Wednesday, April 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఔట్‌డోర్‌ ప్రకటనలపై ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు? : హైకోర్టు

ఔట్‌డోర్‌ ప్రకటనలపై ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు? : హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
ఔట్‌డోర్‌ ప్రకటనల విధానంపై గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌కు కోర్టుధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఎందుకు అమలు చేయలేదో వివరించాలని ఆదేశించింది. ఈ విషయంపై తెలంగాణ ఔట్‌డోర్‌ మీడియా ఓనర్స్‌ అసోసియేషన్‌తో పాటు ఇతర సంస్థలు దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్లను జస్టిస్‌ శ్రవణ్‌ కుమార్‌ విచారించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదిస్తూ ఔట్‌డోర్‌ ప్రకటనలకు సంబంధించిన జీవో 84ను సవాలు చేసిన కేసులో వెలువడిన ఆదేశాలు అమలు చేయలేదన్నారు. ప్రయివేటు భవనాలపై, ముఖ్యంగా 15 అడుగులకు మించిన ఎత్తులో ఏర్పాటు చేసే హోర్డింగ్‌లపై విధించిన పరిమితులపై నిపుణుల నివేదికలను పరిగణనలోకి తీసుకుని కొత్త విధానం రూపొందించాలన్న పిటిషనర్ల వినతిపత్రంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలు అమలు కాలేదన్నారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, మున్సిపల్‌ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను ఏప్రిల్‌ తొమ్మిదో తేదీకి వాయిదా వేశారు.
అమీన్‌పూర్‌ విలీనంపై సర్కార్‌కు హైకోర్టు నోటీసులు
అమీన్‌పూర్‌ మున్సిపాల్టీని జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. మున్సిపల్‌ శాఖతో పాటు జీహెచ్‌ఎంసీ, తదితర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. చీఫ్‌ జస్టిస్‌ ఏకేఈ సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ మున్సిపాలిటీల (సవరణ) చట్టం-2026, జీహెచ్‌ఎంసీ (రెండో సవరణ) చట్టం-2026లను సవాల్‌ చేస్తూ అమీన్‌పూర్‌కు చెందిన రైతు ఎం.ఏ. షరీఫ్‌ (98) పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ, మున్సిపాల్టీని రద్దు చేసి జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం చట్ట విరుద్ధమనీ, రాజ్యాంగానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. పిటిషనర్‌కు ఉన్న 38 ఎకరాల వ్యవసాయ భూమిపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243(యు)ను ఉల్లంఘించిందనీ, విలీనానికి ముందు మున్సిపాల్టీకి నోటీసు ఇవ్వకపోవడం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఐదేండ్ల కోసం ఎన్నికైన పాలకమండలిని మధ్యలో రద్దు చేయడం సరిగాదని ప్రస్తావించారు.
కేబీఆర్‌ పార్కు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ నిర్మాణాలపై వివరాలివ్వండి
హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు వద్ద సర్కిల్‌ డెవలప్‌మెంట్‌లో భాగంగా చేపట్టిన మల్టీలెవల్‌ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ నిర్మాణాలపై సమగ్ర వివరాలు అందజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో భాగంగా కేబీఆర్‌ పార్కు సమీపంలోని కూడళ్ల అభివృద్ధికి 2015లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానిని పర్యావరణవేత్త కె.పురుషోత్తమ్‌రెడ్డి ఇతరులు 2016లో సవాల్‌ చేస్తూ పిల్‌లను దాఖలు చేశారు. ఆ వ్యాజ్యాలను ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. కేబీఆర్‌ పార్కు వన్యప్రాణులు, అరుదైన పక్షి జాతులకు నిలయమనీ, అక్కడ ఫ్లైఓవర్‌ నిర్మాణాలు జరిగితే తీరని నష్టం జరుగుతుందని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ చట్ట నిబంధనలకు లోబడే నిర్మాణాలు జరుగుతున్నాయనీ, చెట్లను కొట్టేయడం లేదని వాదించింది. కేంద్రం 2020లో నోటిఫికేషన్‌ ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. వాదనల తర్వాత ధర్మాసనం, ప్రస్తుత నిర్మాణాల స్థితిగతులపై సమగ్ర వివరాలు అందజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. విచారణను మే ఐదో తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -