Tuesday, July 15, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిలోపం ఎవరిది?

లోపం ఎవరిది?

- Advertisement -

దేశీయ విమానయాన రంగాన్ని ఒక కుదుపు కుదిపిన అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ 787 ప్రమాదంపై వెలువడిన ప్రాథమిక నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రమాదం జరిగిన దాదాపు నెల తర్వాత వెలువడిన ఈ నివేదికలో పేర్కొన్న అంశాలపై జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. విచారణ పూర్తి కాకుండానే నివేదికను బహిర్గతం చేయడం, అందులో పైలట్ల తప్పు ఉందనిపించేలా కొన్ని వ్యాఖ్యలు ఉండటం పట్ల పైలట్ల సంఘం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. వివాదం తీవ్రమౌతుండటంతో ఇదే తుదినివేదిక కాదని, దీని ఆధారంగా ఎటు వంటి నిర్ధారణకు రావద్దని, వ్యాఖ్యలు చేయవద్దని పౌర విమానయాన శాఖ కోరింది. గతనెల 12వ తేదీన జరిగిన ఈ ప్రమా దంలో 260 మంది మరణించిన సంగతి తెలిసిందే. దేశీయ విమానయాన చరిత్రలో జరిగిన అతి ఘోర ప్రమాదాల్లో ఒకటిగా ఈ దుర్ఘటన నిలిచింది.
విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది నిమిషాల్లోనే ఇంజన్లకు ఇంధన సరఫరా ఒక్కసారిగా ఆగిపోవడం, మెడికల్‌ కళాశాల హాస్టల్‌ భవనాలపై కుప్ప కూలిపోవడం వంటి అంశాలు అత్యంత తీవ్రమైనవని, వీటిని సాధారణ సాంకేతిక లోపాలుగా పరిగణించ డానికి ఏ మాత్రం వీలులేదని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ఏర్పాటు చేసిన ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఎఎఐబి) ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రాధాన్యత నంతరించుకుంది. కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌లో నమోదైనట్టుగా పేర్కొన్న పైలట్ల సంభాషణ ప్రమాద సమయంలో నెలకొన్న గందరగోళ, భయానక పరిస్థితిని కండ్లకు కడుతోంది. ఈ నివేదికతో ఇంధన కాలుష్యం, పక్షులు ఢకొీనడం వంటి అంశాలు ఈ ప్రమాదానికి కారణం కాదని తేలినట్లు భావిస్తున్నారు. పదిహేను పేజీల ఈ నివేదికలో ఇంజిన్‌ 1, ఇంజిన్‌ 2 యొక్క ఇంధన నియంత్రణ స్విచ్‌లు ఒక సెకను తేడాతో ఒక దాని తర్వాత ఒకటి ‘రన్‌’ నుండి ‘కట్‌ఆఫ్‌’ స్థాయికి మారినట్లు (స్విచ్‌లు ఆఫ్‌ కావడంతో ఇంధన సరఫరా నిలిచిందని) పేర్కొనడం కలకలం రేపు తోంది. ‘3,505 మీటర్ల పొడవైన రన్‌వే నుండి ఎగరడం ప్రారంభించిన వెంటనే స్విచ్‌లు కట్‌ ఆఫ్‌కి మారాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడింది’ అని వివరించారు. ఈ సందర్భంగా పైలట్ల మధ్య చోటుచేసుకున్న సంభాషణను కూడా ప్రస్తావించారు. స్విచ్‌లు ఎందుకు ఆఫ్‌ చేశావని ఒక పైలట్‌ ప్రశ్నిస్తుండగా, మరొకరు తాను ఆపలేదని చెబుతున్న విషయం వాయిస్‌ రికార్డర్‌లో నమోదైంది. దీని ఆధారంగానే పైలట్లమీద సామాజిక మాధ్యమాల్లోనూ, ఇతరత్రా వస్తున్న ఆరోపణలపై పైలట్ల సంఘం స్పందించాల్సి వచ్చింది.
ఇన్వెస్టిగేషన్‌ బ్యూరోలో పైలట్ల ప్రతినిధులు ఒక్కరు కూడా లేకపోవడాన్ని ఆ సంఘం తప్పు పట్టింది. అదే సమయంలో లాభాలను తమ ఖాతాల్లో వేసుకుని లోపాలను సిబ్బందిపై తోసివేసే పెట్టుబడిదారి వ్యవస్థ సహజ లక్షణాన్ని విస్మరించలేం. నిజానికి నివేదిక ప్రకారమే పైలట్ల సంభాషణ పూర్తిగా రికార్డు కాలేదు. ఇంత భయానక సంక్షోభ సమయంలోనూ ఇంజిన్లను పాక్షికంగా పనిచేసేటట్లు పైలట్లు చేయగలిగారని, అయితే, ఆ వెంటనే ‘మే డే’ పిలుపు ఇచ్చారని నివేదికలో పేర్కొనడం గమనార్హం. విమాన ఇంధన నాణ్యత, బరువు నిర్దేశించిన పరిమితుల్లోనే ఉన్నాయని పేర్కొనడం, పైలట్లు అనుభవజ్ఞులు కావడంతో ఈ పెను విషాదానికి దారితీసిన అసలు కారణమేమిటో ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ పరిస్థితే దేశీయ విమానయాన భద్రతా వ్యవస్థలో దాగి ఉన్న లోపాలపై ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది.
అత్యంత సంక్లిష్టమైన రంగాల్లో ఒకటైన విమానయాన రంగంలో ఏర్పడే చిన్నలోపం కూడా ప్రాణాంతకంగా మారుతుంది. ఇలాంటి సమయంలో విచారణ పూర్తికాక ముందే పైలట్లపై, సాంకేతిక సిబ్బందిపైనా నిందారోపణలు చేయడం ఏమాత్రం సబబు కాదు. తప్పు వ్యవస్థల వల్ల జరిగిందో, వ్యక్తుల వల్ల జరిగిందో తేల్చాల్సిన బాధ్యత విచారణ సంఘానిది! ఆధునిక విమాన యానం అనేక అంతర్గత సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడి ఉంటుంది. వీటిలో ఏ చిన్నలోపం ఏర్పడినా అది పెను ప్రమాదానికి దారితీస్తుంది. తాజా ప్రమాదంలో పైలట్లు చివరివరకు ప్రమాదాన్ని నివారించడానికి చేసిన కృషిని గమనించాలి. ఈ ఘటనను ఒక పాఠంగా తీసు కుని విమానరంగ భద్రతా ప్రమాణాలను, నిర్వహణా విధానాలను, సిబ్బంది శిక్షణా ప్రమాణాలను, అత్యవసర చర్యల ప్రణాళికలను పూర్తి స్థాయిలో సమీక్షించాలి. ప్రయివేటీకరణకు ముందు, తర్వాత ఎయిర్‌ ఇండియాలో చోటుచేసుకున్న మార్పులనూ విశ్లేషించాలి. ఆ సమీక్ష ప్రాతిపదికన భద్రత, నిబద్దత లక్ష్యాలుగా విమానయాన రంగాన్ని పునర్‌నిర్మించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -