ఇక్కడే ముగిస్తారా?

ఇక్కడే ముగిస్తారా?– సిరీస్‌ విజయంపై సూర్యసేన గురి
– భారత్‌, ఆసీస్‌ మూడో టీ20 నేడు
గుహవటి : టీ20 సిరీస్‌లో హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన టీమ్‌ ఇండియా.. గువహటిలోనే సిరీస్‌ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. తొలి రెండు మ్యాచుల్లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌ అన్ని రంగాల్లోనూ జోరు మీదుంది. మరోవైపు వరల్డ్‌కప్‌ హీరోలు వచ్చినా.. కంగారూల ప్రదర్శనలో పెద్ద మార్పు లేదు. ఈ మ్యాచ్‌లో ఓడితే.. సిరీస్‌ ఆశలు ఆవిరి కానుండగా ఆసీస్‌ చావోరేవో తేల్చుకునేందుకు తయారవుతోంది. భారత్‌, ఆసీస్‌ మూడో టీ20 నేడు రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది.
సిరీస్‌ పట్టేస్తారా?
యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్య కుమార్‌, రింకూ సింగ్‌ అందరూ భీకర ఫామ్‌లో ఉన్నారు. వికెట్లకు ప్రాధాన్యత ఇవ్వని నయా ప్రణాళిక బాగా పని చేస్తోంది. భారత బ్యాటర్లకు కళ్లెం వేసేందుకు ఆసీస్‌ బౌలర్ల దగ్గర ప్రణాళికలు లేకుండా పోతున్నాయి. బంతితోనూ రెండో మ్యాచ్‌లో మనోళ్లు మెరిశారు. అక్షర్‌ పటేల్‌, ముకేశ్‌ కుమార్‌లు గొప్పగా రాణిస్తున్నారు. అర్షదీప్‌ సింగ్‌ సైతం మెరిస్తే పవర్‌ప్లేలో మరింత దూకుడు చూపించవచ్చు. తెలుగు తేజం తిలక్‌ వర్మ తనదైన ఇన్నింగ్స్‌ బాదేందుకు ఎదురు చూస్తున్నాడు. మరోసారి భారత్‌కు ఆరంభంలో యశస్వి జైస్వాల్‌, చివర్లో రింకూ సింగ్‌ కీలకం కానున్నారు.

Spread the love