Tuesday, July 15, 2025
E-PAPER
Homeకరీంనగర్సీఎంకు అండగా ఉంటాం: బండి సంజయ్

సీఎంకు అండగా ఉంటాం: బండి సంజయ్

- Advertisement -

– అతి త్వరలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమిస్తాం
– రాజకీయాలకు అతీతంగా బనకచర్ల విషయలో సీఎంకు అండగా ఉంటామని వెల్లడి
– కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్


నవతెలంగాణ -రాజన్న సిరిసిల్ల

బీసీల రిజర్వేషన్ల అమలుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు పేరుతో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం దుర్మార్గమన్నారు. ముస్లింలను బీసీ రిజర్వేషన్ల జాబితా నుండి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

తక్షణమే బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించి 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే దక్కేలా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 51 శాతమున్న బీసీలకు 32 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం 12 శాతమున్న ముస్లింలకు మాత్రం వందకు వంద శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధమవడం దుర్మార్గమన్నారు. బనకచర్ల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వాదనను బలంగా విన్పించాలని కోరారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ఏమన్నారంటే…
బనకచర్ల ప్రాజెక్టు అంశంపై కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా విన్పించాలని కోరుతున్నానన్నారు.మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దం. అయినా ఆర్డినెన్స్ తీసుకువస్తామని చెప్పడం దుర్మార్గం అని అన్నారు.

బీసీ సంఘాల నాయకులారా… మీ దురాలోచనను, మీ రాజకీయాలను పక్కనపెట్టి బీసీలకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలని కోరుతున్నా. గుండెపై చేయి వేసుకుని వాస్తవాలు మాట్లాడాలని కోరుతున్నా. కాంగ్రెస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముస్లింలను బీసీ జాబితా నుండి తొలగించి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి, ఎర్రం మహేష్, బిజెపి జిల్లా మహిళా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -