Sunday, February 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆశలు తీరేనా..!

ఆశలు తీరేనా..!

- Advertisement -

నేడే నిర్మలమ్మ పద్దుల చిట్టా..
సామాన్యుడిపై పన్నుల కత్తి వీడేనా..
ఉద్యోగులపై పన్ను పోటు తగ్గనుందా..?


2026- 27కు సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి1న (నేడు) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న ఈ తొమ్మిదో బడ్జెట్‌ సామాన్యుడికి ఊరట నిస్తుందా లేక పన్నుల భారంతో మరింత కృంగదీస్తుందా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

నవ తెలంగాణ – బిజినెస్‌ డెస్క్‌
దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్‌ డాలర్ల దిశగా పరుగులు తీస్తోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నా.. సగటు భారతీయుడి బతుకు మాత్రం పన్నుల ఊబిలో కూరుకుపోతోంది. గడిచిన కొన్నేండ్లుగా మోడీసర్కార్‌ ప్రవేశ పెడుతోన్న బడ్జెట్‌లో అంకెలు వేగంగా పెరుగుతోన్నప్పటికీ.. సామాన్యుల ఆశలు తీరడం లేదనే అపవాదు తీవ్రంగా ఉంది. ప్రతీ ఏడాది బడ్జెట్‌పై సామాన్యులు, మహిళలు, రైతులు, నిరుద్యోగ యువతలో తీవ్ర అభద్రతా భావం నెలకొన్న వేళ ఈ సారైనా బడ్జెట్‌లో ఈ వర్గాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నారు.

నిరుద్యోగుల ఆశలు చిగురించేనా..
దేశంలో యువతకు ఉపాధి కల్పన అనేది ప్రస్తుతం అతిపెద్ద సవాలుగా మారింది. మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కల్పనలో తీవ్రంగా వెనుకబడిపోయింది. మౌలిక సదుపాయాల అభి వృద్ధిపై లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబు తున్నా, ఆ పెట్టుబడులు కేవలం యంత్రాలకు, పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే మేలు చేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. డిగ్రీలు చేతపట్టుకుని ఏండ్ల తరబడి కొలువుల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం కేవలం అరకొర స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌ పథకాలను ఆశ చూపుతోందనే ఆందోళనలు ఉన్నా యి. అవి వారి భవిష్యత్తుకు ఎటు వంటి శాశ్వత భరోసా ఇవ్వడం లేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరోవైపు లేబర్‌ కోడ్‌లతో ఉన్న ఉద్యో గాలకు ఎసరుపడే ప్రమాదం పొంచి ఉంది.. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు బడ్జెట్‌పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు.

అన్నదాతల ఆక్రందన..
వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తునప్పటికీ అవి నేరుగా రైతుల జేబుల్లోకి చేరడం లేదు. ఎరువులు, విత్తనాలు, డీజిల్‌ ధరలు పెరిగి సాగు ఖర్చు రెట్టింపు అయ్యింది. పంటలకు కనీస మద్దతు ధర విషయంలో స్పష్టమైన చట్టబద్ధత లేకపోవడం అన్నదాతను కుంగదీస్తోంది. కార్పొరేట్‌ సంస్థల రుణాలను లక్షల కోట్లలో మాఫీ చేసే పాలకులు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల రుణాల పట్ల మొండివైఖరి ప్రదర్శిస్తున్నారని రైతు సంఘాలు విమర్శిస్తోన్న వేళ ఈ బడ్జెట్‌లోనైనా రైతులకు ఉపశమనం దక్కేనా.. వేచి చూడాలి.

కుదేలవుతున్న వంటింటి బడ్జెట్‌
మహిళా సాధికారతపై ప్రభుత్వం చేసే నినాదాలతో సామాన్య గృహిణి గడప దాటడం లేదు. ఆకాశాన్ని తాకుతున్న వంట గ్యాస్‌ ధరలు, నిత్యావసర వస్తువుల రేట్లతో నెలవారీ బడ్జెట్‌ నిర్వహించడం మహిళలకు భారంగా మారింది. గతంలో ఉన్న చిన్నపాటి రాయితీలను కూడా ప్రభుత్వం ఎత్తివేస్తుండటంతో గృహిణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత పథకాల ప్రకటనల కంటే నిత్యావసరాల ధరలను అదుపులో ఉంచడమే తమకు నిజమైన ఊరటనిస్తుందని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

మళ్లీ కార్పొరేట్ల కోసమేనా..?
మంత్రి సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్‌ ఎప్పటిలాగే కేవలం కార్పొరేట్‌ శక్తుల లాభాల కోసమేనా లేక ఓట్లు వేసి గెలిపించిన సామాన్యుడి కోసమా అన్నది ఆదివారం తేలిపోనుంది. సీతారామన్‌ తన పద్దులో సామాన్యులపై పన్నుల కత్తిని పక్కన పెట్టి వారి జేబుకు ఊపిరి పోయకపోతే ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి తీవ్రస్థాయికి చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, పన్నుల భారం సామాన్యుడిని కుంగదీస్తోన్న సమస్యలకు పరిష్కారం దొరకకపోతే ఈ పద్దు కూడా కేవలం అంకెల గారడీగానే మిగిలిపోనుందనే విమర్శలు మూటగట్టుకోనుంది.

సంపాదనంతా ప్రభుత్వానికేనా?
దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే వేతన జీవులు పన్నుల భారంతో సతమతమవుతున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా జీతాలు పెరగకపోయినా, పన్ను మినహాయింపుల పరిమితిని దశాబ్ద కాలంగా మార్చకపోవడం పట్ల పన్ను చెల్లింపు దారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్‌ 80సి వంటి మినహాయింపులు పాతకాలం నాటికే పరిమితమవ్వడంతో, కష్టపడి సంపాదించిన దానిలో అధిక భాగం పన్నుల రూపంలోనే పోతోందని మధ్యతరగతి ఆందోళన వ్యక్తం చేస్తోంది.

పాత పన్ను విధానంలో ఉన్న 80సి మినహాయింపు పరిమితి రూ. 1.5 లక్షల దగ్గరే దశాబ్దకాలంగా ఉండి పోయింది. దీనిని కనీసం రూ. 2.5 లక్షలకు పెంచాలనే డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ. 75,000గా ఉంది. దీనిని రూ. లక్షకు పెంచాలనే డిమాండ్‌ బలంగా ఉంది. ఇదే జరిగితే ఉద్యోగులకు మరో రూ. 25 వేల ఆదాయంపై పన్ను తప్పుతుంది. సొంత ఇల్లు కొనుక్కున్న మధ్యతరగతి గృహాలపై వడ్డీపై ఇచ్చే మినహాయింపును ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.

కునారిల్లుతున్న ఉపాధి హామీ..
గ్రామీణ ప్రాంతాలకు భరోసా ఇచ్చే ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వం క్రమంగా నిర్వీర్యం చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా బడ్జెట్‌లో ఈ చట్టానికి నిధుల కేటాయింపును తగ్గించడం వల్ల కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదు. దీనికి తోడు డిజిటల్‌ అటెండెన్స్‌ వంటి కఠిన నిబంధనలు క్షేత్రస్థాయిలో పేదలకు ఉపాధి దొరక్కుండా చేస్తున్నాయి. పెరిగిన ధరల దృష్ట్యా కనీస కూలీ రేట్లు పెంచకపోవడంతో గ్రామీణ జనం వలసల బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఇటీవల వీబీజీ ఆర్‌ఏఎంజీగా పేరును మార్చిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -