నవతెలంగాణ హైదరాబాద్: శాసన మండలిలో కవిత తన రాజీనామాకు గల కారణాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అదే సందర్భంలో కవిత కీలక ప్రకటన చేశారు. నేను ఈ రోజు వ్యక్తిగా బయటకు వెళ్తున్నాను.. రేపు ఒక శక్తిగా సభలోకి ప్రవేశిస్థాను అని అన్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ వేదిక రాబోతోందని చెప్పారు. రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి మారుతుందని ఆమె ప్రకటించారు.
‘‘ఉద్యమ ద్రోహులకు బీఆర్‌ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. రాష్ట్రంలో సాధించింది ఏమి లేదు..జాతీయ పార్టీ ఎందుకో నాకర్థం కాలేదు. నాది ఆస్తుల పంచాయతీ కాదు.. ఆత్మగౌరవ పంచాయితీ. రాష్ట్రంలో ఓ కొత్త రాజకీయ వేదిక రాబోతోంది. విద్యార్థులు, నిరుద్యోగులు, అన్నివర్గాల కోసం పనిచేస్తా. అవమానభారంతో పుట్టింటి నుంచి అన్ని బంధనాలు తెంచుకుని మీకోసం వస్తున్నా.. ఆశీర్వదించండి. తెలంగాణ జాగృతి.. రాజకీయ పార్టీగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం. కచ్చితంగా గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతా. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నా.. రాజకీయ శక్తిగా తిరిగివస్తా’’ అని కవిత అన్నారు.



