Friday, March 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేయూత అమలైయ్యేనా.?

చేయూత అమలైయ్యేనా.?

- Advertisement -

కొత్త పెన్షన్ల కోసం నిరీక్షణ..
ఆసరా పెంపుపై లబ్ధిదారుల్లో ఆశలు
నవతెలంగాణ – మల్హర్ రావు

ఏ ఆసరా లేని వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ‘చేయూత’ పథకాన్ని అమలు చేస్తోంది. అయితే మండలంలో అర్హులైన పలువురు పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూడక తప్పడం లేదు. అన్ని అర్హతలు ఉన్నా కొత్త పింఛన్లు మంజూరులో జాప్యం జరుగుతుండడం, ప్రభుత్వం మారి రెండేళ్లు దాటినా ఫలితం లేకపోవడంపై అర్హులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారగానే పథకం పేరును చేయూతగా మార్చినా మంజూరు కాక సుమారు వెయ్యి మందికి పైగానే దరఖాస్తు దారులు ఎదురుచూస్తున్నారు. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లోనైనా కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రకటన చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఆసరా నగదు పెంచాలని ప్రస్తుత లబ్ధిదారులు కోరుతున్నారు. మండలంలో మొత్తం ఆసరా పింఛన్లు 3,349 ఉండగా ఇందులో దివ్యాoగులు 530,వితంతు 1525,వృద్ధులు 1194, ఒంటరి 26, గితాకార్మికులు 66, చేనేత కార్మికులు 8 ఉన్నాయి.

తప్పని ఎదురు చూపులు..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో చేయూత పింఛన్ల పెంపు పథకం కూడా అమల్లోకి రాలేదు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్పై రూ.500 తగ్గింపు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగించే పేదలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. త్వరలో దివ్యాంగులకు సైతం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని వెల్లడించారు. అయితే, ఆసరా పింఛన్లను చేయూత పథకం కింద రూ.4 వేలకు పెంచు తామని ఇచ్చిన హామీపై ఇంకా నిర్ణయం తీసుకోక పోవడంతో లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

మూడేళ్లకు పైగా.
రాష్ట్రంలో కొత్త పింఛన్లు మూడేళ్లుగా మంజూరు చేయడం లేదు. 2022 ఆగస్టులో గత ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేశాక..మళ్లీ ఇప్పటివరకు దస్త్రం కదలలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసరా పేరును ‘చేయూత’ అని మార్చగా, పింఛన్ కోసం వృద్ధులు, వితంతువువు, దివ్యాoగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్, డయాలసిస్ రోగులు ఎదురుచున్నారు.

పెంపుపై సందిగ్ధత..
ప్రభుత్వం చేయూత పెన్షన్ల లబ్దిదారులకు నగదు పెంచుతామని ప్రకటించినా అమలుకు నోచుకోవడంలేదు. అయితే, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ను ఏటా రూ.500 చొప్పున పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే రూ.2016 పెన్షన్ రూ.2,500 లకు, రూ.4 వేల పెన్షన్ రూ.4,500లకు చేరుతుంది. ఒకవేళ కొత్త పెన్షన్లు మంజూరు చేయాల్సి వస్తే ఈ ఏడాది కూడా పెంపు ఉండకపోవచ్చనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఏదిఏమైనా ఈనెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాలపై స్పష్టత రానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -