నవతెలంగాణ – వర్ధన్నపేట : భర్త నిత్యం తాగుతున్నాడని కారణంతో భార్య కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి ఇవ్వడంతో మృతి చెందిన దారుణమైన ఘటన భవానికుంట చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భవాని కుంట తండాకు చెందిన జాటోతు బాలాజీ కి భార్య కాంతి కూతురు, కుమారుడు ఉన్నారు. కొద్దిపాటి వ్యవసాయంతో పాటు ఎక్కడైనా అనవసరపు చెట్లు ఉన్న వెళ్లి తొలగించి కూలి డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అయితే గత మంగళవారం 8న తండాలో దాటుడు పండగ గిరిజనులు నిర్వహించారు. పండగ రోజు మద్యం మత్తులో ఉన్న భర్త బాలాజీకి, ఇంట్లో ఉన్న గడ్డి మందు థమ్సప్ లో కలిపి ఇచ్చింది. అప్పటికే మద్యంమత్తులో బాలాజీ కూల్ డ్రింక్ తాగాడు. కాసేపటి తర్వాత కడుపులో మంటగా ఉందని తీవ్రంగా బాధపడుతుంటే.. అది చూసిన భార్య.. ఏమవుతుందోనని పక్కింట్లోకి పరారైంది. వెంటనే స్పందించిన ఇరుగుపొరుగు వారు చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ఆస్పత్రికి తరలించారు. క్రిమిసంహారక మందు తాగి ఉండవచ్చని భావించిన డాక్టర్లు.. మెరుగైన చికిత్స కోసం వరంగల్ కు తరలించారు.
తండాలో అప్పటికే భార్యపై అనుమానం ఉన్న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం బాలాజీ మృతి చెందారు. అనంతరం పోలీసులు బాలాజీ భార్యను విచారించగా.. భర్త నిత్యం తాగుతున్నాడని, నాతో గొడవలు చేస్తాడని, అందుకే ఆయనకు థమ్సప్ లో గడ్డి మందు కలిపి ఇచ్చానని తెలిపింది. కాగా తండాలో పలువురు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కాంతి సొంత అక్క భర్త దసరు కలిసి కావాలనే బాలాజీ మృతికి కారకులయ్యారని, థమ్సప్ లో పురుగుల మందు కలిపి పథకం ప్రకారమే భార్య కిరాతకంగా హత్య చేసిందని పలువురు కాంతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగుబోతు భర్త అయినప్పటికీ ఇద్దరు పిల్లలు ఉన్న భార్య థమ్సప్ లో గడ్డి మందు కలిపి ఇవ్వడం దారుణమైన చర్య అని స్థానికులు మండిపడుతున్నారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్య కాంతితో పాటు నీలగిరి స్వామి తండాకు చెందిన దస్రుపై కేసు నమోదు చేసినట్లు వర్ధన్నపేట ఎస్సై భూక్యా చందర్ తెలిపారు.
థమ్సప్ లో భర్తకు పురుగుల మందు కలిపిచ్చిన భార్య..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES