవేసే మోడీ ఢిల్లీలో కూడా వారి ప్రభుత్వమే అధికారంలో ఉంది. మరీ ఈ దాడుల్ని ఎందుకు నిరోధించలేదు? ప్రజలు ఇంతటి భయానకమైన ఒత్తిడిలో బతకడం ఏలికల అసమర్థత కాదా? దేశరక్షణ అంటే ప్రతి ఘటనగా బాంబులు వేయడం కాదు, ప్రజల భద్రతా హక్కు, రాజకీయ పారదర్శకత. భద్రతను ‘చిత్రీకరణ’గా, దాడిని ‘ప్రచారయుద్ధం’గా మార్చేసిన తప్పుడు రాజకీయ భావజాలం దేశానికి అత్యంత ప్రమాదకరం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -