రాష్ట్రంలో ఈ విద్యా సంవత్స రానికి గాను మార్చిలో జరిగే పదోతరగతి పరీక్షా విధానంలో విద్యాశాఖ మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నది. పది పరీక్షల్లో 2014నుండి గ్రేడింగ్ విధానం అమలు జరుపుతుండగా, మళ్లీ పాతవిధానం మార్కులను ప్రవేశపెట్టబోతున్నది. అందుకు ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. మార్కుల విధానం అనేది బ్రిటీష్ పరిపాలనా కాలం నుండి అమలు జరుగుతున్న పాత ప్రక్రియనే! నాడు గుమాస్తాల తయారీకి మెకాలే ప్రవేశపెట్టిన మార్కుల ప్రాతిపదిక వలస పరీక్షా విధానాన్ని పాలకవర్గాలు ఇన్నేండ్లు అనుసరిస్తూ వచ్చాయి. అయితే ఈ విధానం కేవలం విద్యార్థి జ్ఞానాన్ని మాత్రమే అంచనా వేస్తుంది తప్ప వారిలో పరిపూర్ణతను వెలికితీసే విధంగా ఉండదని విద్యానిపుణులు, విద్యావేత్తలు, అధ్యాపకులు చెబుతున్న మాట. తరగతి గదిలో చేసే పరికల్పనలు అంచనా వేసేదిగా ఉండవని, సబ్జెక్టు ప్రాతిపదికన తీసుకున్న విద్యార్థి పొందే ఐదారు సామర్థ్యాల్లో ఒక్క జ్ఞానసామర్థ్యాన్ని మాత్రమే ఈ విధానం పరిశీలిస్తుందని వారి అభిప్రాయం. అంటే, చదవడం, రాయడం, తరగతి బయట విద్యార్థి చేసే పరికల్పనలకు ఈ పరీక్షా విధానం స్థానం ఇవ్వడం లేదనేది వాదన. ఇంకా ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య ఉండాల్సిన సజీవ సంబంధాన్ని దెబ్బతీస్తుందని, అన్ని కోణాల నుండి విద్యార్థిని అంచనా వేయడం లేదని, అభ్యసనానుభవాలను అంచనా వేయడంలో అశాస్త్రీయత గోచరిస్తుందని విమర్శ. వారు చెప్పిన అంశాలన్నీ పరిశీలిస్తే గనుక వాస్తవమేనని అనిపిస్తున్నది.
ఎందుకంటే, ఏడాది పాటు నేర్చుకున్న విద్యను మూడుగంటల కాలవ్యవధిలో పరీక్షించడం కూడా సరైన కొలమానం కాదు. ఆ సమయంలో విద్యార్థి భౌతిక పరిస్థితి, మానసిక ఒడిదుడు కులకు లోనైతే, ఏడాదికాలం విద్యార్థి నేర్చుకున్న అభ్యస నానుభవాలు అంచనా వేయ డంలో అసమతూల్యత ఏర్పడుతుంది. ఇది శాస్త్రీయమైన పరీక్షా విధానం కాదని కూడా నిర్ధారణ అయింది. కేంద్ర, రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థలు ఈ వాదనలతో ఏకీభవించాయి.అయితే, ఇక ప్రయివేటు విద్యాసంస్థలు కూడా మార్కుల ప్రాతిపదిక విధానంలోని బలహీనత పట్టుకుని విద్యార్థులను పరీక్షలకు తయారుచేసే పేరుతో మానసిక, భౌతిక హింసలకు పాల్పడ్డాయి. అనుభవపూర్వక జ్ఞానం అందించడానికి బదులు తేలికపాటి ”బట్టీ”విధానం ద్వారా నూటికి నూరు మార్కులు పేరుతో పరీక్షలను భ్రష్టు పట్టించాయి. ఒత్తిడితో కూడిన పరీక్షా విధానంగా మార్చేశాయి. అంతేకాదు ప్రయివేటు విద్యాసంస్థల మధ్య అనారోగ్యకర పోటీకి ఈ మార్కులు ప్రహసనంతో తెరలేపాయి. కొన్ని గుత్త ప్రయివేటు సంస్థలు తమ పలుకుబడి ఉపయోగించి పరీక్షల్లో అనేక అక్రమాలకు సైతం పాల్పడ్డాయి? ఇలాంటి అన్నిరకాల అశాస్త్రీయ పరీక్షా విధానం మార్చుకునేందుకే నూతన పరిపూర్ణ మూల్యాంకనం విధానంగా విద్యాహక్కు చట్టం -2009 ద్వారా మన పరీక్షా విధానాన్ని సంస్కరించారు. అందులో భాగంగా వచ్చిందే ”నిరంతర సమగ్ర మూల్యాంకనం” (సిసిఇ) విధానం. పార్లమెంటు ఆమోదంతో వచ్చిన విద్యాహక్కు చట్టం -2009సెక్షన్ 19(1)హెచ్ ద్వారా సిసిఇ విధానం దేశవ్యాప్తంగా ఏకరూప పరీక్షా విధానంగా ముందుకొచ్చింది.కేంద్రంతో పాటు, అనేక రాష్ట్రాల్లో ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రక్రియనే అమలులో ఉంది.అందుకనుగుణంగా సిలబస్ సైతం రూపొందించబడింది.మారిన పరీక్షా విధానం ఆరో తరగతి నుండి వరుసగా అమలు చేస్తూ 2014 మార్చి నాటికి, పదోతరగతికి మార్కుల స్థానంలో గ్రేడులతో ముందుకు వచ్చిన సిసిఇ విధానాన్నే అనివార్యంగా రాష్ట్రంలో అమలు చేయాల్సి వచ్చింది.
నిరంతర సమగ్ర మూల్యాంకనంలో పరీక్షలు ఓ మూడు గంటలకు పరిమితం కాదు. తన అభ్యసనానుభవాల్లో అంతర్భాగంగా సులభమైన విధానాలుగా అమలు చేయబడుతుంది. ఏడాది కాలం సిలబస్ రెండు భాగాలుగా చేసి సంగ్రాహనాత్మక మూల్యాంకనం ఎస్‌ఏ -1,ఎస్‌ఏ – 2గా నిర్వహిస్తారు.ఒక సబ్జ్జెక్టులో ఉన్న అన్ని కాంపిటేషన్స్ విద్యార్థిలో కవర్ అయ్యేలా (40ప్లస్40) మార్కులు ప్రాతిపదికన రెండుసార్లు చదువుకున్న పాఠశాలలోనే నిర్వహిస్తారు. ఇక ఏడాది విద్యాసంవత్సరం నాలుగు భాగాలు చేసి నిర్మాణాత్మక మూల్యాంకనం ఎఫ్‌ఏ-1, ఎఫ్‌ఏ-2, ఎఫ్‌ఏ-3, ఎఫ్‌ఏ-4గా ఆయా తరగతి ఉపాధ్యాయులే నిర్వహిస్తారు.ఇందులో విద్యార్థి రాతాంశం (5మార్కులు), చదవడం(5మార్కులు), ప్రాజెక్టు వర్క్, పరికల్పన(5మార్కులు), స్లిప్ టెస్టు,( పాఠ్యం అర్థం చేసుకున్న ఫీడ్ బ్యాక్) (5మార్కులు) మొత్తం 20 మార్కులు నాలుగు ఎఫ్‌్‌ఏల సగటు 20మార్కులు, ఎస్‌ఏ 80తో కలిపి వంద మార్కులకు గణిస్తారు.వచ్చిన మార్కులను బట్టి 30లోపు ఇగ్రేడ్, 30-39 డిగ్రేడ్, 40-59 సిగ్రేడ్, 60-69 బిగ్రేడ్, 70-79బిప్లస్ గ్రేడ్, 80-89 ఏగ్రేడ్, 90-100ఏప్లస్ గ్రేడ్ ఇలా రిజల్ట్ ఇవ్వబడుతుంది.ఈ పరీక్షా విధానం ద్వారా విద్యార్థి ఏ రకమైన గ్రెేడులో ఉన్నాడు, ఎందులో వెనుకబడ్డాడు? ఏ గ్రేడులోకి తీసుకొచ్చేందుకు ఎలా బోధించాలి? అని ఉపాధ్యాయులకు తెలుస్తుంది. సిసిఇ పరీక్షా విధానం అటు ఉపాధ్యాయుని బోధనానుభవం, ఇటు విద్యార్థి అభ్యసన అనుభవం పరస్పరం నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. బోధించే ఉపాధ్యాయులతో విద్యార్థి నిరంతర సజీవ సంబంధాన్ని ఈ పరీక్షా విధానం పెంపొందిస్తుంది. పైగా సిసిఇ విధానం విద్యార్థిని ఒత్తిడికి గురిచేయని సరళతరమైనది కూడా. దీన్ని అర్థం చేసుకోవడంలో వైఫల్యం చెందిన విద్యాశాఖ (20)ఎఫ్‌ఏల మార్కుల అనుసంధానం వదిలించుకోవడానికి మళ్లీ పది పబ్లిక్ పరీక్షలో నూరు మార్కుల విధానం ప్రవేశపెట్టే విధంగా ముందుకు సాగుతున్నది. ఎస్సెస్సీ బోర్డు నిజంగా విద్యార్థి పాఠశాల నుండి సేకరించిన పరీక్షా రికార్డులు ప్రకారం సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుంది. పబ్లిక్ పరీక్షల హడావిడి, మాల్ ప్రాక్టీసు, పేపర్ల స్పాట్ వాల్యుయేషన్, సప్లిమెంటరీ పరీక్షలు ఇలా ఖర్చుతో, సంక్లిష్టతతో కూడినవన్నీ వదిలించుకుని సిసిఇ ద్వారా సుల భతరం చేసుకోవచ్చు?
కానీ, కార్పొరేట్ సంస్థల ఒత్తిడో లేదంటే ఇతర ప్రయోజనాలేం దాగున్నాయో తెలియదు కానీ, ప్రయివేటు విద్యాసంస్థల మార్కుల అశాస్త్రీయ పాతపాటనే విద్యాశాఖ అందుకుంటున్నది.6-9 తరగతులకు విద్యాహక్కు చట్టం ప్రకారం (సిసిఇ) విధానం ద్వారాబోధన చేసి పరీక్షలు నిర్వహించే విద్యాశాఖ కేవలం పదవ తరగతిలో పబ్లిక్ పరీక్షల్లో మళ్లీ పాత మార్కుల విధానం కొనసాగించే ప్రయత్నాలు ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి? పదిలో నిర్మాణాత్మక మూల్యాంకనం (20) మార్కులు మాదిరిగా ఇంటర్లో ప్రాక్టికల్ మార్కులు, డిగ్రీలో ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులు కలపడం లేదా? ఎందుకు పదిలో తమ సబ్జెక్టు ఉపాధ్యా యులు ఎన్నో కోణాలు విద్యార్థిని పరిశీలించి ఇచ్చిన(20) మార్కులు కలపడానికి ఇన్ని అడ్డంకులు కల్పిస్తున్నారు.చట్టబద్దమైన శాస్త్రీయ వినూత్న ”నిరంతర సమగ్ర మూల్యాంకనం” మూలాలను తప్పుపడుతున్నారు? ఒక విద్యార్థి సమగ్ర అభివృద్ధి సంకేతమైన సిసిఇ నిరాకరణ ఫలితాలు భవిష్యత్తు తరాలకు దారుణంగా ఉంటాయి. కనుక పది పరీక్షలు గత పదేండ్లుగా ఏవిధానం ఉందో అదేవిధంగా నిర్వహించాలి. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ పంతానికి, పట్టింపులకు పోకుండా భారత పార్లమెంటు చట్టం ప్రకారం సంక్రమించిన నిరంతర సమగ్ర మూల్యాంకన విధానమే పదిలో అనుసరించడం శ్రేయస్కరం.
ఎన్.తిర్మల్
9441864514