Saturday, November 8, 2025
E-PAPER
Homeఆటలుసిరీస్‌ పట్టేస్తారా?

సిరీస్‌ పట్టేస్తారా?

- Advertisement -

3-1 విజయంపై భారత్‌ గురి
ఆసీస్‌తో ఆఖరు టీ20 పోరు నేడు
మధ్యాహ్నం 1.45 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

భారత్‌, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌పై కంగారూ మీడియా, అభిమానుల్లో ఫోకస్‌ తగ్గినా.. పొట్టి సిరీస్‌ విజయంపై టీమ్‌ ఇండియా ఫోకస్‌ పెట్టింది. స్పిన్‌ మంత్రతో వరుస విజయాలు సాధించిన భారత్‌ నేడు బ్రిస్బేన్‌లో హ్యాట్రిక్‌ విక్టరీపై కన్నేసింది. సిరీస్‌ సాధించే అవకాశాలు ఆసీస్‌కు లేవు. కానీ సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో కంగారూలు నేడు బరిలోకి దిగుతున్నారు. భారత్‌, ఆస్ట్రేలియా ఆఖరు టీ20 మ్యాచ్‌ నేడు.

నవతెలంగాణ-బ్రిస్బేన్‌
2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ మరో మూడు నెలల్లోనే ఉంది. యాషెస్‌ సిరీస్‌పై దృష్టి సారించిన ఆస్ట్రేలియా.. భారత్‌తో టీ20 సిరీస్‌ నుంచి కీలక ఆటగాళ్లను దశలవారీగా తప్పించింది. ఆసీస్‌ టీ20 జట్టులో తొలి ప్రాధాన్య ఆటగాళ్లు ఇప్పుడు యాషెస్‌ సిరీస్‌ సన్నద్ధత కోసం దేశవాళీ రెడ్‌బాల్‌ ఫార్మాట్‌లో ఆడేందుకు సిద్ధమవుతుండగా.. నేడు బ్రిస్బేన్‌లో ఆ జట్టు హ్యాట్రిక్‌ పరాజయంతో పాటు సిరీస్‌ ఓటమి ముంగిట నిలిచింది. నేడు ఆఖరు టీ20లో నెగ్గితే సిరీస్‌ను సమం చేసే అవకాశం ఆసీస్‌కు ఉన్నప్పటికీ.. జోరుమీదున్న భారత్‌ను నిలువరించటం అంత సులువు కాదు. హోబర్ట్‌, గోల్డ్‌కోస్ట్‌లో స్పిన్‌ మాయతో ఆధిపత్యం చూపించిన సూర్యసేన నేడు పేస్‌కు అనుకూలించే బ్రిస్బేన్‌లో ఏం చేస్తుందో చూడాలి.

ఆ ఇద్దరు రాణిస్తారా?
టీ20 ప్రపంచకప్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌. 2026 టీ20 ప్రపంచప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. సొంతగడ్డపై టైటిల్‌ నిలుపుకునేందుకు భారత్‌ బరిలోకి దిగనుండగా.. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ పరుగుల వేటలో తడబాటుకు గురవుతున్నారు. ఆసీస్‌తో సిరీస్‌లో శుభ్‌మన్‌ గిల్‌ అర్థ సెంచరీ సాధించలేదు. గోల్డ్‌కోస్ట్‌లో 46 పరుగులు చేసినా కొత్త బంతితో పేస్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. బౌలర్లపై పైచేయి సాధించటంలో ఆశించిన ప్రభావం చూపలేదు. యశస్వి జైస్వాల్‌, సంజు శాంసన్‌లు ఓపెనర్లుగా విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో శుభ్‌మన్‌ గిల్‌ టీ20 జట్టులో తన స్థానానికి న్యాయం చేయాల్సిన అవసరం ఏర్పడింది.

సూర్యకుమార్‌ యాదవ్‌ దూకుడు ఇటీవల లోపించింది. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచటంలో సూర్య విఫలం అవుతున్నాడు. ఒత్తిడి మరింత పెరగకముందే బ్యాట్‌తో సత్తా చాటాలని చూస్తున్నాడు. అభిషేక్‌ శర్మ భీకర ఫామ్‌లో ఉండగా.. తిలక్‌ వర్మ మిడిల్‌ ఆర్డర్‌లో తనదైన ఇన్నింగ్స్‌ ఆడలేదు. ఆఖరు టీ20లో తిలక్‌, శివమ్‌ దూబెలు బ్యాట్‌తో మెరవాలని ఎదురుచూస్తున్నారు. వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌ గొప్పగా రాణిస్తున్నారు. అర్ష్‌దీప్‌ సింగ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా ద్వయం పేస్‌తో నిప్పులు కురిపిస్తున్నారు. బ్యాటర్లు మెరిస్తే టీ20 సిరీస్‌ భారత్‌ సొంతమవటం లాంఛనమే.

పుంజుకుంటారా?
ఆసీస్‌ ఫోకస్‌ టీ20 ఫార్మాట్‌పై లేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ముంగిట ఆ జట్టు ఆడుతున్న చివరి టీ20 సిరీస్‌ ఇదే. అయినా, ప్రథమ ప్రాధాన్య ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌కు సిద్ధమవుతున్నారు. ట్రావిశ్‌ హెడ్‌, కామెరూన్‌ గ్రీన్‌, మిచెల్‌ స్టార్క్‌, జోశ్‌ హేజిల్‌వుడ్‌ అందుబాటులో లేరు. మిచెల్‌ మార్ష్‌, మాథ్యూ షార్ట్‌ మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. జోశ్‌ ఇంగ్లిశ్‌ గాయం నుంచి కోలుకున్నాక ఫామ్‌ చాటుకోవాల్సి ఉంది. టిమ్‌ డెవిడ్‌, మార్కస్‌ స్టోయినిస్‌ ఆసీస్‌కు కీలకం. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ రీ ఎంట్రీలో జోరందుకోలేదు. జేవియర్‌ బార్ట్‌లెట్‌, నాథన్‌ ఎలిస్‌, ఆడమ్‌ జంపాలు భారత బ్యాటర్లను ఇరకాటంలో పడేసేందుకు ఎదురుచూస్తున్నారు.

పిచ్‌, వాతావరణం
బ్రిస్బేన్‌లో ఇది భారీ వర్షాలు కురిసే సీజన్‌!. శనివారం సైతం భారీ వర్షం సూచనలు ఉన్నాయి. గబ్బా పిచ్‌ పేస్‌, బౌన్స్‌కు గొప్పగా అనుకూలిస్తుంది. అయినా, బ్యాటర్లు ఇక్కడ భారీ స్కోర్లు చేయగలరు.
బిగ్‌బాష్‌ లీగ్‌లో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. సిరీస్‌ ఆఖరు మ్యాచ్‌లో ధనాధన్‌ ఆటపై ఇరు జట్లు దృష్టి సారించాయి. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే వీలుంది.

తుది జట్లు (అంచనా)
భారత్‌ : అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జితేశ్‌ శర్మ, శివమ్‌ దూబె, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జశ్‌ప్రీత్‌ బుమ్రా.
ఆస్ట్రేలియా : మాట్‌ షార్ట్‌, మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), జోశ్‌ ఇంగ్లిశ్‌ (వికెట్‌ కీపర్‌), టిమ్‌ డెవిడ్‌, జోశ్‌ ఫిలిప్‌, మార్కస్‌ స్టోయినిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, బెన్‌, నాథన్‌ ఎలిస్‌, ఆడమ్‌ జంపా.

1
జశ్‌ప్రీత్‌ బుమ్రా టీ20ల్లో వంద వికెట్ల మైలురాయికి వికెట్‌ దూరంలో ఉన్నాడు. నేడు బుమ్రా ఓ వికెట్‌ పడగొడితే.. మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలువనున్నాడు.

2016లో ఆసీస్‌ను ఆసీస్‌లో క్వీన్‌స్వీప్‌ చేసిన తర్వాత భారత్‌ ఎన్నడూ ఆ జట్టుపై వరుసగా మూడు టీ20ల్లో విజయం సాధించలేదు. 2021 తర్వాత ఆస్ట్రేలియా ఏ జట్టు చేతిలోనూ హ్యాట్రిక్‌ ఓటమి చూడలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -