”ఏ భూమ్మీద కళాకారులు, కళలు వర్ధిల్లుతాయో ..అక్కడే మనుషులు బతికు న్నట్లు ”అంటాడు ఓ తత్త్వవేత్త.
జగమంతా తెలిసిన పేరు తెలంగాణా
పోరాటాలకు నమూనా ..
ఇక్కడి పాటలే కదా!
ముందుండి ప్రజలను నడిపినై..
పాటలే పెట్టని కోటలై నిలిచినవి
పాటలే కోటికంఠాలై మ్రోగినవి
పాటల భిక్షే కదా..? పాలకులు ఏలుతున్న పదవులు..!
ఇక్కడి ‘పాట’కు అంతటి మహత్తర శక్తి
ఈ విషయం అర్థమయితేనే.. సాంస్కతిక రంగం గురించి అవగతమవుతుంది. పదేండ్లపాటు ఒకరు, రెండేండ్లుగా మరొకరు, ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా సాంస్కతిక శాఖకు ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. ఇప్పటికీ తెలంగాణ’పాట’కు ఒక సమగ్ర ప్రణాళిక లేదంటే అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వం దశాబ్దాకాలంగా ‘పాట’ను బిచ్చగత్తెను చేస్తే దానికి తెలంగాణ కవులు చరమగీతం పాడారు. కొందరికి కోట్లు, ఇండ్ల ప్లాట్లు? ఇచ్చారు. మరి గ్రామీణ జానపద, యక్షగాన, గిరిజన ఆదివాసి కళాకారులకు పరిస్థితి ఏంటి? ఈ వ్యత్యాసం, ఈ వివక్ష ఎందుకని కళాకారులు అడుగుతున్నా.. ఆందోళనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆన్నీ వాగ్దానాలే తప్ప ఆచరణ లేదు. తమ జీవితాలను బాగు చేయాలని, మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నీ అమలు చేయాలని విన్నవిస్తున్నా వారి గోస వినేవారు లేరు.
550 మంది కళాకారులు ప్రగతి భవన్‌లో ప్రణామ ప్రగతి గానాలు పాడినంత మాత్రాన తెలంగాణలో సాంస్కృతిక రంగానికి వైభవం వస్తుందా? యావత్తు లక్షలాదిమంది కళాకారుల సంక్షేమం మాటేమిటి ? వారి జీవన భతి ఏమిటి? పాలకులు ఎప్పుడైనా ఆలోచించారా? పల్లెపాటపై పగబట్టిన వారు నాడు, నేడు ఒకే తానులోని గుడ్డ ముక్కలేనా? అన్న సంశయం అందరినోళ్లలో నానుతున్నది. కోటి ఆశల తెలంగాణ కనీస కోరికలు తీరనే లేదు, కొట్లాట తప్పనే లేదు, కళాకారుల వైపు నుండి ఎమ్మెల్సీలున్నా చేసిందేమీ లేదు.సర్వత్రా సాంస్కతిక రంగం సంక్షోభంలో ఉన్నా..తెలంగాణ కళాకారుల గోడు ఏనాడూ శాసనమండలిలో ప్రతిధ్వనించలేదు. ఇగ రవీంద్ర భారతి అంటే? అది ఆధిపత్య హారతి, మూస కార్యక్రమాలు, అవి కూడా కొంతమందికే పరిమితమై అధికారి అనుచరగణంతో అలరారుతున్నది. ఏడాది పొడవునా అన్‌లైన్ బుకింగ్‌లు తప్ప జానపద వత్తి కళా కారులకు ఆదివాసి, గిరిజన, కళలకు చోటు దక్కడం లేదు. అవార్డులు, రివార్డులు, పుట్టిన రోజు పురస్కారాలకు దాసోహానికి నిలయంగా మారిందనే అపవాదును అది మూటకట్టుకుంది.
ఇక భాషా సంస్కతి శాఖను చూస్తే.. ఏనాడైనా సాంస్కతిక సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి సం యుక్త అభిప్రాయం తీసుకుందా? ఇష్టారాజ్యంగా వందిమాగదుల లాలన పాలనలో పాలకుల మెప్పు తప్ప కళాకారుల అవేదన పట్టించుకున్నదా? రవీంద్రభారతి చుట్టూ తిరిగే కొంతమంది కళాకారులతో ఒక వ్యవస్థగా ఏర్పడిందే తప్ప, అడుగంటిన కళారూపాలను వెలికితీయాలన్న కనీససోయి లేకుండా ఉన్నది. సామాజిక సాంస్కతిక, సాహిత్య ప్రదర్శనలతో నిత్యం ప్రేక్షకులను అలరించే కళావేదిక కావాలన్న సంకల్పం, ఒకప్పుడు రవీంద్రభారతి సాధించుకున్నదంతా.. ఇప్పుడున్న పాలక,అధికార యంత్రాంగం హయాంలో మొత్తం పోతున్నది. తెలంగాణ సంస్కతీ సంప్రదాయాల గురించి కూడా చర్చించిన పరిస్థితి లేదు. భాష రోజురోజుకూ కనుమరుగవుతున్నా దాన్ని కాపాడుకోవాలనే ఆలోచన లేదు. ఆ శాఖలో కూడా అంతా ఆధిపత్యం రంగరించుకున్నదన్న ఆరోపణ ఉండనే ఉన్నది. ఓవైపు జవాబుదారితనం లేక, పారదర్శకత కనపడక, కళాకారుల పట్ల కనికరం కూడా కరువైందనే ఆవేదన వ్యక్తమవుతున్నది.
కర్నాటకను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటున్నదని ఇక్కడి అధికార యంత్రాంగం చెబుతున్నది. మంచిదే, కానీ అక్కడ జానపద అకాడమీ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎందుకు అమలు చేయట్లేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. సాంస్కతిక రంగానికి రూ.74 కోట్లు కేటాయిస్తే సాంస్కతిక సారథి కళాకారుల జీతభత్యాలకు 34 కోట్ల 35 లక్షలు పోతుంటే, మరి గ్రామీణ కళాకారుల పరిస్థితి ఏంటి? వారికి పట్టెడన్నం, పాత వస్త్రం ఇచ్చే కనీస సంక్షేమం పథకమైన ప్రవేశపెట్టిందా? మిగిలిన నలభై కోట్లు దేనికోసం ఉపయోగిస్తున్నారనే వివరాలు కూడా లేవు. ఇలాగైతే తెలంగాణలో అడుగంటిన కళలన్నీ ఏ విధంగా అభివద్ధి చేస్తారు?
కళాకారుల ఆటా, పాటలు కనుమరుగయ్యేలా పాలకులు పాటపై పగబట్టినా, కడుపు గట్టుకొని పేగులు తెగినా ఆ పాటనే నమ్ముకున్న కళాకారులకు చేయూతను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? కనీసం వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడాన్ని ఏమనుకోవాలి? ఉమ్మడి ఏపీలో ఒకప్పుడు డిపిఆర్‌ఓ పరిధిలో గ్రామీణ కళాకారులకు గుర్తింపు ఉండేది. బస్సు, రైలు ప్రయాణ సౌకర్యాలు, గుర్తింపు కార్డులు ఉపాధి అవకాశాలుండేవి. కానీ, ప్రత్యేక తెలంగాణలో రవీంద్రభారతి చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఒక్క కార్డు దొరకని దుస్థితి ఉందంటే ఇది ఏకపక్ష పాలన కాకుంటే సంక్షేమ పాలన అంటారా?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి కళాకారునికి రూ. ఐదువేల పింఛన్ ఇస్తామని పేర్కొంది. తెలుగు సినిమా, సాంస్కతిక రంగానికి ఒక విధానాన్ని తీసుకొస్తామని చెప్పింది. ఇందులో ఏ చర్చ కూడా జరగలేదు. తెలంగాణ సినిమా అకాడమీ, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలన్న ఆలోచనే చేయడం లేదు. కళాకారులకు ఎన్నో హామీలిచ్చి, ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక ఇప్పుడు పూర్తిగా విస్మరిస్తున్నది. తెలంగాణలో పంచభూతాలు శోకని నేల ఉండొచ్చు. కానీ జానపదానికి పరవశించని మనిషి ఉండడు. ఆలాంటి జానపదానికి నాడు, నేడు, ఏన్నడూ జానెడు చోటు దక్కడం లేదు.తెలంగాణ కళా కారులకు పాలకుల సానుభూతి అక్కర్లేదు. ప్రజల సంఘీభావం కావాలి. అందరి కష్టాల్లో..బాధల్లో భాగమైన కళాకారులు అందరి స్వేచ్ఛలోనే తన స్వేచ్ఛ ఉందని నమ్మిన కళాకారులు ప్రభుత్వాలను ఏనాడూ యాచించింది లేదు. పాలకులు ఆదరించనూ లేదు.వీళ్ల కళను కీర్తించేందుకు ప్రోత్సహించడానికి చేసిన ప్రయత్నాలు ఏ ఒక్కటి లేవు.
అందుకే తెలంగాణలో సినిమా, జానపద,సకల కళల జాయింట్ యాక్షన్ కమిటీ పదహారు సంఘాలతో ఏర్పడి చర్చించిన సమస్యలు ప్రభుత్వం దష్టికి తెచ్చినా కనీస స్పందన లేదు. ఇక ఓపిక నశించింది.తెలంగాణ కోసం డప్పులు కొట్టిన చేతులు ‘దండోరా’ వేస్తున్నాయి. కోలాటం ఆడాల్సిన చేతులు క్రోధగీతాలు పాడుతున్నాయి. పథకాలు ప్రచారం చేయాల్సిన చేతులు నేడు పిడికిళ్లు ఎత్తుతున్నాయి. పాలకుల మెడలు వంచి హామీలు అమలు చేయించాలి. తెలంగాణ పోరాటం వలే ఆటాపాటల రూపంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. దీనికి యావత్తు కళాకారులు సమయత్తమవ్వాలి.సర్కారుకు తమ సత్తా చాటాలి.
– భూపతి వెంకటేశ్వర్లు
9490098343
తెలంగాణ కళాకారుల ఎత ఎన్నటికి తీరేను?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES