Wednesday, September 24, 2025
E-PAPER
Homeఆటలుజోరు కొనసాగేనా?

జోరు కొనసాగేనా?

- Advertisement -

బంగ్లాదేశ్‌తో భారత్‌ పోరు నేడు
సంజు శాంసన్‌ ఫామ్‌పై ఆందోళన

రాత్రి 8 నుంచి సోనీస్పోర్ట్స్‌లో..

ఆసియా కప్‌ సూపర్‌4లో భారత్‌ మరో కీలక పోరుకు సిద్ధమైంది. పాకిస్తాన్‌పై గెలుపుతో సూపర్‌4లో శుభారంభం చేసిన టీమ్‌ ఇండియా నేడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. నేడు బంగ్లాదేశ్‌పై నెగ్గి ఫైనల్‌ బెర్త్‌కు చేరువయ్యేందుకు సూర్యసేన ఎదురుచూస్తుంది. మరి నేడు భారత్‌కు బంగ్లాదేశ్‌ సవాల్‌ విసరగలదా?

నవతెలంగాణ-దుబాయ్
సూపర్‌4 సవాల్‌ను విజయంతో మొదలుపెట్టిన భారత్‌, బంగ్లాదేశ్‌ నేడు ముఖాముఖి తలపడనున్నాయి. అబుదాబిలో రెండు మ్యాచులు ఆడిన టీమ్‌ ఇండియా.. మళ్లీ స్పిన్‌ ఫ్రెండ్లీ దుబాయ్ లో ఆడనుంది. నెమ్మదిగా స్పందించే దుబాయ్ పిచ్‌పై అధిక ఉష్ణోగ్రతల నడుమ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ఇరు జట్లు తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నాయి. అజేయ జోరుతో ఊపుమీదున్న టీమ్‌ ఇండియాకు గట్టి పోటీ ఇచ్చేందుకు బంగ్లాదేశ్‌ ఎదురుచూస్తోంది. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే.. ఫైనల్లో చోటు లాంఛనం చేసుకునేందుకు సూర్యసేన ఉవ్విళ్లూరుతోంది. భారత్‌, బంగ్లాదేశ్‌ సూపర్‌ 4 మ్యాచ్‌ నేడు దుబాయ్ లో జరుగనుంది. రాత్రి 8 గంటలకు సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో మ్యాచ్‌ ప్రసారం అవుతుంది.

సంజు శాంసన్‌పైనే ఫోకస్‌
శుభ్‌మన్‌ గిల్‌ రాకతో తుది జట్టు కూర్పుతో పాటు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు వచ్చాయి. ఓపెనర్‌గా, నం.3 బ్యాటర్‌గా నిలదొక్కుకున్న సంజు శాంసన్‌ ఆసియా కప్‌లో మిడిల్‌ ఆర్డర్‌లో ఆడుతున్నాడు. అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మలు టాప్‌-4లో బ్యాటింగ్‌కు వస్తున్నారు. ఐదో స్థానంలో సంజు శాంసన్‌ సౌకర్యవంతంగా కనిపించటం లేదు. వచ్చీ రాగానే స్పిన్‌ సవాల్‌ ఎదుర్కొవటం శాంసన్‌కు ఇబ్బందిగా మారుతోంది. దీంతో వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడు. ఆ క్రమంలో వికెట్‌ కోల్పోతున్నాడు. ఆదివారం అబుదాబిలో అదే జరిగింది. అంతకుముందు ఓవన్‌తో మ్యాచ్‌లో అర్థ సెంచరీ సాధించినా.. సంజు శాంసన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకొచ్చాడు. అంతకుముందు, యుఏఈ, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు దుబారులో జరుగగా.. ఆ మ్యాచ్‌ల్లో సంజు శాంసన్‌కు బ్యాటింగ్‌ అవకాశం రాలేదు. ఆసియా కప్‌ లీగ్‌ దశ ముగిసి, సూపర్‌ 4 వార్‌ వేడెక్కుతోంది. కానీ భారత మిడిల్‌ ఆర్డర్‌ సవాల్‌ను ఎదుర్కొని నిలబడలేదు. శ్రీలంకతో మ్యాచ్‌తో సహా ఫైనల్లో భారత్‌కు ఇది సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదు.

నేడు సంజు శాంసన్‌కు ప్రమోషన్‌ ఇచ్చి మూడో స్థానంలో ఆడిస్తారా? లేదంటే మరోసారి ఐదో స్థానంలో అవకాశం కల్పిస్తారా? చూడాలి. బ్యాటింగ్‌ లైనప్‌లో అభిషేక్‌, శుభ్‌మన్‌ ఫామ్‌లో ఉన్నారు. తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య సైతం టచ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ షాట్లను ప్రత్యర్థులు తేలిగ్గా అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఫీల్డింగ్‌ మొహరింపులతో చెక్‌ పెడుతున్నారు. ఈ సమస్య నుంచి సూర్యకుమార్‌ యాదవ్‌ వీలైనంత త్వరగా గట్టెక్కాల్సి ఉంది. బౌలింగ్‌ విభాగంలో జశ్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి లభిస్తుందా? లేదంటే బరిలోకి దిగుతాడా అనేది ఆసక్తికరం. కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌ రూపంలో భారత్‌ మరోసారి ముగ్గురు స్పిన్నర్లతో ఆడనుంది. మిడిల్‌ ఓవర్లలో స్పిన్నర్లు సంధించే 12 ఓవర్లు మ్యాచ్‌ గమనాన్ని నిర్దేశించనుంది. తుది జట్టులో మార్పులు జరిగే అవకాశమైతే కనిపించటం లేదు.

బంగ్లా సవాల్‌
సూపర్‌4లో శ్రీలంకపై నెగ్గిన బంగ్లాదేశ్‌ రెట్టించిన ఉత్సాహంలో కనిపిస్తోంది. అయితే, బలమైన భారత్‌కు గట్టి సవాల్‌ విసిరే సత్తా బంగ్లాదేశ్‌కు ఉందా? అనేది నేడు తేలాలి. బంగ్లాదేశ్‌ శిబిరంలో బ్యాటర్లు, బౌలర్లు ఆశించిన ఫామ్‌లో లేరు. కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. నేడు మ్యాచ్‌లో అతడు ఆడేది అనుమానంగానే ఉంది. గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చిన హసన్‌ను పక్కనపెట్టే చాన్స్‌ ఉంది. ఆ జట్టులో బంతితో ముస్తాఫిజుర్‌ రెహమాన్‌, నసుమ్‌ అహ్మద్‌, మెహది హసన్‌.. బ్యాట్‌తో సైఫ్‌ హసన్‌, తంజిద్‌ హసన్‌, తౌహిద్‌ హృదయ్ లు కీలకం కానున్నారు.

తుది జట్లు (అంచనా):
భారత్‌ : అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), శివం దూబె, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి.
బంగ్లాదేశ్‌ : సైఫ్‌ హసన్‌, తంజిద్‌ హసన్‌, లిటన్‌ దాస్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), తౌహిద్‌ హృదయ్, షమిమ్‌ హొస్సేన్‌, జాకర్‌ అలీ, మెహిది హసన్‌, నసుమ్‌ అహ్మద్‌, టస్కిన్‌ అహ్మద్‌, తంజిమ్‌ హసన్‌, ముస్తాఫిజుర్‌ రెహమాన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -