Wednesday, July 23, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనా ఆస్తులు ఫ్రీజ్‌ చేస్తారా?

నా ఆస్తులు ఫ్రీజ్‌ చేస్తారా?

- Advertisement -

బ్రెజిల్‌ న్యాయమూర్తిపై చిందులు తొక్కిన బోల్సొనారో కుమారుడు
బ్రసిలియా :
బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సొనారో మూడో కుమారుడు ఎడుర్డో బోల్సొనారో ఆస్తులను స్తంభింపజేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్‌ డి మొరాయస్‌ ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాలలో ఎడుర్డో నిర్వహిస్తున్న కార్యకలాపాలు ఆయన అరెస్టుకు దారితీసే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎడుర్డో సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆగ్రహంతో చిందులు తొక్కారు. న్యాయమూర్తి నిర్ణయం ఏకపక్షంగా ఉన్నదని, అది నేరపూరితమని మండిపడ్డారు. ‘తాను చేసిన నేరాల పరిణామాల నుంచి రక్షణ పొందేం దుకు మొరాయస్‌ ఇలాంటి అక్రమ నిర్ణయాలపై ఆధారపడుతున్నారు. నియంత మాదిరిగా వ్యవహరిస్తున్నారు’ అని ఆరోపించారు. తన పోరాటాన్ని ఎవరూ ఆపలేరని, తాను ఎవరికీ భయపడబోనని, మౌనం వహించ బోనని చెప్పారు. ఉద్యమించేందుకు సిద్ధంగానే ఉన్నానని అన్నారు. మొరాయస్‌ నిర్ణయం అధికార దుర్వినియోగాన్ని సూచిస్తోందని ఎడుర్డో చెప్పారు. తండ్రిని రక్షించుకునేందుకు ఎడుర్డో వాషింగ్టన్‌ డీసీలో తిష్ట వేసి అమెరికా అధికారులతో మంతనాలు జరుపుతున్న విషయం తెలిసిందే.
కాగా అమెరికాలో ఎడుర్డో కార్య కలాపాలపై జరుగుతున్న విచారణలో భాగంగా బ్రెజిల్‌ న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎన్‌ఎన్‌ బ్రసిల్‌ తెలిపింది. మాజీ అధ్యక్షుడు బోల్సొనారో పై వచ్చిన ఆరోపణలపై మొరాయస్‌ విచారణ జరుపుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికలను ఉపయోగించవద్దంటూ తాను ఇచ్చిన ఆదేశాలను బోల్సొనారో ఉల్లంఘిస్తే అరెస్ట్‌ వారంట్‌ జారీ చేస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు. న్యాయమూర్తి హెచ్చరిక పై బోల్సొనారో మండిపడుతూ అది పిరికితనంతో కూడిన చర్య అని ఎద్దేవా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -