– అర్ధరాత్రి అరెస్టు చేయడానికి వారు తీవ్రవాదులా…
– విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్
– డీజీపీతో ఫోన్ సంప్రదింపులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పండుగ వేళ, అర్ధరాత్రి జర్నలిస్టుల అరెస్టులపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ వికృత క్రీడలో ఉద్యమకారులైన జర్నలిస్టులను బలిచేస్తారా?అని ప్రశ్నించారు. ఈ మేరకు హరీశ్‌రావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాలన చాతగాని ప్రభుత్వం పండగ పూట జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటని విమర్శించారు. ఇండ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా?అని ప్రశ్నించారు. జర్నలిస్టుల వరుస అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి అని తెలిపారు. జర్నలిస్టుల ఆత్మగౌరవంపై పని గట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా-డిజిటల్ మీడియాపై సిట్ వేసి ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గమని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇదేనా ప్రజాపాలన, ఇదేనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జర్నలిస్టుల వరుస అరెస్టుల విషయమై డీజీపీ శివధర్‌రెడ్డితో హరీశ్‌రావు ఫోన్‌లో సంప్రదించారు. అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టుల ఇండ్లలోకి వెళ్లి అరెస్టులు చేయడం అవసరమా?అని ప్రశ్నించారు. నిబంధనలు అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారని అడిగారు. జర్నలిస్టులు క్రిమినల్స్ కాదనీ, ఉగ్రవాదులు కాదనీ, వారిపట్ల ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పండుగపూట అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పెన్నుల మీద గన్నులు మోపుతారా? : నిరంజన్‌రెడ్డి
పెన్నుల మీద గన్నులు మోపుతారా?అని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వార్తలో వాస్తవాలు బయట పెట్టాలి కానీ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా?అని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఆయన ఖండించారు. ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తే నిరుద్యోగులను, యూరియా అడిగితే రైతులను, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం అడిగితే విద్యార్థులను, ఉద్యోగ విరమణ చేసిన తర్వాత బెనిఫిట్స్ అడిగితే రిటైర్డ్ ఉద్యోగులను ఈ ప్రభుత్వం అరెస్టు చేసి బెదిరిస్తున్నదని విమర్శించారు. ఎంత అణచివేస్తే అంత ఎక్కువగా తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ నడుస్తున్నదని తెలిపారు. రజాకార్లను ఎదుర్కొన్న తెలంగాణకు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం పెద్ద లెక్క కాదని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులను ఆపకుంటే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
ఎమర్జెన్సీని తలపించేలా రేవంత్ పాలన : వేముల ప్రశాంత్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులకు పాల్పడటాన్ని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ప్రజాపాలనలో ప్రజాస్వామ్యంపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపించేలా రేవంత్‌రెడ్డి పాలన ఉందని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఏమైనా ఉగ్రవాదులా?అని ప్రశ్నించారు. రాత్రివేళ దాడులు చేయడం ఏ ప్రజాస్వామిక విధానమని నిలదీశారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను వేధించడం, అక్రమ అరెస్టులు చేయడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులందరినీ తక్షణమే విడుదల చేసి చట్టప్రకారం నోటీసులు ఇచ్చి పండుగ తర్వాత విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల అరెస్ట్ సరికాదు ఎన్టీవీ చైర్మెన్‌ను అరెస్ట్ చేయాలి : డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
జర్నలిస్టుల అరెస్ట్ పట్ల బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఖండించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎన్టీవీ చైర్మెన్‌ను అరెస్ట్ చేసి మహిళా ఉన్నతాధికారి, సీనియర్ మంత్రిపై అసభ్యకరమైన వార్తల ప్రసారం వెనుక దాగి ఉన్న కుట్రను బయటపెట్టించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫేక్ న్యూస్ ప్రసారం వెనుక తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రికి, ముఖ్యమంత్రికి, ఆంధ్ర సినిమా లాబీకి ఎక్కడో సంబంధం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఐ బొమ్మ రవికీ, ఎన్టీవీ చైర్మెన్ చౌదరికి వేర్వేరు న్యాయం ఉండకూడదని పేర్కొన్నారు. ఆంధ్ర పెత్తందారీ ఛానల్స్‌కు ఒక న్యాయం, తెలంగాణ ఛానల్స్ ఒక న్యాయం, జర్నలిస్టులకు మరో న్యాయం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.
రాజకీయ వికృత క్రీడలో జర్నలిస్టులను బలిచేస్తారా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



