ఎకరాకు రూ.25వేలు నష్టపరిహారం చెల్లించాలి
యాసంగికి పోచారం నీరు అందించాలి
ముంపునకు గురైనా మంత్రుల జాడలేదు : మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్/గాంధారి
‘ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు నాగిరెడ్డిపేట్ మండలంలో రైతులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటికీ ఎలాంటి సాయం అందించలేదు. నెల రోజులు గడిచినా వరద బాధితులను ఆదుకోని నువ్వేం ముఖ్యమంత్రివయ్యా.’ అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని బంజారా ప్రాంతంలో ముంపునకు గురైన పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ”మమ్మల్ని ఆదుకోండి సారూ.. అన్నీ కోల్పోయాం” అని గిరిజన మహిళలు హరీశ్‌రావును వేడుకున్నారు. భారీ వర్షాల కారణంగా పంటలను మునిగిపోయాయి. రైతు బంధు పడలేదు. నెలకు రూ.2500 ఇస్తానన్న ఇవ్వడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
నాగిరెడ్డిపేట్ మండల వ్యాప్తంగా ముంపునకు గురైన పంటల వివరాలను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నెల 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా పర్యటన చేసి వరద బాధితులను ఆదుకుంటామని చెప్పి నెల గడిచినా ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదని అన్నారు. జిల్లాలో రూ.344 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని జిల్లా అధికారులు రిపోర్టు పంపారని, అలాగే ప్రాణ నష్టం జరిగినా ఇప్పటికీ ఎలాంటి సహాయం చేయలేదని అన్నారు. రోడ్లు, చెరువులు తెగిపోయాయని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, చెరువులకు, కాలువలకు గండ్లు పడ్డాయని అయినా పునరుద్ధరణ చేపట్టలేదన్నారు. ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి వరకు బస్సులు నడవడం లేదన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క పర్యవేక్షించింది లేదని విమర్శించారు.
ఇప్పటికీ కూలిపోయిన ఇండ్ల బాధితులకు రూపాయి కూడా అందించలేదని, ఎకరాకు తక్షణ ఆర్థిక సహాయం రూ.10వేలు అందిస్తామని చెప్పి పైసా సాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా ఇవ్వలేక, బోనస్ ఇవ్వలేక రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో వరద ముంచేసినా ప్రభుత్వం నుంచి సహాయం శూన్యంగా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలెక్కువ చేతలు తక్కువ అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, జనార్ధన్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ ప్రతాపరెడ్డి, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, మాజీ జెడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, కామారెడ్డి బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్, మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు కృష్ణ, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ చైర్మెన్ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నార్త్ ఇండియా వైపే బీజేపీ..
అనంతరం కామారెడ్డి జిల్లా గాంధారిలో నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి నాయకులు, కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారుడు తానాజీరావు బీజేపీకి వెళ్లి తిరిగి బీఆర్‌ఎస్ పార్టీలో చేరినందుకు వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నానని అన్నారు. బీజేపీ పేద ప్రజలు, రైతులు, దళితుల పక్షాన ఉండదని, కేవలం నార్త్ ఇండియా వైపే ఉంటుందని అన్నారు. తెలంగాణ దేశంలో లేదా? ఎందుకు తెలంగాణకు నిధులు ఇవ్వరని ప్రశ్నించారు.
వరద బాధితులను ఆదుకోని ముఖ్యమంత్రి ఎందుకు..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES