నవతెలంగాణ-హైదరాబాద్ : బీహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దంపతుల మధ్య చిన్న గొడవ తీవ్ర పరిణామానికి దారితీసింది. భార్య ఆగ్రహంతో భర్త నాలుక కొరికి మింగేసింది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని గయా పరిధిలోని ఖిజ్రాసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే భార్యాభర్తల మధ్య ఎప్పటిలాగే చిన్న గొడవ తలెత్తింది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.
ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన భార్య.. భర్త నాలుకను కొరికి నమిలి మింగేసింది. దాంతో తీవ్ర రక్తస్రావమై భర్త ఆరోగ్య పరిస్థితి సీరియస్ కావడంతో స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చాలా రక్తం పోయినందున ప్రాథమిక చికిత్స చేసి మగధ్ కళాశాలకు సిఫార్సు చేసినట్లు డాక్టర్ మీనారాణి తెలిపారు.
అయితే, ఇంత జరిగినా ఆస్పత్రిలోనూ ఆ దంపతులు గొడవకు దిగారని గ్రామస్థులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.