43 శాతం పనుల కుదింపు
ఏప్రిల్ నుంచి కొత్త ప్రణాళిక
కేంద్ర, రాష్ట్రాల నిధుల కేటాయింపుపై స్పష్టత కరువు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనుల అమలుపై ఈ ఏడాది ఇంకా స్పష్టత రావడం లేదు. ఇప్పటికే పూర్తిగా కేంద్రం ఆధీనంలోకి వెళ్లిన చట్టంలో గుర్తించిన పనులు మినహా కొత్తవి చేయకుండా చట్టం చేశారు. దాంతో పనుల రకాల సంఖ్య తగ్గిపోయింది. ఇక బడ్జెట్ కేటాయింపుల్లోనూ కోతలు విధించడం.. కొత్త బిల్లు తేవడం వల్ల రానురాను చట్టం ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 43 శాతం మేర పనులను కుదించారు. నిధుల ఖర్చు కూడా గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గింది. కరోనా కాలంలోనూ బడ్జెట్ కేటాయింపులు జరగ్గా.. ఈ సంవత్సరం దాదాపు పనులు, నిధుల ఖర్చు తగ్గిపోయాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్నందున సిబ్బంది పనులను గుర్తించే పనిలో ఉన్నారు.
అవగాహన కుదిరేనా?
ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఏడాదిపాటు చేయాల్సిన పనులకు సంబంధించి ముందుగా యాక్షన్ ప్లాన్ చేస్తారు. ఏ గ్రామంలో ఎన్ని పనిదినాలు చేయాలి?, ఏమేం పనులు చేయాలి?, ఎంత బడ్జెట్ అనేది సంవత్సరానికి బడ్జెట్ తయారు చేస్తారు. కేంద్రం కొత్తగా ఇఫ్తదార్ అనే సైట్‌ను తెచ్చింది. అందుకు కేవలం పనిచేయాల్సిన ప్రదేశం, ఫలానా పని అని మాత్రమే గుర్తించి ప్రణాళిక తయారు చేయాలి. ఏప్రిల్ 1 తరువాత ఆయా పనులకు ఎంత బడ్జెట్ అనేది నిర్ణయిస్తారు.
ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి చట్టానికి 10 శాతం బడ్జెట్ కేటాయిస్తే.. కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇచ్చేది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మాత్రం రాష్ట్రం నుంచి 40 శాతం నిధులు ఇస్తే.. తాము 60 శాతం ఇస్తామని కేంద్రం వీబీజీఆర్‌ఏఎం-జీ ద్వారా ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తాము 40 శాతం బడ్జెట్ కేటాయించబోమని, ఏప్రిల్ మాసానికి మాత్రం ఇంతకు ముందులానే 10 శాతం బడ్జెట్ పెడుతూ ప్రణాళికను పంపించినట్టు తెలిసింది. మరి కేంద్రం ప్రత్యేకంగా రాష్ట్రానికి అలా నిధులు కేటాయిస్తుందా? లేదా అన్నది ఆర్థిక సంవత్సరం మొదలైతే స్పష్టత రానున్నది.
పనులు, నిధుల్లో కోత
గతంతో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పనులు సగానికి తగ్గిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో లేబర్ ఎక్కువగా ఉండటంతోపాటు ఉపాధిహామీ పథకంపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చట్టం నిర్వీర్యమైతే ఉమ్మడి జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో కూలీల కోసం రూ.185.4 కోట్లు ఖర్చు చేశారు. మెటీరియల్‌కు రూ.100.01 కోట్లు ఖర్చయ్యింది. 2024-25 సంవత్సరంలో ఉమ్మడి పాలమూరులో లేబర్ పేమెంట్ రూ.289.82 కోట్లు కాగా, మెటీరియల్ పేమెంట్ రూ.210.5 కోట్లు ఇచ్చారు. మరో వారంలో ఆర్థిక సంవత్సరం ముగియనున్నది. గతేడాదితో పోలిస్తే 43 శాతం పనులు, నిధులు తగ్గిపోవడం గమనార్హం. ఈ సంవత్సరం పనులు, నిధులు పెరుగుతాయా? తగ్గుతాయా? అన్నది మరో 15 రోజుల్లో తేలనుంది.
ఉపాది తగ్గితే వలసలు పునరావృతం!
కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఉపాది హామీ పనులు తగ్గితే జిల్లా నుంచి మళ్లీ వలసలు పునరావృతం అవుతాయి. ఇప్పటికే సాంకేతిక కారణాల పేరుతో ఉపాధి పనులు తగ్గిపోయాయి. ఇప్పుడు రాష్ట్రాలపై 40 శాతం నిధుల భారం మోపితే గ్రామపంచాయతీలకు భారం పెరుగుతుంది. బడ్జెట్‌లో రాష్ట్రం 40 శాతం నిధులు కేటాయించలేదు. మరి కేంద్రం 60 ఏ రకంగా ఖర్చు చేస్తుందో గందరగోళంగా ఉంది.
వీబీజీఆర్‌ఏఎం-జీ బిల్లును ఎత్తేయాలి..
వీబీజీఆర్‌ఏఎం-జీ పథకం పేరుతో ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం యోచిస్తోంది. ఉపాధి చట్టం వచ్చాక పాలమూరు లాంటి వలసల జిల్లాలో కూలీలకు పని లభిస్తోంది. ఇప్పుడు కొత్త పథకంలో 40 శాతం నిధులు రాష్ట్రాలే సమకూర్చాలనే నిబంధన పెట్టడంతో చట్టం ఉంటుందో లేదోననే సందేహాలు వస్తున్నాయి. ఏప్రిల్ నెలలో కొత్త పని దినాలు రావడంతో.. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు ఎక్కువగా పనులకు వచ్చే అవకాశాలున్నాయి. బయోమెట్రిక్ నమోదుతో కూలీలు పనులకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ విధానాన్ని రద్దు చేయాలి. 22 వారాల నుంచి కూలీలకు కూలి రావడం లేదు. బకాయి కూలి మొత్తం చెల్లించి.. కొత్త పనులు మొదలు పెట్టాలి. లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం.
-కడియాల మోహన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు



