Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిలాభలున్నా...బ్యాంకుల్ని అమ్మేస్తారా?

లాభలున్నా…బ్యాంకుల్ని అమ్మేస్తారా?

- Advertisement -

ఐడిబిఐ బ్యాంక్‌ను ఎలాగైనా ప్రయివేటుపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం శత విధాలా ప్రయత్నిస్తున్న సంకేతాలున్నవి. అన్ని రకాల మాద్యమాల ద్వారా ఈ సమచారం ఇప్పటికే ప్రచారంలోకి వచ్చింది.సర్కార్‌ ఐడిబిఐలో 45.48శాతం వాటాలను తమ వద్ద ఉంచుకుని 49.24 శాతం ఐడిబిఐ వాటాలను గతంలోనే ఎల్‌ఐసి చేత కొనిపించింది. ఆ విధంగా ఐడిబిఐ బ్యాంకు ప్రభుత్వరంగ బ్యాంకు హోదాను కోల్పోవడమే కాకుండా ఎల్‌ఐసికి కూడా సొంతం కాలేదు(యాభై ఒక శాతం వాటాదారు కానందువల్ల). ప్రభుత్వం, ఎల్‌ఐసి దగ్గరున్న మొత్తం వాటాల్లో దాదాపు అరవై శాతం తగ్గించేందుకు రంగం సిద్ధమైందని అనేక వార్తా పత్రికల ద్వారా స్పష్టమైంది. ఈ వార్తలు సహజంగానే కలవరపెడుతున్నాయి. దీన్ని నిరసిస్తూ ఐడిబిఐ బ్యాంకు ఉద్యోగులు ఆగస్టు పదకొండున ఒకరోజు సమ్మెకు కూడా పిలుపునివ్వగా విజయ వంతమైంది. భారతదేశ ఆర్థిక విశిష్టత ఏమంటే, ప్రయివేటురంగ బ్యాంకుల కన్నా ప్రభుత్వరంగ బ్యాంకుల పనితీరు బేషుగ్గా ఉండటం. ఈ మధ్యకాలంలో రానీ బాకీలు ప్రయివేటురంగ బ్యాంకుల్లో మరిన్ని పెరుగుతున్నాయి.

ఐడిబిఐ బ్యాంకు 1964లో ఆర్‌బీఐ నుండి వేరు చేసి ఆర్థికాభివృద్ధి సంస్థగా ఏర్పరిచారు. 2005 లో ఐడిబిఐను, ఐడిబిఐ బ్యాంక్‌తో మిళితం చేశారు. అయితే, యాజమాన్య నిర్వహణ లోపాల కారణంగా ఐడిబిఐ బ్యాంక్‌ కాస్త చిక్కుల్లో పడిన మాట వాస్తవమే. గతంలో కూడా అప్పటి ప్రభుత్వాలు ఐసిఐసిఐ అను సంస్థను ఐసిఐసిఐ బ్యాంకుతో, హెచ్‌డిఎల్‌ఎఫ్‌సిని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుతో జతకలిపి ప్రయి వేటీకరించినట్లుగానే ఇప్పుడు ఐడిబిఐ బ్యాంకును కూడా ప్రయివేటీకరించేందుకు పావులు కదుపుతున్నది. 2017లో ఐడిబిఐ కార్యకలాపాల మీద బ్యాంకింగ్‌ నియంత్రణ వ్యవస్థ ఆర్బీఐ, సత్వర దిద్దుబాటు చర్య (పిపిఎ) కింద కొన్ని ఆంక్షలు విధించింది.

ఎనిమిదేండ్ల క్రితం ఐడిబిఐ బ్యాంక్‌లో 49.24శాతం వాటాను ఎల్‌ఐసి చేజిక్కించున్నప్పుడు, అప్పుల్లో మునిగిపోతున్న ఐడిబిఐ బ్యాంక్‌ను ఎలా కొంటారని ఎల్‌ఐసి సంస్థపై విమర్శల వర్షం కురిసింది. ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఎల్‌ఐసి సంస్థను ప్రయివేటు పరం చేయాలని కూడా అనేకమంది కుహనా ఆర్థికవేత్తలు అక్కసు వెళ్లగక్కారు. అయితే, ఎల్‌ఐసి యాజమాన్యం సరైన నిర్ణయాన్ని అన్ని రంగాలే కాకుండా సంఘాలు కూడా ఆహ్వానించాయి. ఐడిబిఐ బ్యాంక్‌కు దాదాపు 2100 శాఖలు ఉన్నాయి.వీటి ద్వారా ఎల్‌ఐసి బ్యాంక్‌ ఇన్సురెన్స్‌ కార్యకలాపాలు (బ్యాంకుల ద్వారా బీమా వ్యాపారాన్ని చేయడం) మరింత మెరుగుగా నిర్వహించబడతాయని, బ్యాంకింగ్‌ రంగంలో కాలుమోపేందుకు ఇది మంచి అవ కాశమని అందరూ భావించారు. అయితే, ఐడిబిఐ బ్యాంక్‌ యాజమాన్యాన్ని ఎల్‌ఐసి చేపట్టిన తర్వాత ఐడిబిఐ బ్యాంక్‌లో అనేక సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయి. నిర్ణయాత్మక 49.24శాతం వాటాలతో ప్రమోటర్‌గా ఎల్‌ఐసి ఉండటం వల్ల అంచనాలను నిజం చేస్తూ బ్యాంక్‌ గణ నీయంగా మెరుగుపడింది. అత్యధిక నష్టాలు కలిగిన బ్యాంక్‌గా, ఆర్‌బిఐ, పిసిఎ కింద షరతులు విధించబడిన స్థాయి నుండి అచిరకాలంలోనే బ్యాంక్‌ పురోగమించింది. దీంతో ఐడిబిఐ బ్యాంక్‌ మీద పిసిఎ, ఆర్‌బిఐ విధించిన షరతులు తొలగించబడ్డాయి.

గత మూడేండ్లలో ఐడిబిఐ బ్యాంక్‌ 30 వేల కోట్ల రూపాయల నిర్వహణ లాభాలు సాధించింది. ఈ ఏడాది మార్చి, 2025 క్వార్టర్‌ నాటికి ఐడిబిఐ బ్యాంక్‌ లాభాలు 76,306 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌, 25 చివరకు రూ 209 కోట్ల నికరలాభాన్ని సాధించింది. నిర్వహణ ఆదాయం (రూ.7026 కోట్లు)లో కూడా మెరుగైన ప్రదర్శన కనపర్చింది. ఎనిమిదేండ్ల క్రితం వేల కోట్ల నష్టం రూపా యల మూట గట్టుకున్న ఐడిబిఐ బ్యాంక్‌, లాభాలబాట పట్టి నేడు రూ.4లక్షల లక్షల కోట్లు రిజర్వ్‌ కలిగి ఉంది. అనేక లిస్టింగ్‌ కంపెనీలు, బ్యాం క్‌లు పేక మేడలా కూలిపోతుంటే, చక్కటి యాజమాన్య పద్ధతుల ద్వారా (లిస్టింగ్‌ బ్యాంక్‌ అయిన) ఐడిబిఐ బ్యాంక్‌ లాభాలబాట పట్టించడం ఆహ్వానించదగ్గ అంశం.

ఐఆర్‌డిఏ నిర్దేశిత నిబంధనల ప్రకారం ఐడిబిఐబ్యాంకులో వాటాలను తగ్గించుకునేందుకు ఎల్‌ఐసికి 12 ఏండ్ల కాల వ్యవధి ఉంది. అందులోనూ, ఐడిబిఐ బ్యాంక్‌ బ్రహ్మాండమైన పురోగతి సాధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐడిబిఐ బ్యాంక్‌లో వాటాలు తొందరపడి ఎల్‌ ఐసి ఉపసంహరించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఐడిబిఐ బ్యాంకులో మెజార్టీ వాటాలను ఎల్‌ఐసి సంస్థకు అమ్మినప్పుడే ఐడిబిఐ ను ప్రయివేటు బ్యాంకు కింద జమకట్టారు. తాజాగా బ్రిటన్‌తో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలో దేశీయ సంస్థల వాటాల కొనుగోలులో వారికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల్లో వారి వాటాతో బాటు యాజమాన్య హక్కులు పెరుగు తాయి. అంటే ఇది దేశీయ బ్యాంకులను విదేశీ సంస్థలకు అప్పగించడమే అవుతుంది

ఐడిబిఐ బ్యాంక్‌ను ప్రయివేటుచేసిన పక్షంలో తమకు లభించే పెన్షన్‌ ప్రయోజనాలు, విహెచ్‌ఎస్‌(ఆరోగ్య సౌకర్యాల కల్పన) పరిస్థితి ఏమిటని ఐడిబిఐ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం, ఆర్ధిక మంత్రిత్వ శాఖ కు కొంతకాలం క్రితం లేఖ రాసింది. ఇంతవరకు బదులు లేదు!! ఐడిబిఐ బ్యాంకు షేర్లను కొనుగోలుకు జారీ చేసిన పత్రాల్లో (డిఆర్‌ఎచ్‌పి) ఎక్కడా పెన్షనర్లకు చెల్లింపు విషయం ప్రస్తావించలేదు. ఐడిబిఐ ప్రభుత్వ రంగంలో ఉండగా ఒక స్వచ్ఛంద ఫండ్‌ను పెన్షన్‌ చెల్లింపుల కోసం ఏర్పాటు చేశారు. ఈ ఫండ్‌ ద్వారా 1700 మంది పెన్షనర్లకు చెల్లింపులు ప్రస్తుతానికి జరుగుతున్నాయి. అలాగే వీహెచ్‌ఎస్‌ స్కీం ద్వారా వైద్య ఖర్చులకు చెల్లిస్తున్నారు. భవిష్యత్‌ సంగతేమిటో చెప్పాలన్న ఐడిబిఐ రిటైర్డ్‌ ఉద్యోగుల ప్రశ్నకు అటు ప్రభుత్వం, ఇటు నిటి ఆయోగ్‌ సంస్థ ఎందుకు బదులు చెప్పడం లేదు? భవిష్యత్‌లో పెన్షనర్లకు కరువు భత్యం పెంపు/ చెల్లింపులు నిరాటంకంగా చేస్తారన్న హామీ ఉందా విషయంపై స్పష్టతనివ్వలేదు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఐడిబీఐ బ్యాంకు వాటాలను పూర్తిగా ప్రయివేటుకు ధారాదత్తం చేయడం దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం.

జి.తిరుపతయ్య, పి.సతీష్‌

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img