Thursday, November 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'శ్రమశక్తి నీతి' ఎవరి ప్రయోజనాల కోసం?

‘శ్రమశక్తి నీతి’ ఎవరి ప్రయోజనాల కోసం?

- Advertisement -

కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
హామీలు అమలు చేయకుండా ప్రజాపాలన సంబురాలా..?
మెదక్‌లో డిసెంబర్‌ 7-9 తేదీల్లో సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలు : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి/మెదక్‌ టౌన్‌
కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం మెదక్‌ పట్టణంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్‌లో తొలిసారిగా సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు డిసెంబర్‌ 7వ తేదీ నుంచి 9వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాసభలకు 33 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని, మహాసభలకు ముఖ్య అతిథులుగా సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత, జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ తపన్‌ సేన్‌, జాతీయ కోశాధికారి యం.సాయిబాబు హాజరు అవుతారని తెలిపారు. డిసెంబర్‌ 7న జరిగే కార్మిక ప్రదర్శన, బహిరంగ సభకు ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు, సీఐటీయూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు హాజరవుతున్నట్టు చెప్పారు.

మహాసభల నిర్వహణ కోసం ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్త్తూ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందని ఆరో పించారు. పని గంటలు పెంచి ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులతో వెట్టి చేయిస్తున్నదని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతూ కార్మికులను కట్టుబానిసలుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని అన్నారు. ‘శ్రమశక్తి నీతి 2025’ పేరుతో ప్రజాస్వామ్య విలువలకు తిలోదాకాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ సమావేశ పర్చకుండా కొత్త పాలసీలు తీసుకువచ్చే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఆహ్వాన సంఘం వైస్‌ చైర్మెన్‌ జె.మల్లికార్జున్‌, ఎం. అడివయ్య, ప్రధాన కార్యదర్శి ఏ.మల్లేశం, కోశాధికారి బి.బాలమణి, కార్యదర్శి పి.బాగారెడ్డి, బండ్ల స్వామి పాల్గొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదు
అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్‌ పార్టీ కార్మికులకిచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేయకుండా మోసం చేస్తోందని చుక్క రాములు అన్నారు. ఆశా వర్కర్స్‌ ఫిక్స్డ్‌ వేతనం రూ.18వేలు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ స్కీమ్‌ పేరుతో అంగన్వాడీ వ్యవస్థకు ముప్పు తీసుకువస్తున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కార్మికులకిచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రికి డిసెంబర్‌ 1-9 వరకు ప్రజాపాలన సంబరాలు జరిపే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -