నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 24న ఢిల్లీలో సీపీఐ(ఎం) నిర్వహించనున్న ‘జన్ ఆక్రోష్’ ర్యాలీకి ముందుగా, ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రచారయాత్రలు కొనసాగుతున్నాయి. బీహార్ లోని ఖగారియా, సహర్సా జిల్లాల్లో ఈ యాత్రలు ముందుకు సాగుతున్నాయి. ఈ యాత్రల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్ ధావలే, రాష్ట్ర కార్యదర్శి లల్లన్‌చౌదరి తదితర నాయకులు ప్రసంగించారు.
ఈ బహిరంగ సభల్లో వందలాది మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, వివిధ ప్రాజెక్టుల ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఖగారియా, సహర్సా ప్రాంతాల్లోని ప్రజలు ఈ యాత్రలకు ఉత్సాహభరితమైన స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, హర్యానా, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కూడా యాత్రలు ముందుకు సాగుతున్నాయి. ‘జన్ ఆక్రోష్’ ర్యాలీని ప్రచారం చేసేందుకు సీపీఐ(ఎం) కార్యకర్తలు కరపత్రాల పంపిణీ, వీధి నాటకాలను నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ఈ యాత్రలు గ్రామీణ, పారిశ్రామిక, గిరిజన ప్రాంతాలపై దృష్టి సారించాయి. మోరెనా, భింద్ జిల్లాల్లో ధరల పతనం కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బంగాళాదుంపల రైతులను సీపీఐ(ఎం) నాయకులు కలుసుకున్నారు.
”భారీ దిగుబడులు వచ్చినా, రైతులకు వ్యవసాయ ఖర్చులకు కూడా డబ్బు అందడం లేదు. బంగాళాదుంపలు కిలో రూ. 2 కే అమ్ముడవుతున్నాయి. మార్కెట్లో మాత్రం కిలో రూ. 30 వరకు ఉంది. సరసమైన ధరకు బంగాళాదుంపలను సేకరించడానికి రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోలేదు” అని రైతులు సీపీఐ(ఎం) నాయకులతో వాపోయారు. మోడీ ప్రభుత్వం అమెరికా-ఇజ్రాయిల్ స్నేహబంధం కారణంగా ఏర్పడిన వంటగ్యాస్ కొరతను కూడా సీపీఐ(ఎం) మార్చ్‌లు ప్రచార అంశంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రారంభించిన అమెరికా స్నేహబంధం మోడీ ప్రభుత్వ హయాంలో మరింత తీవ్రమైందని, ఇది ప్రస్తుత సంక్షోభానికి దారితీసిందని నాయకులు వివరించారు.
విస్తృతంగా సీపీఐ(ఎం) ‘జన్ ఆక్రోష్’ ప్రచార యాత్రలు
- Advertisement -
- Advertisement -



