Sunday, September 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅభివృద్ధి పేరుతో పేదల భూములు గుంజుకుంటారా?

అభివృద్ధి పేరుతో పేదల భూములు గుంజుకుంటారా?

- Advertisement -

త్రిబుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ శాస్త్రీయంగా ఉండాలి
మార్కెట్‌ ధరకు మూడింతల పరిహారం చెల్లించాలి
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
సంగారెడ్డి, మెదక్‌, భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఆందోళనలు
భారీగా హాజరైన రైతులు

నవతెలంగాణ-మెదక్‌, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధులు/ భువనగిరి కలెక్టరేట్‌
భూమిని నమ్ముకుని బతుకుతున్న రైతుల ప్రమేయం లేకుండా అభివృద్ధి పేరుతో త్రిబుల్‌ ఆర్‌ కోసం ప్రభుత్వం బలవంతంగా భూములను గుంజుకోవాలని అనుకోవడం సరికాదని సీపీఐ(ఎం) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కోట్లు విలువ చేసే భూములకు లక్షల పరిహారం చెల్లింపులు సరికాదని, త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ శాస్త్రీయంగా ఉండాలని కోరుతూ.. శనివారం సంగారెడ్డి, మెదక్‌, భువనగిరి, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్ల ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భూనిర్వాసితులు ధర్నాలు చేశారు. ర్యాలీలు చేపట్టారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
సంగారెడ్డిలోని కేకే భవన్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కరాములు మాట్లాడుతూ.. భూముల ధరలకు సంబంధం లేకుండా ప్రభుత్వం నామమాత్రంగా పరిహారం ఇవ్వడం సమంజసం కాదన్నారు.

ఎక్కడైనా ప్రభుత్వ అవసరాల కోసం భూములు తీసుకోవాల్సి వస్తే.. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం గ్రామ సభలు జరపాలన్నారు. ప్రయివేట్‌ అవసరాలకు అయితే 70 శాతం మంది, ప్రభుత్వ అవసరాల కోసం 80 శాతం మంది ఆమోదిస్తేనే అక్కడ భూసేకరణ జరపాల్సి ఉంటుందని, కానీ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. దీనిపై రైతులకు అండగా సీపీఐ(ఎం), ప్రజాసంఘాలు పోరాడుతా యని స్పష్టం చేశారు. త్రిబుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ శాస్త్రీయంగా ఉండాలని, ఏండ్ల నుంచి భూమిని నమ్ముకుని బతుకుతున్న రైతులను కన్నతల్లిలాంటి ఆ భూముల నుంచి వేరు చేయడంలో ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. మెదక్‌ జిల్లా కేంద్రంలోనూ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అజ్జమర్రి మల్లేశం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌కు వినతిపత్రం అందజేశారు.

భువనగిరిలో..
భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ చౌటుప్పల్‌, నారాయణపురం మండలాల గుండా వెళ్తున్న త్రిబుల్‌ఆర్‌ కొత్త అలైన్‌మెంట్‌ను మార్చాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. త్రిబుల్‌ఆర్‌ భూనిర్వాసితులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గతంలో భువనగిరి, మునుగోడు ఎమ్మెల్యేలు భూనిర్వాసితులకు ఇచ్చిన మాట ప్రకారం రాజీనామా చేయడానికి సిద్ధమా అని జహంగీర్‌ ప్రశ్నించారు. ప్రభుత్వం ముందు ప్రకటించిన అలైన్‌మెంట్‌ కాకుండా దాన్ని 28 కిలోమీటర్లు కుదించడం వల్ల పట్టణ, మండల కేంద్రాలకు చేరువలో ఉన్న సారవంతమైన భూములను రైతులు కోల్పోతున్నారన్నారు.

నల్లగొండలో..
రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బాధితులతో కలిసి నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్దలు, పలుకుబడి కలిగిన వారు, పెత్తందారుల భూముల జోలికి వెళ్లకుండా అలైన్‌మెంట్‌ను మార్చారని ఆయన విమర్శించారు.

రంగారెడ్డిలో..
రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు సంబంధించిన భూబాధిత రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భూబాధితులు ధర్నా చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌ను మార్చడంతో పెద్ద మొత్తంలో సన్న, చిన్నకారు పేద రైతులు తమ భూములను కోల్పోతున్నారని పగడాల యాదయ్య తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో తలకొండపల్లి, మాడ్గుల, కేశంపేట్‌, కొందుర్గు, ఫరూక్‌నగర్‌ మండలాల్లో రైతులు తమ భూములు కోల్పోతున్నారని తెలిపారు.

మహబూబ్‌నగర్‌లో..
ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చే వరకు పోరాటం ఆగదని సీపీఐ(ఎం) మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శి ఏ.రాములు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట భూబాధితులు ధర్నా చేశారు. బాలనగర్‌ మండలంలో త్రిబుల్‌ఆర్‌ రింగ్‌ రోడ్‌ ఉత్తర్వులను రద్దు చేసే వరకూ పోరాటం ఆగదన్నారు. ఈ ప్రాంతంలో చిన్న, సన్నకారు రైతులు వారికున్న ఎకరా, అర ఎకరా భూములు కోల్పోయి రోడ్డున పడతారన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -