న్యూఢిల్లీ : అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు రద్దయిన నేపథ్యంలో గతేడాది కాలంగా యూఎస్ ఖజానాకు చేరిన సుమారు 13,300 కోట్ల డాలర్ల (దాదాపు రూ.12 లక్షల కోట్లు) రిఫండ్ అంశం ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇందులో భారత్ వాటా 2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.16,600 కోట్లు)గా ఉంది. అయితే.. ఈ భారీ సొమ్ము నేరుగా భారతీయ ఎగుమతి దారుల జేబుల్లోకి వచ్చే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం ఈ టారిఫ్‌లను అక్కడ దిగుమతి చేసుకున్న కంపెనీలే చెల్లించాయి కాబట్టి.. రీఫండ్ ఏదైనా ఉంటే అది ఆయా అమెరికన్ దిగుమతిదారులకే చెందుతుంది.
భారత్‌కు నగదు రూపంలో పరిహారం అందకపోయినా.. ఈ తీర్పు వల్ల అమెరికా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు మళ్ళీ గిరాకీ పెరగడం, ఏటా సుమారు 6 బిలియన్ డాలర్ల (రూ.50,000 కోట్లు) ఎగుమతి వ్యయం తగ్గనుండటం అతిపెద్ద సానుకూలాంశమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా 50 శాతం సుంకంతో కుదేలైన తోలు రంగం, అక్వా రంగాలకు ఈ నిర్ణయం పునర్జీవం పోయనుందని భావిస్తున్నారు. ఈ రిఫండ్ల ప్రక్రియ అంత సులభం కాదని, అమెరికా వద్ద దీనికోసం ప్రత్యేక ఆటోమేటిక్ వ్యవస్థ లేనందున కంపెనీలు చట్టబద్ధంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం 12 నుంచి 18 నెలల సమయం పట్ట వచ్చని, రిఫండ్ వ్యాజ్యాలన్నీ తేలేసరికి రెండేళ్లు కూడా పట్టొచ్చని సాక్షాత్తూ ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఒకేసారి రూ.12 లక్షల కోట్ల రిఫండ్ అనేది అమెరికా చరిత్రలో మునుపెన్నడూ లేని గందరగోళానికి దారితీసే అవకాశం ఉన్నందున.. రాబోయే రోజుల్లో వైట్‌హౌస్ తీసుకోబోయే నిర్ణయాలపైనే అందరి దృష్టి నెలకొంది.
భారత్‌కు రూ.12 లక్షల కోట్ల రిఫండ్ దక్కేనా..?
- Advertisement -
- Advertisement -



