నేటి నుంచి చైనా మాస్టర్స్
బరిలో సింధు, లక్ష్యసేన్
షాంఘై (చైనా) : ఇటీవల హాంగ్‌కాంగ్ ఓపెన్‌లో భారత షట్లర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఓ సింగిల్స్, ఓ డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకుని సత్తా చాటారు. నేటి నుంచి చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్ ఆరంభం కానుండగా.. ఇక్కడా మనోళ్లు అదే జోరు కొనసాగించాలనే అంచనాలు నెలకొన్నాయి. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, ఆయుష్ శెట్టిలు పోటీపడుతున్నారు. తొలి రౌండ్లో ఫ్రాన్స్ షట్లర్‌తో లక్ష్యసేన్.. చైనీస్ తైపీ షట్లర్‌తో ఆయుష్ శెట్టి పోటీపడనున్నారు. మహిళల సింగిల్స్‌లో పి.వి సింధు తొలి రౌండ్లో డెన్మార్క్ అమ్మాయితో ఢకొీట్టనుంది. ఇటీవల పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న సింధు.. అన్‌సీడెడ్ షట్లర్ల చేతిలో సైతం పరాజయం పాలవటం ఆందోళన కలిగిస్తోంది. చైనా మాస్టర్స్‌లో సింధు మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తోంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలు జోరు మీదున్నారు. తొలి రౌండ్లో మలేషియా జోడీతో పోటీపడనున్నారు. మహిళల డబుల్స్‌లో రుతుపర్ణ, శ్వేతపర్ణలు తొలి రౌండ్లో మలేషియా అమ్మాయిలతో పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్, రుత్విక శివానిలు బరిలో నిలిచారు. బిడబ్ల్యూఎఫ్ సూపర్ 750 టోర్నమెంట్ కావటంతో అర్హత పోటీలు లేవు. భారత షట్లర్లు కొందరే నేరుగా ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించారు.