Saturday, February 7, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినాయకుడు పారిపోతాడా!

నాయకుడు పారిపోతాడా!

- Advertisement -

పార్లమెంట్‌ అనేది చట్టాలను చేసే సభ మాత్రమే కాదు. అది ప్రజల అభిప్రాయాలు ప్రతిధ్వనించే వేదిక. సభా మర్యాద, స్వేచ్ఛాయుత చర్చలు, భిన్నాభిప్రాయల గౌరవం, ఇవే ప్రజాస్వామ్యానికి పునాదులు. కానీ, ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాలు చూస్తే ఈ పునాదులన్నీ క్రమంగా కూల్చివేయబడుతున్నాయనే ఆందోళన కలుగుతోంది. గురువారం ఉభయసభల్లో జరిగిన పరిణామాలు కేంద్రప్రభుత్వ ఏకపక్ష ధోరణికి అద్దంపడుతున్నాయి. ప్రతిపక్షాలను అడ్డుకోవడం, చర్చలకు తావివ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. ఇరుపార్టీలను పరిగణలోకి తీసుకోవాల్సిన సభాపతి పూర్తిగా అధికార పార్టీ అనుయాయునిగా వ్యవహరించారు. ప్రతిపక్ష నేతకు రెండు నిమిషాలైన మాట్లాడే అవకాశమివ్వాలని కోరినా పట్టించుకోలేదు. పైగా ప్రధానే మాట్లాడతారని ప్రకటించడం సభా సంప్రదాయాలను మంటగలిపాయి. ఇది తమ గొంతు నొక్కడమేనని ప్రతిపక్షాలు విమర్శించాయి. సభ నుంచి వాకౌట్‌ చేశాయి. ఎన్డీయే నిరంకుశ వైఖరికి ఇదొక పరాకాష్ట!

రాష్ట్రపతి ప్రసంగం ప్రభుత్వ విధానాల్ని పరిశీలించే రాజకీయపత్రం. దానిపై ప్రతిపక్షాలు ప్రశ్నించడం, విమర్శించడం ప్రజాస్వామ్యం. అయితే, ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన మోడీ సభకు రాకుండా తప్పించుకోవడం పార్లమెంటును అవమానించడమే కాదు, ప్రజల ప్రశ్నల నుంచి తప్పించుకోవడమే. ప్రధాని లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించడం చూస్తే చర్చకు ప్రభుత్వం ఎంత భయపడుతుందో స్పష్టం. దీన్ని కప్పిపుచ్చే వైఖరి లోలోపలే నడవడం, దానికి సభాపతి సహకరించడం మరో విపరీతం! మహిళా ఎంపీల నుంచి ప్రధానికి ముప్పు వాటిల్లనుందనే పేరుతో ఆయన్ను సభకు రావద్దని స్వయంగా స్పీకర్‌ ఓం బిర్లా చెప్పడం అసహేతుకం. ఇది దిగజారిన ఆలోచనలకు రూపం. ప్రజలచేత ఎన్నుకోబడిన మహిళా ప్రతినిధులను దుండగులుగా చిత్రీకరించడం, స్త్రీ వ్యతిరేకతకూ, అప్రజాస్వామ్యానికి సంకేతం. సభాపతి చర్చ సజావుగా జరిగేలా చూడాలి. కానీ, అడ్డు తగలడం సభా మర్యాదనే కాదు, ప్రజల నమ్మకాన్నీ దెబ్బతీసే విధానం.

ఇకపోతే, సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ను ఉద్దేశించి మోడీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి రవినీత్‌ సింగ్‌ బిట్టూను ద్రోహి అంటూ అవమానించారని ఆరోపించారు. ఇది సిక్కు మతానికే అవమానమన్నారు. ఇది మతాల మధ్య విద్వేషాన్ని నింపడమే. లౌకికతత్వాన్ని సమాధి చేసి హిందూత్వం మీద దేశాన్ని నిర్మించాలనుకునే వారు మతాల గురించి మాట్లాడటం హాస్యా స్పదం! అంతేకాదు, ఆదివాసీ మహిళ అయిన రాష్ట్రపతి, అత్యున్నత రాజ్యాంగ పరిరక్షకురాలిని ప్రతిపక్షం లోక్‌సభలో దారుణంగా అవమానించిందన్నారు. కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవానికి పిలవకుండా రాష్ట్రపతిని అవమానించింది మోడీ కాదా? ఇలాంటి నేతలు ఇప్పుడు మతాలు, అవమానాల గురించి మాట్లాడటం వింతలో వింత. గతంలోనూ, ఇప్పుడూ బీజేపీ వైఖరిలో రాష్ట్రపతి పదవిపై గౌరవం లోపించిన సంఘటనలనేకం. రాజ్యాంగబద్ధమైన పదవిని రాజకీయ అవసరాల కోసం ఉపయోగించడం, ఆమె ప్రసంగాన్ని సైతం చర్చకు రాకుండా చేయడం, రాజ్యాంగం పట్ల కేంద్రానికున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రసంగాన్ని ప్రశ్నించడం ఒక అంశం, దాన్ని చర్చకే రాకుండా నిర్వీర్యం చేయడం బాధాకరం. చివరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పకుండా పారిపోయిన ప్రధానిగా నిలిచారు.

రాజ్యసభలో పరిస్థితి మరీ దారుణం. సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిటాస్‌ అడిగిన ప్రశ్నలు, కేంద్రం తప్పించుకుంటున్న తీరును బయటపెట్టాయి. కేరళకు నిధుల్లో పక్షపాతం, సామాజిక రంగాలకు కోతలు, ఫెడరల్‌ స్ఫూర్తి ఉల్లంఘనలు,అమెరికాకు దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడంలాంటి ప్రశ్నలు ప్రభుత్వానికి అసహనాన్ని కలిగిస్తున్నాయి. అందుకే సమాధానాలివ్వకుండా ప్రశ్నించే గొంతునే అడ్డుకోవాలని చూస్తోంది. మైకులు ఆపేయడం, మధ్యలో మాటలు కట్‌ చేయడం, సభను తొందరగా వాయిదా వేయడం, ఇవన్నీ కూడా చర్చను అణిచివేయడానికి చేసిన చర్యలు. ప్రతిపక్షం మాట్లాకుండా ఉండాలని చూడటం ఒక ఎత్తుగడే కావచ్చు, కానీ ప్రశ్నలేని పాలన ప్రజాస్వామ్యం కాదు, అది ఏకచత్రాధిపత్యానికి ప్రతిబింబం. ఇది ఎంతోకాలం మనజాలదు. భిన్నాభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామ్య బలం. కానీ, ఆ భిన్న స్వరాలను అణిచివేస్తే, పార్లమెంట్‌లోనే చర్చలు లేకపోతే ప్రజల సమస్యలకు పరిష్కారాలు ఎక్కడ దొరుకుతాయి? ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రశ్న ఉండాలి, దానికి జవాబు కూడా ఉండాలి. అదే ప్రజాస్వామ్యం. లేదంటే అది రాచరికమే అవుతుంది. చివరకు పార్లమెంట్‌ ప్రజల గొంతుక వినిపించే వేదికగా ఉండాలా? అధికార పార్టీ ఆదేశాల సభగా మారాలా అన్నది నేడు దేశం ముందున్న మౌలిక ప్రశ్న.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -