Friday, July 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసర్కారు వ్యూహం ఫలించేనా?

సర్కారు వ్యూహం ఫలించేనా?

- Advertisement -

– ఆయుధంగా పీపీటీ
– నీటిపారుదల ప్రాజెక్టులే అస్త్రశస్త్రాలు
– ప్రజలకు ఆర్థిక కష్టాల ఏకరువు
– కేసీఆర్‌ ఇంటి గొడవలే తాజా ఎజెండా
– రైతు భరోసాతో స్థానికం గట్టేక్కేనా !?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సమస్యల్లోనుంచి అవకాశాలను వెతుక్కునే పనిలోకి దిగింది. రాజకీయ, ఆర్థిక అంశాల్లోకి తరచి చూస్తున్నది. అధికార పార్టీ ప్రధానంగా గత పదేండ్ల బీఆర్‌ఎస్‌ సర్కారు పాలనా వైఫల్యాలపై దృష్టిపెట్టింది. వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ తొలినాళ్లల్లోనే రైతు భరోసా ఆర్థిక సాయం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో వేయడం ద్వారా ప్రతిపక్షాన్ని ఇరుకునపెట్టింది. ఒకవైపు పరిపాలన అంశాలు, మరోవైపు రాజకీయపరమైన విషయాలను ప్రజలకు అర్థం చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులే అస్త్రశస్త్రాలుగా వాడుకుంటున్నది. కాళేశ్వరం అవినీతి,అక్రమాలపై విచారణ జరుపుతూనే, బనకచర్ల పాపానికి బీఆర్‌ఎస్‌ సర్కారే కారణమని చెబుతున్నది. ప్రతిపాదిత బనకచర్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కేంద్ర పర్యావరణ ప్రతినిధుల కమిటీ చేత ఆనుమతులు ఇవ్వలేమని స్పష్టంగా చెప్పించింది. కాళేశ్వరం నివేదికను ఈ నెలాఖరులోగా తెప్పించుకుని మాజీ సీఎం కేసీఆర్‌, ఆయన అల్లుడు హరీష్‌రావుపై న్యాయపరమైన చర్యలకు పూనుకోవాలనే భావనలో సర్కారు ఉన్నట్టు అంచనా. బనకచర్ల వివాదం కేసీఆర్‌ హయాంలోనే ప్రారంభమైందనీ, అందుకు బీఆర్‌ఎస్‌ సర్కారే అజ్యం పోసిందని ప్రభుత్వం గుర్తు చేస్తున్నది. అందుకే కృష్ణాజలాల్లో తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని చెబుతున్నది. ఇదిలావుండగా కాళేశ్వరం, బనకచర్ల విషయంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ (పీపీటీ) ద్వారా ముందు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్పొరేషన్‌ చైర్మెన్లనూ భాగస్వాములను చేసింది. వీరంతా ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ సర్కారు వైఫల్యాలను చెప్పాలనేది సీఎం రేవంత్‌ వ్యూహాంగా ఉంది. తాజాగా రైతు భరోసా, బనకచర్ల సానుకూలాంశాలుగా మారడంతో స్థానిక పోరుకు సిద్ధమవుతోంది. పీపీటీ ద్వారా బీఆర్‌ఎస్‌ హయాంలోని పాలన, అక్రమాలను విస్త్రృతంగా ప్రచారం చేస్తున్నది. పంచాయతీరాజ్‌ సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సాధ్యమైనంత తొందరగా రాష్ట్రంలోని రాజకీయ వాతావరణాన్ని సానుకూలంగా మలచుకోవాలనే తపనతో రేవంత్‌ సర్కారు ఉన్నది. తద్వారా ఎన్నికలను గట్టెక్కే ప్రయత్నాలు చేస్తున్నది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇంటి గొడవలను రాజకీయ ఎజెండాగా చేసే ప్రయత్నం చేశారు. కుటుంబ వివాదాలపై అంతర్గతంగా మాట్లాడుకోవాలనీ, రచ్చకెక్కొద్దంటూ హితవు పలికారు. ఇంట్లోనే పరిస్థితి సక్కంగ లేదు… ఇక ప్రజల్ని ఏం ఉద్దరిస్తారనే సంకేతాలను ప్రజల్లోకి పంపి లబ్ధిపొందాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాలను తరచూ చెబుతున్న విషయం విదితమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -