మున్సిపాలిటీ ఎన్నికలలో ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్కు లేదు
మధిర మున్సిపాలిటీలో 3 స్థానాలలో సీపీఐ(ఎం) పోటీ
నవతెలంగాణ – బోనకల్
మోసపు వాగ్దానాలతో మాయమాటలతో ఆరు గ్యారెంటీ పథకాలు పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సీపీఐ(ఎం) మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు విమర్శించారు. ఆరు గ్యారెంటీ బతకాలని అమలు చేయకుండా మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రజలను ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని మడ్డిపల్లి గోపాలరావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల కేంద్రంలో గల వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో సీపీఐ(ఎం) మండల కమిటీ శాఖ కార్యదర్శిల సమావేశం మంగళవారం జొన్నలగడ్డ సునీత అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో గోపాలరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మికుల పొట్ట కొడుతుందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్ ల వలన కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతోన్మాదం పేరుతో పెట్టుబడిదారీ వర్గాలకు కొమ్ముకాస్తూ పేద ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తుందని విమర్శించారు. బిజెపి అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) నిరంతరం పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 12వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె లో అన్ని కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయని ఈ సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ సమ్మెకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 6 గ్యారంటీ పథకాలను అమలు చేయడం లేదని విమర్శించారు. మరలా ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ వస్తుందని మున్సిపాలిటీ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం) రాజీలేని పోరాటాల నిర్వహిస్తుందని తెలిపారు. మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికార దాహంతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజలను మోసం చేయటమే కాంగ్రెస్ లక్ష్యం అని విమర్శించారు.
మధిర మున్సిపాలిటీ ఓటర్లు ఆలోచించి కాంగ్రెస్ మోసాలకు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని కోరారు. మధిర మున్సిపాలిటీలో సీపీఐ(ఎం), బిఆర్ఎస్ పొత్తుతో మూడు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. ఈ మూడు స్థానాలలో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. సీపీఐ(ఎం) అభ్యర్థుల గెలుపుతోనే మధిర మున్సిపాలిటీలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. మధిర మున్సిపాలిటీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసంఘటితరంగా కార్మికుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నది సీపీఐ(ఎం) మాత్రమే అన్నారు.
ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని మధిర మున్సిపాలిటీ ఓటర్లను ఆయన కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు మండల కార్యదర్శి కిలారు సురేష్ నాయకులు పెద్దపోలు రామారావు, గుడ్డూరి వెంకట నరసయ్య, ఉప్పర శ్రీను, పసుపులేటి నరేష్, బంధం శ్రీనివాసరావు, నల్లమోతు వాణి, తెల్లాకుల శ్రీనివాసరావు, తాత వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.



