– అసెంబ్లీలో బిల్లుకోసం ఎదురుచూపులు
– డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చాలని జేఏసీ పట్టు
– హెల్త్ కార్డులు, 010 ద్వారా వేతనాల కోసం పోరాటం
– క్యాడర్ స్ట్రెంత్ తగ్గించొద్దని కాంట్రాక్టు ఉద్యోగుల వేడుకోలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ మూడు దశాబ్దాల కలను కాంగ్రెస్ సర్కారు నెరవేర్చుతుందనే కొండంత ఆశతో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు ఎదురుచూసున్నారు. చిన్నచిన్న సమస్యలున్నా ఆస్కి రిపోర్టు సానుకూలంగా రావడంతో టీవీవీపీని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చే ప్రక్రియకు మార్గం సుగమమం అయిందని భావిస్తున్నారు. హెల్త్‌కార్డులు, 010 ద్వారా వేతనాల చెల్లింపు కల నెరబోతుందనే భరోసాతో ఉన్నారు. టీవీవీపీపై విస్తృతంగా చర్చ నడుస్తున్నప్పటికీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చే అంశానికి సంబంధించిన కీలక ఫైలు వైద్యారోగ్య శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆ ఫైలును క్లియర్ చేస్తుందా? క్యాబినెట్‌లో చర్చించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడ్తుందా? టీవీవీపీ ఉద్యోగుల కల నెరవేరుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దాన్ని నాన్చుతుందా? అనే దాన్ని మునుముందు చూడాల్సిందే.
స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా వైద్య విధాన పరిషత్ 1986లో ఏర్పడింది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని 30, 50, 100 పడకల ప్రభుత్వ వైద్యశాలలు, జిల్లా వైద్యశాలలను దాని పరిధిలో అప్పటి పాలకులు చేర్చారు. దాని పరిధిలో పనిచేసేవారు సర్వీస్ రెగ్యులరైజేషన్, ప్రమోషన్, పెన్షన్, కారుణ్య నియామకా లను అప్పట్లో కోల్పోయారు. పోరాటాల ఫలితంగా వాటిలో కొన్ని తిరిగి పొందారు. ప్రస్తుతం తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఇలా 12 వేల మంది దాకా పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ప్రభుత్వం ద్వారా నియమించబడినవారే. ఐదున్నర వేల మంది వరకు కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వారంతా జీతాలను గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమకు ఈ పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు జేఏసీ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం కోసం 2022లో ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. ఎన్నికలు రావడంతో వారి సమస్య పరిష్కారం కాలేదు. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే భరోసాతో మంత్రి దామోదర రాజనర్సింహకు జేఏసీ నాయకులు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. ఆయన కూడా వైద్య విధాన పరిషత్ రద్దుకు సానుకూలత వ్యక్తం చేస్తూ ఈ విషయంపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేశారు. విస్తృత అధ్యయనం తర్వాత , వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటుకు అనుకూలత వ్యక్తంచేస్తూ నివేదికను అందజేసింది. అయితే, సిబ్బందిని తగ్గించాలనే మెలికపెట్టింది. దీంతో నేటికీ సమస్య కొలిక్కిరాలేదు. టీవీవీపీని వైద్యారోగ్యశాఖలో పూర్తిగా విలీనం చేయాలనే డిమాండ్‌తో వైద్యులకు, నర్సింగ్ ఆఫీసర్లకు, ఇతర సిబ్బందికి సంబంధించిన వివిధ సంఘాల క్యాడర్ల బాధ్యులు ఏకమై వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు ఈసారైనా అసెంబ్లీలో వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి ట్రెజరీ ద్వారా వేతనాలు పొందేలా బిల్లు ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు వల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడదనే విషయాన్నీ, టీవీవీపీకి మాతృసంస్థ అయిన ఏపీవీవీపీని ఆంధ్రప్రదేశ్‌లో రద్దు చేసిన విషయాన్ని బలంగా ఎత్తిచూపుతున్నారు. అధికార వర్గాల సమాచారం మేరకు క్యాబినెట్ ముందు ఈ ప్రతిపాదనను ఉంచడానికి అవసరమైన కసరత్తు అంతా ఇప్పటికే పూర్తయిందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆచరణలో ఎంత మేరకు పట్టాలెక్కుతుందనే విషయాన్ని చూడాలి. అందుకే అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం డిమాండ్ చేస్తున్నది.
ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులివే..
వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న వారికి 010 కింద వేతనాలు అందట్లేదు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి పొందే ఆర్థిక ప్రయోజనాల విషయంలో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. అందరికీ వైద్యం అందించే వారికి అనారోగ్య సమస్యలు వస్తే చూపించుకో వడానికి హెల్త్‌కార్డులు లేకపోవడం దారుణమైన విషయం. ఆయా శాఖల పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పర్మినెంట్ చేసింది. వైద్య విధాన పరిషత్ పరిధిలోని వారిని మాత్రం విస్మరించింది. పర్మినెంట్ కోసం వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కొన్ని వారికి వర్తించడం లేదు. వాటి అమలు కోసం మళ్లీ సచివాలయం చుట్టూ తిరగాల్సిన దుస్థితి. డీఎమ్‌ఈ, డీహెచ్ పరిధిలో పనిచేసే సిబ్బందికి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అవకాశముంది. వైద్య విధాన పరిషత్‌లో పనిచేసేవారికి ఆ సౌకర్యం లేకుండా పోయింది. వైద్య శాఖలో విలువైన సేవలందిస్తున్నప్పటికీ హెచ్‌ఓడీ గుర్తింపు లేదు. పీఆర్‌సీ కమిటీకి ప్రతిపాదనలు అందించలేని పరిస్థితి.
రెగ్యులర్ చేయాలి : బైరపాక శ్రీనివాస్
తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ వైద్య విధాన పరిషత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి
వైద్య విధాన పరిషత్ లో దాదాపు 20 ఏండ్ల నుంచి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన సేవలందిస్తున్న వారంద రిని బేషరతుగా రెగ్యులర్ చేయాలి. టీవీవీపీని సెకెండరీ హెల్త్ సర్వీసెస్‌గా అప్‌గ్రేడ్ చేస్తుండటం శుభపరిణామం. అయితే ఆస్కి నివేదికలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అదే హౌదాలో రిటైర య్యేలా సిఫారసు చేయడం ఆందోళనకరం. క్యాడర్ స్ట్రెంత్‌ను తగ్గించొద్దు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్ ప్రకారం ఆయా క్యాడర్ల స్ట్రెంత్‌ను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 010 కింద వేతనాలు చెల్లించాలి. అందర్నీ రెగ్యులర్ చేయాలి.
టీవీవీపీ ఉద్యోగుల కల నెరవేరేనా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


