– విజయంపై శుభ్‌మన్ గిల్‌సేన గురి
– నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టు
– మధ్యాహ్నాం 3.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్
వైట్‌బాల్ ఫార్మాట్‌లో భారత్ మెరుస్తున్నా.. రెడ్‌బాల్ ఫార్మాట్‌లో టీమ్ ఇండియా కష్టాల్లో కూరుకుంది. గత తొమ్మిది టెస్టుల్లో మనోళ్లు కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించగలిగారు. 2014 సౌతాంప్టన్-2015 గాలె టెస్టు సమయంలో భారత్ వరుసగా తొమ్మిది టెస్టుల్లో విజయాలు సాధించలేదు. ఇప్పుడు మళ్లీ టీమ్ ఇండియా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. మరో వైపు ఎడ్జ్‌బాస్టన్‌లోనూ భారత్‌కు ఏమంత మంచి రికార్డు లేదు. ఈ నేపథ్యంలో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో లెక్క సమం చేసేందుకు నేటి నుంచి ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు సమరానికి భారత్ సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంపై గురి పెట్టగా.. భారత్ 1-1 కోసం నేటి నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో తాడోపేడో తేల్చుకోనుంది. భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టు నేటి నుంచి ఆరంభం. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 3.30 గంటలకు ఆట ఆరంభం అవుతుంది.
బుమ్రా ఆడతాడా?
తొలి టెస్టులో విజయావకాశాన్ని వదిలేసిన భారత్.. అచ్చిరాని స్టేడియంలో బుమ్రాను బరిలోకి దింపుతుందా? లేదా అనే సందిగ్ధం కొనసాగుతుంది. రెండో స్పిన్నర్ రేసులో వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్ పోటీపడుతున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు ఆడతారనే ఉత్కంఠ కనిపిస్తోంది. పేస్ ఆల్‌రౌండర్‌గా శార్దుల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి ఆడటం లాంఛనమే అనిపిస్తోంది. బ్యాటింగ్ లైనప్‌లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. జైస్వాల్, రాహుల్, శుభ్‌మన్ గిల్, పంత్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్‌లు సైతం పరుగుల వేటలో మెరిస్తే భారత్‌కు ఎదురుండదు. బుమ్రా ఆడకుంటే.. అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్‌లలో ఒకరిని ఆడించే అవకాశం ఉంది. బుమ్రా ఆడినా.. ప్రసిద్ కృష్ణపై వేటు వేసి అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకునే ఆలోచన కనిపిస్తోంది. 20 వికెట్లు పడగొట్ట బౌలర్లను ఎంచుకోవటం భారత్‌కు కీలకం.
మార్పులేని ఇంగ్లాండ్
పేసర్ జోఫ్రా ఆర్చర్ అందుబాటులోకి వచ్చినా.. రెండో టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. లీడ్స్ జట్టుతోనే ఇక్కడా బరిలోకి దిగుతోంది. ఒలీ పోప్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జాక్ క్రాలీ తొలి టెస్టులో ఆతిథ్య జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆర్చర్ లేకపోవటంతో పేస్ దళం బలహీనంగా కనిపిస్తున్నా.. సొంతగడ్డపై ఆ జట్టు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు. క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోశ్ టంగ్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. షోయబ్ బషీర్ ఒక్కడే తుది జట్టులో స్పిన్నర్.
తుది జట్లు :
భారత్ (అంచనా) : యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
ఇంగ్లాండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జెమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోశ్ టంగ్, షోయబ్ బషీర్.