Thursday, January 15, 2026
E-PAPER
Homeజాతీయంఎందుకీ గోప్యత?

ఎందుకీ గోప్యత?

- Advertisement -

– మూడేండ్లుగా పార్లమెంట్‌ ముందుకురాని లోక్‌పాల్‌ నివేదికలు
– లేఖలు రాసినా దొరకని రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌
– విసిగి వేసారి పోస్టులో నివేదికలను పంపిన లోక్‌పాల్‌
న్యూఢిల్లీ :
గత మూడు సంవత్సరాలుగా లోక్‌పాల్‌ వార్షిక నివేదికలు పార్లమెంట్‌ ముందుకు రావడం లేదు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది పచ్చి నిజం. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోసం లోక్‌పాల్‌ ఎన్ని అభ్యర్థనలు పంపినప్పటికీ ఫలితం కన్పించడం లేదు. దీంతో చేసేదేమీ లేక వార్షిక నివేదికలను లోక్‌పాల్‌ పోస్టులో పంపారు. అవి అందినట్లు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు ముందే రాష్ట్రపతి నుంచి సమాచారం అందింది. అయితే వాటిని నేటి వరకూ చట్టసభ ముందు ఉంచలేదు. 2022-23 సంవత్సరానికి సంబంధించి లోక్‌పాల్‌ వార్షిక నివేదికను రూపొందించనేలేదని గత సంవత్సరం నవంబర్‌ 18వ తేదీన ‘ది వైర్‌’ పోర్టల్‌ తెలిపింది. నివేదికను రూపొందించారని చెప్పడానికి ఫైలు కానీ, డేటా కానీ, నోట్‌ కానీ లభించలేదని చెప్పింది.

పోస్టులో నివేదికలు
అయితే లోక్‌పాల్‌కు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు. రాష్ట్రపతితో భేటీ కోసం లోక్‌పాల్‌ అధికారులు కనీసం నాలుగు లేఖలు రాశారు. రాష్ట్రపతి కార్యాలయానికి ఫోన్‌ కాల్స్‌ కూడా చేశారు. అయినా అపాయింట్‌మెంట్‌ లభించలేదు. రాష్ట్రపతి బిజీ షెడ్యూల్‌ కారణంగా అపాయింట్‌మెంట్‌ లభించలేదని అంతర్గత నోట్‌ తెలిపింది.
ఇదిలావుండగా 2024-25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను లోక్‌పాల్‌ పూర్తి చేసి ముద్రించింది. గత సంవత్సరం రాష్ట్రపతి కార్యాలయానికి మరిన్ని రిమైండర్లు పంపారు. ఆగస్ట్‌ 25వ తేదీన పంపిన చివరి రిమైండరుకు కూడా జవాబు రాలేదు. నెల రోజుల తర్వాత లోక్‌పాల్‌ ఫుల్‌ బెంచ్‌ అసహనంతో కూడిన చర్య తీసుకుంది. మూడు వార్షిక నివేదికలను రాష్ట్రపతికి పోస్టు ద్వారా పంపాలని నిర్ణయించింది. వాటికి కవరింగ్‌ లెటరును జత చేసింది. చట్టబద్ధమైన తన విధిని పూర్తి చేయడంలో మూడు సంవత్సరాల జాప్యం జరిగిందని వివరణ ఇస్తూ నవంబర్‌ 18న రాష్ట్రపతికి లేఖ పంపారు. 2021-22 నుంచి పార్లమెంటుకు వార్షిక నివేదికలేవీ సమర్పించ లేదని గుర్తు చేశారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి కొన్ని వారాల ముందే ఈ నివేదికలు రాష్ట్రపతికి చేరాయి.

చట్టాలు ఏం చెబుతున్నాయి?
వాస్తవానికి లోక్‌పాల్‌ ప్రతి సంవత్సరం రాష్ట్రపతికి వార్షిక నివేదికను అందించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ద్వారా అది పార్లమెంటుకు చేరుతుంది. వార్షిక నివేదికను అందజేయడంలో గత లోక్‌పాల్‌ విఫలమైన నేపథ్యంలో ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన ఖన్విల్కర్‌ జరిగిన పొరబా టును సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఆరు నెలల వ్యవధిలోనే ఆయన 2022-23, 2023-24 సంవత్సరాలకు… అంటే రెండు ఆర్థిక సంవత్స రాలకు సంబంధించి ఏకీకృత వార్షిక నివేదికను ఖరారు చేశారు. 2024 అక్టోబర్‌ నాటికి ఆ నివేదికను సమర్పించేందుకు లోక్‌పాల్‌ సిద్ధమయ్యారు. అందుకోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్‌మెంట్‌ కోరారు. లోక్‌పాల్‌, లోకాయుక్త చట్టాల ప్రకారం ప్రతి సంవత్సరం రాష్ట్రపతికి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత లోక్‌పాల్‌ది. అది అందిన తర్వాత రాష్ట్రపతి దాని ప్రతిని, ఒకవేళ లోక్‌పాల్‌ సలహాలను ఆమోదించలేకపోతే దానికి కారణాన్ని తెలియజేస్తూ ఓ మెమొరాండాన్ని పార్లమెంట్‌ ఉభయ సభలకు తెలియజేయాల్సి ఉంటుంది.

జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికే…
లోక్‌పాల్‌ నుంచి నివేదికలు అందిన విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ధృవీ కరించింది. ప్రధానమంత్రి కార్యాలయం కింద పనిచేసే సిబ్బంది, శిక్షణ విభాగానికి ఆ పత్రాలను పంపింది. గత నెలలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటికీ ఆ నివేదికలను ప్రభుత్వం ఇప్పటికీ చట్టసభల ముందు ఉంచలేదు. జవాబుదారీతనం నుంచి తప్పించు కోవడానికే ప్రభుత్వం లోక్‌పాల్‌ నివేది కలను పార్లమెంట్‌ ముందు ఉంచడం లేదని ట్రాన్స్‌పరెన్సీ రైట్స్‌ కార్యకర్త అంజలి భరద్వాజ్‌ విమర్శించారు. చట్టానికి లోబడి వ్యవహరించడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్లు కన్పిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ ఉదంతంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కన్పిస్తోందని, దానికి రాజకీయ చిత్తశుద్ధి లేదని చెప్పారు. సుమారు రెండు సంవత్సరాల పాటు లోక్‌పాల్‌కు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తోందని తెలిపారు. నివేదికలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి పోస్టులో పంపాల్సి రావడం శోచనీయమని అన్నారు. అవినీతిని అరికట్టే విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని చెప్పారు. గతంలో కూడా లోక్‌పాల్‌ నివేదికలలో జాప్యం జరిగిన సందర్భాలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -