టైటిల్ వేటలో లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో ఢీ
నేటి నుంచి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్
ప్రపంచ టెస్టు క్రికెట్‌లో మరో అల్టీమేట్ టెస్టుకు రంగం సిద్ధమైంది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్ వేటలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. అత్యధిక ఐసీసీ టైటిళ్లు సాధించిన ఆస్ట్రేలియా నేడు ఫైనల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుండగా.. ఐసీసీ తొలి టైటిల్ కోసం దక్షిణాఫ్రికా ఎదురుచూస్తోంది. ఐసీసీ టోర్నమెంట్లలో అద్భుత ప్రదర్శన చేసినా.. ఊహంచని పరిణామాలతో పరాభవం ఎదుర్కొన్న సఫారీలు నేటి నుంచి ఆరంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లోనైనా మెరుస్తారా? కంగారూలను దాటేసి గదను దక్కించుకుంటారా?. నేటి నుంచి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆరంభం.
నవతెలంగాణ-లార్డ్స్
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా.. ప్రపంచ క్రికెట్‌లో రెండు అగ్రశ్రేణి జట్లు. నైపుణ్యం, బలా బలాలు పరంగా ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా సమవుజ్జీగా నిలువగలదు. టెస్టు క్రికెట్‌లో ప్రస్తుత ఫామ్ చూస్తే.. దక్షిణాఫ్రికానే మెరుగ్గా కనిపిస్తోంది. కానీ, ఐసీసీ టోర్నమెంట్లలో ఆస్ట్రేలియాది అత్యంత విజయవంతమైన ప్రస్థానం కాగా.. దక్షిణాఫ్రికాకు కనీసం ఒక్క టైటిల్ లేదు. మూడు ఫార్మాట్లలో ఈ నాలుగేండ్లలో నాల్గో ఐసీసీ టైటిల్ కోసం ఆస్ట్రేలియా సిద్ధమవుతుండగా.. క్రికెట్ చరిత్రలోనే తొలి ఐసీసీ టైటిల్ కోసం దక్షిణాఫ్రికా ఎదురుచూస్తోంది. నేటి నుంచి ఆరంభం కానున్న ఐసీసీ 2025 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పోటీపడుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా రెండో టైటిల్‌పై కన్నేయగా.. దక్షిణాఫ్రికా చారిత్రక ఐసీసీ గద లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
సమవుజ్జీల సమరం
బవుమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా సమతూకంగా కనిపిస్తోంది. ఎడెన్ మార్‌క్రామ్, బవుమా, ముల్డర్, రియాన్ రికెల్టన్ సహా ట్రిస్టన్ స్టబ్స్, డెవిడ్‌లతో కూడిన బ్యాటింగ్ లైనప్ బలోపేతంగా ఉంది. గత ఏడు టెస్టుల్లో ఓటమెరుగని రికార్డు దక్షిణాఫ్రికా ఆత్మ విశ్వాసం రెట్టింపు చేస్తోంది. బంతితో కగిసో రబాడ ముందుండి నడిపిస్తున్నాడు. మార్కో జాన్సెన్, లుంగిసాని ఎంగిడిలు సైతం మంచి ఫామ్‌లో ఉన్నారు. కేశవ్ మహరాజ్‌కు ఇక్కడి పరిస్థితుల్లో మాయ చేయటం బాగా తెలుసు. బ్యాట్‌తో, బంతితో బలంగా కనిపిస్తోన్న దక్షిణాఫ్రికా ఫామ్ పరంగా ఫేవరేట్‌గా కనిపిస్తోంది. మరోవైపు ఆస్ట్రేలియాకు ఘనమైన చరిత్ర ఉంది. ఐసీసీ ఫైనల్స్‌లో ఎదురులేని ప్రస్థానం ఆసీస్ సొంతం. చాంపియన్ల తరహా మనస్తత్వం కంగారూలకు అదనపు బలం. డెవిడ్ వార్నర్ వీడ్కోలుతో టాప్ ఆర్డర్‌లో ఆసీస్ కష్టాలు చవిచూస్తోంది. టాప్ ఆర్డర్ ఆశించిన ప్రదర్శన చేయటం లేదు. ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్‌లు టాప్-3లో బ్యాటింగ్‌కు రానున్నారు. స్టీవ్ స్మిత్ ఈ ఏడాది మెరుగ్గా రాణిస్తున్నాడు. ట్రావిశ్ హెడ్‌కు ఫైనల్స్‌లో చెలరేగే అలవాటు ఉన్న సంగతి తెలిసిందే. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోశ్ హాజిల్‌వుడ్ పేస్ త్రయం ఏ జట్టునైనా ఇబ్బంది పెట్టగలదు. బంతితో ప్రమాదకరంగా కనిపిస్తోన్న ఆసీస్‌కు బ్యాటర్లు జతకలిస్తే.. మరో ఐసీసీ టైటిల్ కంగారూల సొంతమవటం లాంఛనమే.
పిచ్, వాతావరణం
లార్డ్స్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. మ్యాచ్ సాగుతున్న కొద్ది వర్షం సూచనలు ఉన్నప్పటికీ.. ఫలితంపై ఎటువంటి ప్రభావం పడే అవకాశం లేదు. తొలి రెండు రోజుల్లో అధిక ఉష్ణగ్రతలతో పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం లభించనుంది. ఆఖరు రెండు రోజుల ఆటలో స్పిన్ కీలక పాత్ర పోషించనుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపవచ్చు. జూన్ ఆరంభంలో లార్డ్స్‌లో ఆడిన అనుభవం ఇటు ఆసీస్‌కు, అటు సఫారీలకు లేదు.
తుది జట్లు (అంచనా) :
దక్షిణాఫ్రికా : ఎడెన్ మార్‌క్రామ్, రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), వియాన్ ముల్డర్, తెంబ బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డెవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెరెనె, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.
ఆస్ట్రేలియా : ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిశ్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్, జోశ్ హాజిల్‌వుడ్.
సఫారీలు సాధిస్తారా?
- Advertisement -
- Advertisement -