Tuesday, March 31, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపెన్షనర్లంటే ప్రభుత్వానికి చిన్నచూపెందుకు?

పెన్షనర్లంటే ప్రభుత్వానికి చిన్నచూపెందుకు?

- Advertisement -

ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు జీతం రాళ్ల కోసం నెల రోజులు కష్టపడి నెల మొదటి తేదీ కోసం ఆశగా ఎదురుచూసే అభాగ్య జీవులు. మూడు దశాబ్దాలకు పైగా తమ శక్తియుక్తులను ధారపోసి కుటుంబాలను త్యాగం చేసిన సేవామూర్తులు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కేవలం ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ ఆ పథకాలకు ప్రాచుర్యం కల్పిస్తూ ఆత్మసంతృప్తి పొందుతారు. చిన్న పొరపాటు జరిగినా అటు ప్రభుత్వ అధికారుల చేత, ఇటు ప్రజల చేత విమర్శలకు గురవుతారు. అయినప్పటికీ తమ శక్తివంచన లేకుండా పనిచేస్తూనే ఉంటారు. ఇక ఉద్యోగ పర్వంలో విధి నిర్వహణ ఎంత ముఖ్యమో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పదవీ విరమణ కూడా అంతే ముఖ్యం. ఉద్యోగాన్ని ఒక ఉద్యమం లాగా నిర్వహించిన వీరు విరమణ చెందిన తరువాత ఏ రకమైన ఆదరణకు నోచుకోకపోగా విమర్శలకు విషప్రచారానికి గురికావడం బాధాకరం. తోటి ఉద్యోగులు పట్టించుకోరు. సహచరులు సహకరించరు. సమాజం కూడా వారి పట్ల సానుభూతిగా ప్రవర్తించదు. చివరకు ప్రభుత్వం కూడా వారిని చిన్న చూపు చూడడం వారి మనసులను కలచి వేస్తున్నది.

విరమణ చెందిన మరు రోజు నుండి వారు కార్యాలయాలకు తిరుగుతుంటే వారి పింఛన్‌కు సంబంధించిన కాగితాలపై అధికారులకు అక్కడ నుండి ఏజీ ఆఫీస్‌కు చేరడానికి చాలా సమయం తీసుకోవడంతో విరమణ చెందిన వారు విసిగిపోతారు. పింఛన్‌ కాగితాలు వచ్చినా ప్రభుత్వ దయాదక్షిణ్యాలకై ఎదురుచూసి వాళ్ల కళ్లు కాయలు కాసి పండిపోయి రాలిపోతున్న పరిస్థితి నేడు రాష్ట్రంలో ఆవిష్కృతమయింది. సామాజిక జీవితం నుండి విరమణ చెందిన వ్యక్తులు వ్యక్తిగత జీవితంలోనికి ప్రవేశిస్తారు. వారు తమకు రావలసిన బకాయిల గూర్చి సంవత్సరాలపాటు ఎదురు చూడవలసి రావడం దారుణం. ముఖ్యంగా వారు సర్వీస్‌లో ఉండగా అనారోగ్యంపై చేసిన ఖర్చులు కూడా విడుదల చేయడానికి ప్రభుత్వానికి చేయి రావడం లేదు. తాము మూడు దశాబ్దాలు దాచుకున్న జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ డబ్బు కూడా ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదు. గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ డబ్బుకు కూడా అతిగతి లేదు. ఇది కూడా ప్రభుత్వ ఉద్యోగులు దాచు కున్న సొమ్ము మాత్రమే రిటైర్‌ అయిన ఉద్యోగులకు ఇవ్వవలసిన గ్రాట్యూటీ కమ్యూటేషన్‌ డబ్బు విడుదలకు ప్రభుత్వం రెండేళ్లకు పైగా నిరీక్షణలో ఉంచింది.

తన వ్యక్తిగత అవసరాలు ముఖ్యంగా ఇంటి నిర్మాణం లేక కూతురు పెళ్లి అవసరానికి వస్తాయనకున్న డబ్బులు రాక పోవడంతో హతాశులైన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విధంగా దాదాపుగా ఎనభైమంది రాష్ట్రంలో బలవన్మరణాలకు పాల్పడడం బాధాకరం.తమ జీవితాలను అర్ధాంతరంగా చాలించడంతో వారి కుటుంబ సభ్యుల జీవితాలు రోడ్డున పడ్డాయి. సర్వీస్‌ పెన్షన్‌ తీసుకోవలసిన వారు ఫ్యామిలీ పెన్షన్‌ తీసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి దాపురించడం శోచనీయం. ఇక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెన్షనర్లపై తన వ్యతిరేక ప్రచారాన్ని విషప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంది. పదవి విరమణ చెందిన ప్రతి ఉద్యోగికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కోటి రూపాయలు ఇవ్వవలసి వస్తున్నదని సభల్లోనూ, సమావేశాల్లోనూ పదేపదే చెప్పడం వింతగా ఉంది. ఉద్యోగులు తాము దాచుకున్న డబ్బును కూడా రాష్ట్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలతో ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నది. ప్రభుత్వం ఇచ్చేది కేవలం గ్రాట్యూటీ మాత్రమే. ఇది గరిష్టంగా రూ.పదహారు లక్షల ఉంటుంది. ఇచ్చే కమ్యూటేషన్‌ సొమ్మును మరుసటి నెల నుండి 135 వాయిదాలలో వడ్డీతో సహా ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఏ పెద్ద అధికారికి కూడా కోటి రూపాయల బకాయిలు ఇవ్వవలసిన పరిస్థితి ఉత్పన్నం కాదు. అయినా ఈ విధమైన దుష్ప్రచారం చేయడం పెన్షనర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటమే. ప్రజలలో వారిని పలుచన చేయడమే. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు భవిష్యత్తులో వసూలు చేసుకునే కమ్యూటేషన్‌ డబ్బును కూడా ప్రభుత్వం ఉదారంగా ఇస్తున్నట్లు చెప్పుకోవడం దారుణం. 30 ఏళ్ల సర్వీసుకు కేవలం కృతజ్ఞతగా ఇచ్చే గ్రాట్యూటీని మాత్రమే కోటి రూపాయలకు సమానంగా చెప్పుకోవడం ఆశ్చర్యకరం. ప్రభుత్వానికి మొదటి నుండి ఉద్యోగ వ్యతిరేక భావన ప్రబలంగా ఉంది. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వాలు మనగలవా? దేశంలోనే అత్యధికంగా ఐదు డిఏలు బాకీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగులకు ప్రకటించే పీఆర్సీని అమలుపరిచే ధైర్యం లేదు. తయారైన నివేదిక స్వీకరించే మనసు కూడా లేదు. రాజకీయ నాయకులు ఒకసారి చట్టసభలకు ఎన్నికఅయితే వారికి జీవితాంతం పెన్షన్‌ వచ్చే సౌకర్యం కల్పించుకున్నారు.

కొంతమందికి రెండు పెన్షన్ల సౌకర్యం కూడా ఉంది. కానీ మూడు దశాబ్దాలు సర్వీస్‌ చేసి పదవి విరమణ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇంత ఉదాసీనంగా నిర్దయగా ప్రవర్తించడం దారుణం. సకాలానికి రావలసిన డిఏల,పీఆర్సీలు ఇవ్వకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు జరిగే ఆర్థిక నష్టాన్ని ఏ విధంగా పూడ్చుతారు? అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఉద్యోగుల హక్కుగా ఇవ్వాల్సిన సొమ్మును ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి ఇష్టం లేదు. ప్రతి నెలా 500 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ వాస్తవంగా అందులో సింహభాగం అంటే 350 కోట్లు రూపాయలు పైగా కాంట్రాక్టర్లకే చెల్లిస్తున్నది. అంటే కేవలం 150 కోట్లు మాత్రమే ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లిస్తున్నది. కానీ, ప్రభుత్వం ప్రచారం మాత్రం భిన్నంగా ఉంది. అంతేకాదు కొంతమంది పెన్షనర్లు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి చెల్లింపు ఉత్తర్వులు పొందిన వారికి ప్రయోజనం శూన్యం.

మూడు నెలలలో చెల్లించవలసిన బకాయిలు మూడేళ్లవుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదు. మరోపక్క సెక్రటేరియట్‌లో మాత్రం పదిహేను శాతం కమీషన్‌ నడుస్తూనే ఉన్నది! దాచుకున్న సొమ్ముకు దిక్కులేదు. బకాయిల ఊసే లేదు. పదివేల కోట్లు బకాయిలు ఉండగా నెలకు 500 కోట్లు విడుదల చేసి అందులో 150 కోట్లు మాత్రమే పెన్షనర్లకు చెల్లిస్తే రెండేళ్లుగా విరమణ చెందిన ఉద్యోగులకు బకాయిల చెల్లింపు ఎప్పుడు పూర్తవుతాయి? మరి ప్రతినెల దాదాపు 800 మంది ఉద్యోగులు రిటైర్‌ అవుతున్నారు. వారి బకాయిల మాటేమిటి? ఉద్యోగులకైనా పెన్షనర్లకైనా ఉచిత ఆరోగ్య పథకం అమలుకు ఎప్పుడు నోచుకుంటుంది? ఊకదంపుడు ఉపన్యాసాలు, ప్రచార ప్రకటనలే అమలులో మాత్రం రిక్తహస్తాలే.

ఒకేసారి పదివేల కోట్లు విడుదల చేస్తే పెన్షనర్ల బకాయిలన్నీ ఒకేసారి చెల్లించవచ్చు. కానీ, ఉద్యోగులకు ప్రజలకు మధ్య వైరం అగాధం సృష్టించే కుటిల ప్రయత్నాలు సమంజసం కాదు. ప్రజలు విజ్ఞులు కాబట్టి ముఖ్యమంత్రి ప్రకటనను వారు పట్టించుకోలేదు. సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకపోగా ఉద్యోగులు, పెన్షనర్లపై ప్రజలకు ఒక వ్యతిరేక ప్రచారాన్ని చేయడం ప్రభుత్వానికి తగదు. ఆర్థిక క్రమశిక్షణ, నియంత్రణ లేని ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని రద్దు చేయాలని అడగడం కూడా బాధ్యతారాహిత్యాన్ని తెలుపుతుంది. బహిరంగ సమావేశాల్లో అసెంబ్లీలోను అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానము లేక ఎదురుదాడికి దిగుతున్నది. ప్రభుత్వం విచక్షణ విజ్ఞత లేకుండా వివక్షతో ప్రవర్తిస్తున్నదని నేడు నిరూపితమవుతున్న నిజం.

శ్రీశ్రీ కుమార్‌
9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -