Thursday, December 25, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'రైజింగ్‌'లో వస్త్ర పరిశ్రమ ఊసేది?

‘రైజింగ్‌’లో వస్త్ర పరిశ్రమ ఊసేది?

- Advertisement -

2047 నాటికి తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉండాలన్నదే కాంగ్రెస్‌ సర్కారు లక్ష్యం. హైదరాబాద్‌లో 7, 8 తేదీల్లో గ్లోబల్‌ సమ్మిట్‌లో 5.75 లక్షల పెట్టుబడులు సాధించడం హర్షించదగ్గదే. 2034 నాటికి తెలంగాణలో ఒక ట్రిలియన్‌ డాలర్లు, 2047 వరకు మూడు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా కార్యచరణ చేపట్టనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇందులో వ్యవసాయం తర్వాత అతిముఖ్యమైన వస్త్ర పరిశ్రమకు ఊసే లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అట్టడుగులో ఉంది. ప్రధానంగా తమిళనాడు, గుజరాత్‌తో పోలిస్తే.. తెలంగాణ లోని టెక్స్‌ట్కెల్‌ పది శాతం కూడా లేదు. ముందు ఈ రాష్ట్రాలతో పోటీ పడ్డాకే ఇతర చైనా, జపాన్‌ లాంటి దేశాలతో పోటీ పడాల్సి ఉంటుంది. రాష్ట్రంలో చేనేత రంగంలో 59,325 మంది, పవర్‌ లూమ్‌లో 43, 469 మంది కార్మికులున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కాటన్‌, సిల్క్‌, పాలిస్టర్‌ వస్త్రోత్పత్తులు కొనసాగుతున్నాయి.

తెలంగాణలోని బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న వస్త్రాలు ఇక్కడ ఉత్పత్తి కాక పోవడం వల్ల గుజరాత్‌, మహారాష్ట్ర లాంటి ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి దిగుమతి అవుతున్నాయి. సూరత్‌తో తెలంగాణ పోటీ పడేలా ఇక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తెలంగాణలో చేనేత, పవర్‌లూమ్‌ పరిశ్రమల ద్వారా ఉత్పత్తి అవుతున్న ఎనభై శాతం వస్త్రాలను టెస్కో కొనుగోలు చేసి ప్రభుత్వరంగ సంస్థలకు సరఫరా చేస్తోంది. హాస్టల్‌ పిల్లలకు బెడ్‌షీట్స్‌, టవల్స్‌, స్కూల్‌ యూనిఫాం, ఇందిరా మహిళాశక్తి చీరలు, ఆరోగ్యశాఖకు ఈ వస్త్రాలను అందజేస్తుంది. అయితే, సూరత్‌ మార్కెట్‌లోనే ఏడు లక్షలకు పైగా యంత్రాలపై 25 మిలియన్‌ మీటర్ల వస్త్రాలను ఉత్పత్తి చేసి సుమారు వంద బిలియన్‌ టర్నవర్‌ జరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ మార్కెట్‌లోకి తొంభై శాతం వరకు దిగుమతి అవుతున్నట్లు వస్త్ర రంగ నిఫుణులు చెబుతున్నారు.

ప్రధానంగా చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్‌ అక్కడి నుండి దిగుమతి అవుతున్నవే. తెలంగాణలో అధునాతన పవర్‌లూమ్‌లను ఏర్పాటు చేయకపోవడం, ఇక్కడి వ్యాపారులు కేవలం ప్రభుత్వ రంగంపైనే ఆధారపడడం వల్ల మార్కెట్‌పోటీని ఇక్కడి వస్త్ర పరిశ్రమ తట్టుకోలేకపోతుంది. ప్రధానంగా సిరిసిల్లలో ఉన్న నాసిరకం పవర్‌ లూమ్‌లను స్కాప్‌ కింద తొలగించి..వాటి స్థానంలో సెమి పవర్‌ లూమ్‌ ఎలక్ట్రానిక్‌ ఆటో జకాడ్‌లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. రెండు వేల యూనిట్లను ఏర్పాటు చేస్తే పద్నాలుగు వేల అధునాతన పవర్‌ లూమ్‌లకు సుమారు రూ.160 కోట్ల వ్యయం అవుతుందని ఇక్కడి పారిశ్రామికుల అంచనా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎనభై శాతం రాయితీ కల్పిస్తే వీటిని ఏర్పాటు చేసుకుని, సిల్క్‌ చీరల ఉత్పత్తిని సాగించేందుకు ఇక్కడి యువ పారిశ్రామికులు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. డిమాండ్‌ ఉన్న సిల్క్‌ పట్టుచీరలను ఉత్పత్తి చేసి ఇక్కడి మార్కెట్‌లో విక్రయించడం ఆర్థికంగా ఎదగడమే కాకుండా ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉంవచ్చననే అభిప్రాయం ఉంది.

దీని ద్వారా సుమారు నాలుగు వేల కార్మికులకు చేతి నిండా పని దొరికే అవకాశాలున్నాయి.2003లో సిరిసిల్ల టెక్స్‌ట్కెల్‌ పార్కును ఏర్పాటు చేసి 115 యూనిట్లకు ప్లాట్లు కేటాయించగా..ఇందులో ప్రస్తుతం 56 యూనిట్లు మాత్రమే ఉత్పత్తిని కొనసాగిస్తున్నాయి. ఇవి కూడా సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే వస్త్రోత్పత్తిని కొనసాగించి, మిగతా కాలంలో మూసివేస్తారు. ర్యాపియర్‌ పవర్‌లూమ్‌లను ఏర్పాటు చేసినా..మార్కెటింగ్‌ చేసుకునే వెసులుబాటు లేకపోవడం వల్ల ఇక్కడి పారిశ్రామికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ప్రాసెసింగ్‌, డ్కెయింగ్‌ యూనిట్లు లేక పోవడం వల్ల హైదరాబాద్‌, సూరత్‌ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. సిరిసిల్లలో ప్రాసెసింగ్‌, డ్కెయింగ్‌, ప్రింటింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రస్తుత రేవంత్‌ సర్కారు చొరవ చూపాలనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.

ప్రపంచ స్థాయిలో సాంకేతిక పోటీని తట్టుకునేలా టెక్స్‌ట్కెల్‌ రంగంలో యువతకు శిక్షణ అవసరం. తెలంగాణ ప్రభుత్వం ఐఐహెచ్‌టి ఏర్పాటు చేసినప్పటికీ..పాలిటెక్నిక్‌ డిప్లోమా, బిటెక్‌ టెక్స్‌టైల్‌ సెలబస్‌లో భారీ మార్పులు రావాలి. ఈ కోర్సులు పూర్తయిన వెంటనే ఉద్యోగ, ఉపాధి పొందేలా సర్కారు కార్యచరణ చేపట్టాలి. ఇందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరం. అది లేకపోవడం వల్ల నిరుద్యోగం పెరగడంతో పాటు వస్త్ర పరిశ్రమ మనుగడ సాధించలేకపోతోంది. తెలంగాణలో చేనేత, పవర్‌ లూమ్‌ వీవర్‌ సర్వీస్‌ సెంటర్లు మూలకుపడటం వల్ల డిమాండ్‌ ఉన్న అధునాతన వస్త్రోత్పత్తులు సాగక పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూత పడుతూ వస్త్ర పరిశ్రమ తిరోగమనంలో పయనిస్తోంది. రైజింగ్‌-2047 ప్రణాళికలో టెక్స్‌టైల్‌ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందులో చిన్న, మధ్య తరహా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా కార్యచరణ చేపట్టాలి.

చిలగాని జనార్థన్‌ 8121938106

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -