Friday, March 20, 2026
E-PAPER
Homeఆటలుముంబయి మెరిసేనా..

ముంబయి మెరిసేనా..

- Advertisement -

ఐదుసార్లు ఛాంపియన్‌
28నుంచి ఐపీఎల్‌ సీజన్‌-19 ప్రారంభం

ముంబయి : ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టు అత్యంత బలమైన జట్టు. తొలి లీగ్‌ మ్యాచ్‌లు నిరాశపరుస్తూ.. కీలక మ్యాచుల్లో చెలరేగి ఆడి ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అనుభవజ్ఞులైన మ్యాచ్‌ విన్నర్లతో పాటు సమతుల్యమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ కాంబినేషన్‌తో ఆ జట్టును ఓడించాలంటే ప్రత్యర్ధి జట్టుకు కత్తిమీద సామే. గత సీజన్‌లో ప్లే-ఆఫ్స్‌కు చేరి ఫైనల్‌కు చేరడంలో విఫలమై.. 3వ స్థానానికే పరిమితమైన ముంబయి.. ఈసారి ట్రోఫీ కొట్టాలన్న దృఢనిశ్చయంతో బరిలోకి దిగుతోంది. ముంబయి ఇండియన్స్‌కు ప్రధాన బలం వారి స్టార్‌ ఆటగాళ్లు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, రోహిత్‌ శర్మ, బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఉన్నారు. వీరు ఒత్తిడిలో కూడా మ్యాచ్‌ను తిప్పే సామర్థ్యం కలిగి ఉండటం పెద్ద ప్లస్‌ పాయింట్‌.

ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ మినీ వేలం ద్వారా శార్దూల్‌ ఠాకూర్‌, రూధర్‌ఫోర్డ్‌, మయాంక్‌ మార్కండేలను కొనుగోలు చేసింది. అలాగే ట్రెంట్‌ బౌల్ట్‌, క్వింటన్‌ డి కాక్‌, మిచెల్‌ సాంట్నర్‌, విల్‌ జాక్స్‌ వంటి విదేశీ ప్లేయర్లు జట్టుకు అండగా ఉన్నారు. ముంబయి ఇండియన్స్‌ 29న వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఈ సీజన్‌ టైటిల్‌ వేటను ప్రారంభించనుంది. హెడ్‌ కోచ్‌ మహేలా జయవర్ధనే రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై నమ్మకంతో ఉన్నాడు. తిలక్‌ వర్మ, నమన్‌ ధీర్‌ వంటి యువ ఆటగాళ్లు మధ్యక్రమంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురానున్నారు. మొత్తంగా చూస్తే, ముంబయి ఇండియన్స్‌ జట్టు సమతుల్యత, అనుభవం, మ్యాచ్‌ విన్నర్ల వల్ల ఈసారి ట్రోఫీ గెలిచే ప్రధాన ఫేవరెట్‌గా నిలుస్తోంది. వారు తమ పూర్తి సామర్థ్యంతో ఆడితే, ఇతర జట్లకు ఛాన్స్‌ ఇవ్వకుండా విజయాన్ని సాధించే అవకాశముంది.

ఫైనల్‌కు చేరితే టైటిల్‌ ఖాయం..
ముంబయి ఇండియన్స్‌ 18 సీజన్లలో 6సార్లు ఫైనల్‌కు చేరి ఐదుసార్లు టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2010లో తొలిసారి ఫైనల్‌కు చేరి రన్నరప్‌కే పరిమితమైన ముంబయి.. ఆ తర్వాత 2013, 2015, 2017, 2019, 2020లలో టైటిల్‌ విజేతగా నిలిచింది. ఆ తర్వాత సీజన్‌లలో ఘోరంగా విఫలమైనా.. 2023, 2025లలో 3వ స్థానానికే పరిమితమైంది. అత్యంత ప్రజాదరణ గల ఐపీఎల్‌ జట్లలో ఒకటైన ముంబయి.. ప్రతి సీజన్‌లోనూ టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగి అభిమానులను మన్ననలను పొందుతోంది.

ముంబయి ఇండియన్స్‌ జట్టు
హార్దిక్‌, రోహిత్‌, సూర్యకుమార్‌, తిలక్‌ వర్మ,రికెల్టన్‌, రాబిన్‌ మింజ్‌, రాజ్‌ బావా, రఘు శర్మ, మిచెల్‌ శాంట్నర్‌, కార్బిన్‌ బాష్‌, నమన్‌ ధీర్‌, బుమ్రా, బౌల్ట్‌, గజన్ఫర్‌, అశ్వని కుమార్‌, దీపక్‌ చాహర్‌, విల్‌ జాక్స్‌, రూథర్‌ఫోర్డ్‌, మయాంక్‌ మార్కండే, శార్దూల్‌ ఠాకూర్‌, డి-కాక్‌, మలేవార్‌, ఇజార్‌, అంకోలేకర్‌, మయాంక్‌ రావత్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -