వ్యూహాత్మక నిల్వలు, వైవిధ్య ఇంధన వనరులే కీలకం
బీజింగ్ : పశ్చిమాసియాలో గత నెలరోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం వల్ల అంతర్జాతీయంగా అనేక దేశాలు ఇంధన సంక్షోభంతో తల్లడిల్లుతున్నాయి. కానీ చైనా మాత్రం ఇంతవరకు ఈ యుద్ధం వల్ల ప్రభావితం కాలేదు. ఇందుకు కారణాలు అనేకం వున్నాయి. అందులో మొదటిది చైనా వద్ద వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు (ఎస్‌పిఆర్) వుండడం. గత రెండు దశాబ్దాలుగా చైనా పెద్ద ఎత్తున అత్యవసర చమురు నిల్వలు నిర్మించుకుంటూ వచ్చింది. దిగుమతులు లేకపోయినా ఈ నిల్వలతో దాదాపుగా మూడు నుండి నాలుగు నెలల పాటు ఇబ్బందుల్లేకుండా గడిపేయవచ్చు. అందువల్ల స్వల్పకాలిక ఎదురుదెబ్బలు తగిలినా తక్షణమే భయాందోళనలతో కొనుగోలు చేయకుండా గడిపేయడానికి అవకాశం వుంది. ఇక రెండో కారణం చెక్‌పాయింట్లపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం, గతంలో చైనా, మలక్కా జలసంధిపై ఆధారపడేంది, అందువల్ల దీని గురించి ఆందోళన కూడా ఎక్కువగానే వుండేది. దీన్ని ఎదుర్కొనడానికి గానూ తన సరఫరా మార్గాలను పలు రకాలుగా విస్తృతం చేసుకుంది. హార్మూజ్ జలసంధి వంటి సముద్ర జల రవాణా మార్గాలపై ఆధారపడడాన్ని తగ్గించుకుంది.
ఇక మూడో అంశం భూతల పైప్‌లైన్లు ఏర్పాటు చేసుకోవడం. ఇది గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. రష్యా, కజకస్తాన్, తుర్కెమినిస్తాన్ వంటి సెంట్రల్ ఆసియా దేశాల నుండి పైప్‌లైన్లను ఎక్కువగా నిర్మించుకుంది. తమకు కావాల్సిన ముడి చమురు దిగుమతులకు సంబంధించి దాదాపు 20శాతం ఈ పైప్‌లైన్‌ల ద్వారా సరఫరా అవుతోంది. అందువల్ల నౌకల రవాణాలో అంతరాయాలు వున్నా ఇబ్బంది కలగడం లేదు. ఇక నాల్గవది దిగుమతుల భాగస్వాములను కూడా రకరకాలుగా ఏర్పాటు చేసుకుంది. చాలా దేశాలు పశ్చిమాసియా ముడి చమురుపై ఆధారపడినట్లుగా చైనా దానిపై ఆధారపడలేదు. అందుకు బదులుగా ప్రధానంగా రష్యా, ఆఫ్రికా, సెంట్రల్ ఆసియా దేశాల నుండి చివరగా పశ్చిమాసియా దేశాల నుండి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇక చివరగా సాంప్రదాయ ఇంధన వనరుల నుండి పునర్వినియోగ ఇంధన వనరులకు మళ్ళింది. సౌర విద్యుత్, పవన విద్యుత్, జల విద్యుత్, కొత్తగా ఆవిర్భవిస్తున్న టైడల్ ఎనర్జీ సాంకేతికతలను ఉపయోగించుకుంటోంది. మరోవైపు బొగ్గును కూడా పెద్ద మొత్తంలోనే వినియోగిస్తోంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పెరిగింది. పై కారణాలన్నింటి రీత్యా చైనా ఇంథన రంగం ఎలాంటి ఆకస్మిక కుదుపులకు లోనవకుండా సాఫీగా, సజావుగా సాగుతోంది.



