Tuesday, September 16, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యా నుంచి చమురు కొంటారేం?

రష్యా నుంచి చమురు కొంటారేం?

- Advertisement -

మీ ఆంక్షలు కఠినంగా లేవు
యూరప్‌పై ట్రంప్‌ చిర్రుబుర్రు

వాషింగ్టన్‌ : రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌, చైనా దేశాలపై మండిపడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు తాజాగా యూరోపియన్‌ భాగస్వాములపై చిర్రుబుర్రులాడుతున్నారు. యూరోపియన్‌ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును కొనసాగించడం తనకు సుతరామూ ఇష్టం లేదని ఆయన తెలిపారు. యూరోపియన్‌ దేశాల ఆంక్షలు కఠినంగా లేవని పెదవి విరిచారు. ట్రంప్‌ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఉక్రెయిన్‌ యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు.

‘రష్యా నుంచి యూరప్‌ చమురును కొంటోంది. నాకు అది ఇష్టం లేదు. ఆ దేశాలు విధిస్తున్న ఆంక్షలు కూడా కఠినంగా లేవు. ఆంక్షలు విధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నా చర్యలకు అనుగుణంగా వారు ఆంక్షలను కఠినతరం చేయాల్సి ఉంటుంది’ అని ట్రంప్‌ అన్నారు. చమురు అమ్మకాల ద్వారా రష్యా ఆర్థికంగా ప్రయోజనం పొందుతోందని ఆరోపించారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలు కూడా లబ్ది పొందుతున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌, చైనా, యూరోపియన్‌ దేశాలను ప్రస్తావించారు.

రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌పై యాభై శాతం టారిఫ్‌ విధించానని గుర్తు చేశారు. చైనాపై యాభై నుంచి వంద శాతం వరకూ సుంకాలు విధించాలని ట్రంప్‌ ఇటీవల నాటో భాగస్వామ్య దేశాలను కోరారు. రష్యాకు చైనా ఆర్థిక సాయం అందజేస్తోందని, ఉక్రెయిన్‌ ఘర్షణలో తన సైనిక సామర్ధ్యాన్ని బలోపేతం చేసుకుంటోందని మండిపడ్డారు. దీనిపై చైనా ఘాటుగానే స్పందించింది. సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు దోహదపడతాయని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి చెప్పారు. యుద్ధాలు సమస్యలను పరిష్కరించలేవని, ఆంక్షలు పరిస్థితిని మరింత జటిలం చేస్తాయని తెలిపారు. యుద్ధంలో తాము భాగస్వాములం కాబోమని, ఆ ఆలోచన కూడా చేయబోమని చైనా స్పష్టం చేస్తోంది. చర్చలే సమస్యకు పరిష్కారమని తెలిపింది. యూరప్‌తో సన్నిహిత సహకారాన్ని కోరుకుంటున్నామని చెప్పింది.

ఖతార్‌ విషయంలో జాగ్రత్త : ఇజ్రాయిల్‌కు హితవు
ఖతార్‌కు సంబంధించి చర్యలు చేపట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఇజ్రాయిల్‌కు ట్రంప్‌ హితవు పలికారు. అమెరికా కీలక భాగస్వామిగా ఖతార్‌ నిర్వ హిస్తున్న పాత్రను ఆయన ప్రస్తావించారు. మారిస్‌టౌన్‌ విమానాశ్రయంలో ట్రంప్‌ విలేకరులతో మాట్లాడారు. ఖతార్‌లో గత వారం హమాస్‌ నేతలపై వైమానిక దాడులు జరిగిన నేపథ్యంలో ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూకు ఏమైనా సందేశం ఇస్తారా అని విలేకరులు ప్రశ్నించగా ‘నా సందేశం ఏమంటే చాలా, చాలా జాగ్రత్తగా ఉండమని. హమాస్‌ గురించి వారు ఏదో ఒకటి చేయాల్సి ఉంది. కానీ ఖతార్‌ అమెరికాకు ఒక గొప్ప భాగస్వామి. చాలా మందికి ఆ విషయం తెలియదు’ అని అన్నారు.

ట్రంప్‌ కొద్ది రోజుల క్రితం న్యూయార్క్‌లో ఖతార్‌ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ బిన్‌ జాసిమ్‌ అల్‌ థానీకి విందు ఇచ్చారు. ఖతార్‌ నేతను ఒక అద్భుతమైన వ్యక్తిగా ట్రంప్‌ ప్రశంసించారు. ఖతార్‌ గురించి ప్రజలు చెడ్డగా మాట్లాడు కుంటున్నారని, వారు అలా అనుకోకూడదని, ఖతార్‌ తన ప్రతిష్టను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని ట్రంప్‌ చెప్పారు. ఈ సమావేశం జరిగిన తర్వాత దోహాలోని హమాస్‌ నేతలే లక్ష్యంగా ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఓ ఖతార్‌ భద్రతాధికారి సహా ఆరుగురు చనిపోయారు. అయితే ఈ దాడుల నుంచి హమాస్‌ నేతలు తప్పించుకున్నారు. ఇజ్రాయిల్‌ దాడిని ఉగ్రవాద చర్యగా ఖతార్‌ అభివర్ణించింది. ఈ దాడిపై ట్రంప్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -