Thursday, May 29, 2025
Homeఆటలువిదేశీ క్రికెటర్లు వస్తారా?

విదేశీ క్రికెటర్లు వస్తారా?

- Advertisement -

– మళ్లీ ఐపీఎల్‌కు రావటంపై సందిగ్థత
– నాలుగు రోజుల్లో ఐపీఎల్‌18 రీ స్టార్ట్‌
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మరో మూడు రోజుల్లో పున ప్రారంభం కానుంది. భారత క్రికెటర్లతో ఎటువంటి సమస్య లేదు. వారం రోజుల వాయిదాతో ఇప్పటికే స్వదేశాలకు చేరుకున్న విదేశీ క్రికెటర్లు తిరిగి లీగ్‌లో ఆడటంపై సందిగ్థత కొనసాగుతుంది. వాయిదా పడే సమయానికి 71 మంది విదేశీ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడారు. లీగ్‌లో చివరి 17 మ్యాచుల్లో పోటీపడేందుకు విదేశీ క్రికెటర్లు తిరిగి భారత్‌కు వస్తారా? ఇప్పుడు క్రికెట్‌ వర్గాల్లో ఇదే అత్యంత చర్చనీయాంశం
నవతెలంగాణ-ముంబయి

భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దు ఉద్రిక్తతలతో వారం పాటు వాయిదా పడిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 18వ సీజన్‌ ఈ నెల 17 నుంచి పున ప్రారంభం కానుంది. లీగ్‌లో మిగిలిన 17 మ్యాచులను రీ షెడ్యూల్‌ చేస్తూ బీసీసీఐ సోమవారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బెంగళూర్‌, అహ్మదాబాద్‌, జైపూర్‌, ఢిల్లీ, ముంబయి, లక్నో నగరాలు ఐపీఎల్‌18లో మిగిలిన గ్రూప్‌ దశ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫైనల్‌ సహా ప్లే ఆఫ్స్‌ మ్యాచులకు వేదికలను త్వరలో వెల్లడించనున్నారు. శనివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌తో ఐపీఎల్‌18 రీ స్టార్ట్‌ కానుండగా.. లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన 71 మంది విదేశీ క్రికెటర్లు మళ్లీ భారత్‌కు వస్తారా అనే అంశంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. యుద్ధం వాతావరణంలో వాయిదా పడిన ఐపీఎల్‌ను అట్టహాసంగా ముగించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఐపీఎల్‌18 సక్సెస్‌కు విదేశీ క్రికెటర్ల ప్రాతినిథ్యం సైతం ఓ కొలమానంగా ఉండనుంది. దీంతో విదేశీ క్రికెట్‌ బోర్డులతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతుండగా.. ఆటగాళ్లతో ప్రాంఛైజీలు మాట్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ప్రాంఛైజీలో ఎంతమంది విదేశీ క్రికెటర్లు ఆడుతున్నారు, ఏ ఆటగాడు తిరిగి రావడానికి అవకాశం లేదో చూద్దాం.
చెన్నై సూపర్‌కింగ్స్‌
సూపర్‌కింగ్స్‌ విదేశీ ఆటగాళ్లలో డెవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర, డెవాల్‌ బ్రెవిస్‌, శామ్‌ కరణ్‌, జెమీ ఓవర్టన్‌, నాథన్‌ ఎలిస్‌, నూర్‌ అహ్మద్‌, మతీశ పతిరణ ఉన్నారు. కివీస్‌ ఆటగాళ్లు రచిన్‌, కాన్వేలు తిరిగి రావటం అనుమానంగా ఉంది. విండీస్‌తో వైట్‌బాల్‌ సిరీస్‌లో ఆడే ఇంగ్లాండ్‌ జట్టులో జెమీ ఓవర్టన్‌ ఉన్నాడు. చెన్నై ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించగా ఓవర్టన్‌ లీగ్‌లో ఆడేందుకు రానున్నాడు.
పంజాబ్‌ కింగ్స్‌
జోశ్‌ ఇంగ్లిశ్‌, మిచెల్‌ ఓవెన్‌, అజ్మతుల్లా ఓవర్‌జారు, ఆరోన్‌ హార్డి, మార్కో జాన్సెన్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, మార్కస్‌ స్టోయినిస్‌, లాకీ ఫెర్గుసన్‌ పంజాబ్‌ కింగ్స్‌ విదేశీ క్రికెటర్లు. ఆసీస్‌ ఆటగాళ్లు స్టోయినిస్‌, ఇంగ్లిశ్‌ రావటం అనుమానంగా ఉంది. చీఫ్‌ కోచ్‌ పాంటింగ్‌ ఈ ఇద్దరిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలితం లేదని సమాచారం!. ఇతర క్రికెటర్లు లీగ్‌లో ఆడేందుకు తిరిగి రానున్నారని తెలిసింది.
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
ట్రావిశ్‌ హెడ్‌, పాట్‌ కమిన్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, కామిందు మెండిస్‌, వియాన్‌ ముల్డర్‌, ఈషన్‌ మలింగలు సన్‌రైజర్స్‌ శిబిరంలోని విదేశీ ఆటగాళ్లు. పాట్‌ కమిన్స్‌, ట్రావిశ్‌ హెడ్‌ రావటంపై అనుమానాలు నెలకొన్నా.. ఈ ఇద్దరు తిరిగి రానున్నారు. సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో లేకపోవటంతో కమిన్స్‌, హెడ్‌లు ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ సన్నద్ధతకు తగినంత సమయం చిక్కనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌
క్యాపిటల్స్‌ జట్టులో మిచెల్‌ స్టార్క్‌, డుప్లెసిస్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌, అటల్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, డొనొవన్‌, దుష్మంత చమీర ఉన్నారు. ధర్మశాల మ్యాచ్‌ అనుభవాన్ని మిచెల్‌ స్టార్క్‌ సతీమణి అలీసా హీలే పంచుకుంది. దీంతో స్టార్క్‌ మళ్లీ రావటం అనుమానమే. సఫారీ ప్లేయర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌ వచ్చినా.. మే 25 తర్వాత తిరిగి వెళ్లిపోయే అవకాశం ఎక్కువ.
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌
ఫిల్‌ సాల్ట్‌, టిమ్‌ డెవిడ్‌, జాకబ్‌ బెతెల్‌, రొమారియో షెఫర్డ్‌, లియాం లివింగ్‌స్టోన్‌, జోశ్‌ హాజిల్‌వుడ్‌, లుంగిసాని ఎంగిడి, నువాన్‌ తుషార ఆర్సీబీ విదేశీ క్రికెటర్లు. జాకబ్‌ బెతెల్‌, లుంగిసాని ఎంగిడి, హాజిల్‌వుడ్‌ సేవలను ఆర్సీబీ కోల్పోయే ప్రమాదం ఉంది. హాజిల్‌వుడ్‌ గాయానికి గురవగా.. విండీస్‌తో సిరీస్‌కు బెతెల్‌.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ సన్నద్ధతకు ఎంగిడి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ముంబయి ఇండియన్స్‌
రియాన్‌ రికెల్టన్‌, కార్బిన్‌ బాచ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బెవాన్‌ జాకబ్స్‌, విల్‌ జాక్స్‌, మిచెల్‌ శాంట్నర్‌, ముజీబ్‌ రెహమాన్‌, టాప్లేలు ముంబయి ఇండియన్స్‌ విదేశీ ఆటగాళ్లు. సఫారీ క్రికెటర్లు రికెల్టన్‌, బాచ్‌లు ఈ నెల 26 తర్వాత తిరిగి వెళ్లనుండగా.. విల్‌ జాక్స్‌ విండీస్‌తో సిరీస్‌ కోసం స్వదేశం చేరుకోనున్నాడు. కివీస్‌ ఆటగాడు మిచెల్‌ శాంట్నర్‌ తిరిగి రావటంపై అనుమానం నెలకొంది.
కోల్‌కత నైట్‌రైడర్స్‌
క్వింటన్‌ డికాక్‌, రసెల్‌, సునీల్‌ నరైన్‌, పావెల్‌, గుర్బాజ్‌, మోయిన్‌ అలీ, స్పెన్సర్‌ జాన్సన్‌, నోకియాలు కోల్‌కత తరఫున ఆడుతున్న విదేశీ క్రికెటర్లు. క్వింటన్‌ డికాక్‌, స్పెన్సర్‌ జాన్సన్‌, మోయిన్‌ అలీ తిరిగి రావటం కష్టమే అని ప్రాంఛైజీలు వర్గాలు చెబుతున్నాయి.
గుజరాత్‌ టైటాన్స్‌
జోశ్‌ బట్లర్‌, కగిసో రబాడ, గెరాల్డ్‌ కోయేట్జి, షెర్‌ఫేన్‌ రూథర్‌ఫోర్డ్‌, రషీద్‌ ఖాన్‌, కరీమ్‌ జనత్‌, దశున్‌ శకనలు టైటాన్స్‌ విదేశీ ఆటగాళ్లు. జోశ్‌ బట్లర్‌, కోయేట్జి బుధవారం తిరిగి రానుండగా.. జాతీయ జట్టు బాథ్యతల నేపథ్యంలో మే 25 తర్వాత మళ్లీ వెళ్లిపోవచ్చు.
లక్నో సూపర్‌జెయింట్స్‌
మాథ్యూ, డెవిడ్‌ మిల్లర్‌, నికోలస్‌ పూరన్‌, ఎడెన్‌ మార్‌క్రామ్‌, మిచెల్‌ మార్ష్‌, షమర్‌ జోసెఫ్‌ లక్నో విదేశీ ఆటగాళ్లు. ఎడెన్‌ మార్‌క్రామ్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడాల్సి ఉండగా.. జొసెఫ్‌ ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ఆడాల్సి ఉంది. ఈ ఇద్దరు మే 25 తర్వాత వెళ్లిపోనున్నారు.
రాజస్థాన్‌ రాయల్స్‌
రాయల్స్‌ మరో రెండు మ్యాచులే ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్‌ జట్టులో లేకపోయినా జోఫ్రా ఆర్చర్‌ మళ్లీ వచ్చే అవకాశం లేదు. కానీ ఇతర ఆటగాళ్లు అందరూ రానున్నారు. షిమ్రోన్‌ హెట్‌మయర్‌, ప్రిటొరియస్‌, వానిందు హసరంగ, బర్గర్‌, ఫరూకీ, మాపాకా, మహీశ్‌ తీక్షణలు అందుబాటులో ఉండనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -